Suryaa.co.in

Andhra Pradesh

సీఐడీ ప్రస్తావనే లేదు.. ఇప్పటికే 12 మంది అరెస్టు

– ఒంగోలు ఎస్పీ

ఒంగోలు: నగరంలో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పత్రాల కుంభకోణం వైకాపాలో ప్రకంపనలు రేపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ స్పందించారు.ఒంగోలు నకిలీ పత్రాలు, స్టాంప్స్‌ కుంభకోణం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ద్వారానే దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. సీఐడీ దర్యాప్తు చేస్తుందనే ప్రస్తావనే లేదని ఆమె తేల్చి చెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతుందనేది అవాస్తవమన్నారు. ”ఇప్పటికే చాలా పత్రాలను పరిశీలించాం. ఇంకా అనేక పత్రాలు, లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. చాలా పాత రికార్డ్‌లను సైతం పరిశీలిస్తున్నాం. దీనికి కొంత సమయం అవసరం అవుతుంది. ఇప్పటికే పలువురి నిందితులను గుర్తించాం. 12మందిని అరెస్ట్ చేశాం” అని ఎస్పీ మలికా గార్గ్‌ వివరించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన పంచాయతీపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదలైంది. అందులో.. ‘ఒంగోలులో వెలుగుచూసిన కుంభకోణాన్ని సీఐడీ సహకారంతో నిగ్గు తేలుస్తాం. ఇందులో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదు. అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకుని కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ధనుంజయరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సీఎం కార్యదర్శి హామీ ఇచ్చినందున…నేను సరెండర్‌ చేసిన భద్రతా సిబ్బందిని తిరిగి తీసుకుంటున్నా’ అని బాలినేని వెల్లడించారు.

LEAVE A RESPONSE