Suryaa.co.in

Andhra Pradesh

ఈ వారంలో టీడీపీ-జనసేన సీట్లపై స్పష్టత?

ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ
ఉమ్మడి సభలపై రోడ్‌మ్యాప్
బాబు-పవన్ చర్చ

టీడీపీ-జనసేన పోటీ చేసే స్థానాలపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మధ్య చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలతోపాటు.. ఉమ్మడి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఆ ప్రకారంగా.. రెండు పార్టీలు ఎన్ని చోట్ల పోటీ చేయాలన్న దానిపై, వారిద్దరి మధ్య చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఉమ్మడి ప్రత్యర్ధి వైసీపీ రాజకీయంగా లాభపడకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ పతనమే ధ్యేయంగా.. క్షేత్రస్థాయి వాస్తవాలు సేకరించి, ఆ ప్రకారంగా సీట్ల సర్దుబాటు ఉండాలని నిర్ణయించారు. పొత్తు-సీట్ల సర్దుబాటుపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని, ఇరు పార్టీలూ ధీటుగా తిప్పికొట్టాలని తీర్మానించారు. తాజాగా జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని నిర్ణయించారు.

కాగా ఇరువురు కలసి నిర్వహించే బహిరంగ సభలపైనా చర్చించారు. బాబు-పవన్ కలసి కొన్ని చోట్ల ఉమ్మడి సభలు నిర్వహిస్తే, దాని ఫలితాలు ఊహించనంత ఉంటాయన్న నేతల సూచనలపైనా చర్చించారు. దానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌లు పరిశీలించారు. జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన సమన్వయ కమిటీల పనితీరుపైనా ఇరువురు చర్చించారు. భవిష్యత్తులో ఇలాంటి ఉమ్మడి సమావేశాలు మరిన్ని జరగాలని నిర్ణయించారు. పవన్‌కు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు.

 

LEAVE A RESPONSE