Suryaa.co.in

National

వర్గీకరణ రాజ్యాంగ ఉల్లంఘన కాదు

-జస్టిస్‌ చంద్రచూడ్‌

చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ జస్టిస్‌ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికరణలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్లు కాదని చెప్పారు.

ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్‌ 341(2)కు ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదని అన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్‌ 15(వివక్ష లేని), ఆర్టికల్‌ 16(సమాన అవకాశాలు) కింద ఆయావర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి రిజర్వేషన్లను కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్‌ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నపుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నపుడు వర్గీకరణ చేపట్టవచ్చని చెప్పారు.

నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఉప వర్గీకరణ మార్గం అయినపుడు వర్గీకరణ రాజ్యాంగ బద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించిన ఒకేరకమైన కులాలు కాదని చెప్పారు.

ఎస్సీ కులాలను ఆర్టికల్‌ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవని అన్నారు. కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్‌ 341 రూపంలో ఒకచోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించదగ్గ, విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయవచ్చని చెప్పారు.

ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధం అవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలదేనని జస్టిస్‌ గవాయ్‌ అన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్‌ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.

వందల ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ, ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికరణే ప్రాతిపదిక అని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోపమని జస్టిస్‌ గవాయి వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్‌ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొంటున్నందుకే ఉప వర్గీకరణ చేయాల్సి వస్తోందని తెలిపారు.

LEAVE A RESPONSE