చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ శాఖామంత్రి పి. నారాయణ గురువారం పరిశీలించారు. అనంతరం టిడ్కో గృహాలను సందర్శించి, లబ్దిదారుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన బస్సు ను ప్రారంభించారు. ఇది చిలకలూరిపేట నుండి నరసరావుపేట వయా టిడ్కో గృహాల మీద గా వెళ్లనున్నది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు కూడా వున్నారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ పుల్లారావు మాట్లాడుతూ… ఈ రోజు మంత్రి నారాయణ టిడ్కో లబ్దిదారులకు వరాల జల్లు కురిపించారని అన్నారు. లబ్ధిదారుల సౌకర్యం కోసం ఒక ఆసుపత్రి, కమ్యూనిటీ హాలు, పాఠశాల ఏర్పాటుకు ఆయన ఆమోద తెలిపారని అన్నారు. అలాగే 300 గజాలలో గృహాలు తీసుకున్న లబ్దిదారులకు ఏటువంటి లోన్ లేకుండా ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారన్నారు. లబ్ధిదారులు గృహాలను అమ్మటం లేక అద్దెల కివ్వటం చేయరాదని తెలిపారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ… భారతదేశంలోనే మొట్టమొదట షేర్వాల్ టెక్నాలజీతో ఈ గృహాలు నిర్మించామని అన్నారు. దీనికి మాములుగా అయ్యా ఖర్చు కన్నా రెట్టింపు అవుతుందని తెలిపారు. అలాగే లబ్దిదారుల కోరికమేర కమ్యూనిటీ హాలు, పాఠశాల, ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని అన్నారు. మార్చి నెల లోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు.
చంద్రబాబు పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు గేటెడ్ కమిటీ తరహాలో వీటిని నిర్మించామని వివరించారు. అలాగే ఆగస్టు 15వ తేదీన 100 అన్నా క్యాంటీన్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. మిగిలిన వాటిని ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తామని తెలిపారు.