ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుగారికి,
నమస్తే! ఈ వినతి పత్రమైనా మీకు చేరుతుందని ఆశిస్తున్నా!
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో ఈనెల 28, 29 తేదీలలో విచారణకు రానున్న కృష్ణా నదీ జలాల అంశంపై మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాధ్రీశ్వరరావుతో పాటు రైతు సంఘాల నేతలు శ్రీయుతులు అక్కినేని భవానీప్రసాద్, వై. కేశవరావు, కె.వి.వి. ప్రసాద్, బొజ్జా దశరథరామిరెడ్డి, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణలతో కూడిన ప్రతినిధి బృందం మీకు వినతిపత్రం అందజేయాలని అపాయింట్మెంట్ కోసం జూలై 30వ తేదీన మీ అపాయింట్మెంట్స్ వ్యవహారాలు చూసే అధికారికి వాట్సాప్ ద్వారా విజ్ఞప్తిచేస్తూ మెసేజ్ పంపాను. ఫోన్ ద్వారా కూడా ప్రయత్నించాను.
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ లేవనెత్తిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ వైఖరిని తెలియజేయడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగియనున్నది. జలవనరుల శాఖకు సంబంధించిన అంశాలపైన మీరు ఆగస్టు 6న సమీక్ష చేసినట్లు దినపత్రికల్లో చదివాను. ఈ సమస్య ప్రస్తావన వార్తల్లో ఎక్కడా కనపడలేదు.
కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ కు కల్పించిన హక్కుల పరిరక్షణ జీవన్మరణ సమస్యగా పరిణమించింది. రైతు సంఘాల నాయకుల అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకురావాలన్న సదుద్దేశంతో మీ అపాయింట్మెంట్ కోసం నేను చొరవ తీసుకొని ప్రయత్నించాను. మీతో అపాయింట్మెంట్ నేటి వరకు లభించలేదు. ఈ నేపథ్యంలో క్లిష్టంగా పరిణమించిన కృష్ణా నదీ జలాల సమస్యపై నాకున్న అవగాహనను మీ దృష్టికి తీసుకురావడం ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నా బాధ్యతగా భావించాను. ఈ వినతిపత్రాన్ని ఇ-మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా పంపుతున్నాను. ఇది మీకు చేరుతుందని, తప్పక పరిశీలిస్తారని ఆశిస్తున్నాను.
అభివందనములతో
టి.లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక