– ఆయన ఆలోచనలు, వేగాన్ని అందుకోవాలి
– అధికారులు దృక్పథాన్ని మార్చుకోవాలి
– సృజనాత్మకతతో పనిచేయాలి
– ఉన్నతాధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు
– సాధారణ బదిలీల తీరుపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి
– మున్నెన్నడూ లేనివిధంగా బదిలీ ఆదేశాల్ని పాటించిన 99 శాతం ఉద్యోగులు
అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో నూతన శకాన్ని ఆవిష్కరించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం తపిస్తున్నారని, వైద్య శాఖ ఉద్యోగులు వైఖరిని మార్చుకుని ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆధునికత, వేగానికనుగుణంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హితవు పలికారు. వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో మంత్రి పలు విషయాలపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సృజనాత్మకత, ఆధునిక సాంకేతిక విజ్ఞాన అవలంబన, ఆవిష్కరణల ఆధారంగా ప్రజారోగ్యాన్ని కొత్తపుంతలు తొక్కించడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. ఆయన బాటలో నడవడానికి ప్రభుత్వ వైద్యులు, ఇతర సహాయక సిబ్బంది కంకణబద్ధులు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
వైద్య సిబ్బంది ఆత్మవిమర్శ చేసుకోవాలి
తాము విధులు నిర్వహిస్తున్న తీరు ముఖ్యమంత్రి ఆశయాల సాధనకు తోడ్పడుతుందా లేదా అనే వైద్యులు, ఇతర సిబ్బంది ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకుసాగాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో అన్నారు. బండి నడుస్తోందిలే అన్న రీతిలో కాకుండా యావత్తు సిబ్బంది వినూత్నంగా ఆలోచించి ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ప్రజాసమస్యలపై తక్షణ స్పందన అవసరం
ప్రజాప్రతినిధులు, సామాన్యులు పలు ప్రజాసమస్యల్ని తన దృష్టికి తెచ్చినప్పుడు వాటిని సంబంధిత అధికారులు శీఘ్రమే పరిశీలించి తగు సమాచారాన్ని అందజేయాలని, ఈ విషయంలో ఆలస్యం జరగడంపై మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యల్ని పట్టించుకోకపోతే అది ప్రజాస్వామ్య ఉల్లంఘనకిందకు వస్తుందని, ఈ విషయంపై వైద్యులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
సాధారణ బదిలీల తీరుపై మంత్రి హర్షం
నేటి సమీక్షలో భాగంగా ఈ ఏడాది జూన్‌లో వైద్యారోగ్య శాఖ చేపట్టిన సాధారణ బదిలీల తీరు, ఫలితాలపై మంత్రి విభాగాధిపతులతో చర్చించారు. 7,200కు పైగా వైద్యులు, పాలనా సిబ్బందిని బదిలీ చేయగా వారిలో నిర్ణీత గడువులో 99 శాతం మంది కొత్త పోస్టింగ్ ల్లో చేరినట్టు ఉన్నతాధికారులు వివరించారు. నియమాల మేరకు వివాద రహితంగా భారీ స్థాయిలో సాధారణ బదిలీల ప్రక్రియను విజయవంతంగా ముగించినందుకు విభాగాధిపతులను, అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. గతానికి భిన్నంగా వివాద రహితంగా బదిలీలు జరిగాయనడానికి 99 శాతం మంది ఉద్యోగులు బదిలీ ఆదేశాలను ఆమోదించడం నిదర్శనమని మంత్రి అన్నారు.
ఖాళీలను భర్తీ చేయాలి
విభాగాల వారీగా వివిధ స్థాయిల్లో మంజూరైన పోస్టులు, ఖాళీలను మంత్రి సమీక్షించారు. గతేడాది జూన్ నుండి వివిధ విభాగాలు చేపట్టిన నియామకాల వివరాలను మంత్రి తెలుసుకున్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన ఖాళీలను ప్రణాళికాబద్దంగా భర్తీ చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆయుష్, మందుల నియంత్రణ విభాగం, ఆహార పదార్ధాల కల్తీ నిరోధక విభాగాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేసి ఈ విభాగాలు సమర్ధవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
సృష్టి ఫెటిలిటీ సెంటర్ వ్యవహారంలో జిల్లాల్లో అధికారులు స్పందించిన తీరు సంతృప్తినివ్వలేదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మినహా మిగతా చోట్ల ఎక్కడా అధికారులెవరూ పట్టించుకోకపోవడం తగదని మంత్రి హితవు పలికారు. వాట్సప్ గవర్నెన్స్‌ను ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టినట్టయితే రిపోర్టులు వెంటనే రోగులకు పంపించేందుకు సులువవుతుందని చెప్పారు. వైద్యారోగ్యశాఖలో క్రమంగా వినూత్న ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, 10 విభాగాధిపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.