– వినూత్న ప్రాజెక్టులు చేపట్టిన శశిథర్ ఫౌండేషన్‌ను అభినందించిన ముఖ్యమంత్రి
నెల్లూరు/వెంకటాచలం: నందగోకులం లైఫ్‌స్కూల్, నంది పవర్ బుల్ ప్రాజెక్టు, బయో ఎనర్జీ ఇథనాల్ ప్రాజెక్టులను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. శుక్రవారం వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామానికి విచ్చేసిన సీఎం ఈ ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి ప్రారంభించారు. వినూత్నమైన ఆలోచనలతో పి`4 స్ఫూర్తితో ఈ ప్రాజెక్టులను ఏర్పాటుచేయడం పట్ల చింతా శశిథర్ ఫౌండేషన్ చైర్మన్ శశిథర్ను ప్రత్యేకంగా అభినందించారు.
నందగోకులం లైఫ్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం
నందగోకులం లైఫ్ స్కూల్‌ను సీఎం సందర్శించారు. విద్యార్థులతో కలిసి సరస్వతీ దేవి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. నవనీతం బ్లాక్‌ను, నందగోకులం లైఫ్స్కూల్ను ప్రారంభించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థుల కంప్యూటర్ పరిజ్ఞానం, అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆసక్తి, గణిత, సైన్సు ప్రదర్శనలను స్వయంగా పరిశీలించి అభినందించారు. టీచర్‌గా మారి విద్యార్థుల తెలివితేటలను పరీక్షించారు. మంచి లక్ష్యాలతో టెక్నాలజీని అందుపుచ్చుకుని భావిభారత పౌరులుగా రాణించాలని విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులకు ఆల్దబెస్ట్ చెప్పారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచస్థాయి మౌలికవసతులతో విద్యను అందిస్తున్న ఫౌండేషన్‌ను అభినందించారు.