Suryaa.co.in

Andhra Pradesh

మంత్రులు, ఎంపీలు,ముఖ్యనేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

– వరద బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపు

అమరావతి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ముఖ్యనేతలు, మంత్రులు, ఎంపీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు సాయం అందించాలని పార్టీ శ్రేణులకు బాబు పిలుపునిచ్చారు. ఇంకా.. సీఎం ఏమన్నారంటే.. తుపాను ప్రభావంతో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. ఊహించని విధంగా వరదలు సంభవించాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గించగలిగాం.

• ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సొంత డబ్బులు ఖర్చు చేసి ప్రజలకు సాయం అందించాం. మన పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశాం. పార్టీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలి.
• విపత్తులను అంచనా వేసి ముందుగానే సన్నద్ధం చేసేందుకు 2014-19 మధ్య ఏర్పాటు చేసిన పటిష్ఠమైన వ్యవస్థను గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. దెబ్బతిన్న వ్యవస్థలను కూడా మళ్లీ నిర్మించాల్సి ఉంది.
• కృష్ణానది పరివాహకంలో ఉన్నవారంతా ప్రజలకు అండగా ఉండాలి. ప్రభుత్వం నుండి సాయం అవసరమైతే సమాచారం అందించాలి.
• ప్రభుత్వం అందించే సహాయక కార్యక్రమాల్లోనూ శ్రేణులు భాగస్వాములు కావాలి.
• మంత్రులు, ఎంపీలు కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారో కూడా సమీక్ష చేస్తాం. ఎమ్మెల్యేలు కూడా ప్రజల వద్దకు వెళ్లాలి.
• అధికారంలో ఉన్నప్పుడు మనం సమర్థవంతంగా పని చేస్తే ప్రజల్లో మనపట్ల, మన ప్రభుత్వం పట్ల సానుకూల భావన కలుగుతుంది.
• హుదుద్‌ తుఫాన్ సమయంలో విశాఖలో వారం రోజులు ఉండి పరిస్థితులు చక్కదిద్దాం. దీంతో వారు 2019 ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిపించారు. మనపై నమ్మకంతోనే మొన్నటి ఎన్నికల్లో పెద్ద మెజారిటీలు ఇచ్చారు.
• నేడు నుండి మూడు రోజుల పాటు పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టాలి.
• 30 ఏళ్ల క్రితం నేను ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాను…ఈ 30 ఏళ్లలో ఎన్నో సానుకూల, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాం.
• కార్యకర్తలు, నాయకుల త్యాగాలను గుర్తించేందుకు వర్కవుట్ చేస్తున్నాం. మనమంతా సమిష్టిగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొద్దాం.
• ప్రజలకు, పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలి. ప్రజల్ని పట్టించుకోని వైసీపీ గతి ఏమైందో మొన్నటి ఎన్నికల్లో చూశాం.
• వర్షం ప్రభావం ఉన్నా 93 శాతం పెన్షన్లు పంపిణీ చేయడం సంతోషకర విషయం.

LEAVE A RESPONSE