విశ్వ క్రీడా యవనికలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు
శుక్రవారం అమరావతిలోని సచివాలయానికి వచ్చిన వారిద్దరినీ జగన్ అభినందించారు. ఈ సందర్భంగా వారి ప్రతిభను జగన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రోజా కూడా పాల్గొన్నారు.
ఇటీవలే బ్యాంకాక్‌లో జరిగిన థామస్ కప్‌ను భారత్ గెలుచుకోవడంలో కిడాంబి శ్రీకాంత్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. మొత్తం 5 రౌండ్లలో భారత్ మూడు రౌండ్లను గెలవగా… అందులో ఓ రౌండ్ శ్రీకాంత్ గెలిచినదే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మరింత మేర సత్తా చాటి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయాలని శ్రీకాంత్‌ను జగన్ కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌కు షటిల్ రాకెట్లను జగన్ బహూకరించారు.
ఇదిలా ఉంటే.. కర్నూలుకు చెందిన బధిర క్రీడాకారిణి షేక్ జాఫ్రిన్ టెన్నిస్‌లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను యినుమడింపజేసేలా సత్తా చాటారు. బధిరుల ఒలంపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించారు. ఈ నేపథ్యంలో జాఫ్రిన్‌కు అవసరమైన మేరకు తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించిన జగన్.. ఆమె విద్యార్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.