– రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
– ఫెడరేషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానం
గుడివాడ, సెప్టెంబర్ 22: కరోనా కష్టకాలంలో జగనన్న చేదోడు వాదోడు పథకం ద్వారా రాష్ట్రంలోని టైలర్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) చెప్పారు.బుధవారం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ గా ఒంగోలుకు చెందిన షేక్ సుభాన్ బి నియమితులయ్యారని చెప్పారు. ఈనెల 26వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్కి నాగేశ్వరరావు అధ్యక్షతన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలంటూ మంత్రి కొడాలి నానిని ఆహ్వానించారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం సందర్భంగా కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆదుకుంటానని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. దీనిలో భాగంగా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లను ఆదుకునేందుకు జగనన్న చేదోడు వాదోడు పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు.
కరోనా కారణంగా లాక్ డౌన్ వల్ల టైలర్లు తమ దుకాణాలను తెరవలేదని చెప్పారు. ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవించే నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు చేయూత నివ్వడానికి, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రతి సంవత్సరం రూ. 10 వేల చొప్పున ఐదేళ్ల పాటు రూ. 50 వేల వరకు అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని చెప్పారు. వచ్చే 2023 వరకు లబ్ధిదారులు అందరికీ ప్రతి ఏటా రూ. 10 వేల చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు అందరూ వెనుకబడిన తరగతులకు చెందిన వారేనని, వీరికి చేదోడు వాదోడుగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. టైలర్లంతా ఐక్యంగా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. టైలర్ల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫెడరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ఫెడరేషన్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన చైర్మన్ ను నియమించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. అనంతరం మంత్రి కొడాలి నానికి గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్ పుష్ప గుచ్చం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి చాంద్ బాషా, ట్రెజరర్ ముమ్ములేటి మంగరాజు, ఉపాధ్యక్షుడు చలపాక సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి కొడాలి నరసింహారావు, గౌరవ మహిళా అధ్యక్షురాలు చలసాని ఉమారాణి, మహిళా అధ్యక్షురాలు సానా పద్మావతి, మహిళా కార్యదర్శి అగనపర్తి అన్నపూర్ణ, మహిళా అధ్యక్షురాలు పిన్నమనేని కవిత తదితరులు పాల్గొన్నారు.