Suryaa.co.in

Features

పురుష గాత్రజుడు పిబిఎస్

-డా.చల్లా.జయదేవ్
అది 1964 అక్టోబరు మాసం లోని ఒక వెన్నెల రాత్రి మహా కవి విశ్వనాధ సత్యనారాయణ గారు మీమేడ మీద ఆరు బయట పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు.పద్మనాభం అనే అయన పరిచయస్తుడు కూడా పక్కనే మరో కుర్చీలో ఉన్నారు. అంతలో అయన గదిలోని రేడియో నుంచి వివాహ బంధం అనే సినిమాలో పి .బి..శ్రీనివాస్ -భానుమతి పాడిన నీటిలోనా-నింగిలోనా అనే పాట వస్తోంది. సినిమాలు-సినిమా పాటలు అంటే అంతగా ఆశక్తి చూపని అయన కి పాడేది ఎవరో తెలియక పక్కనే ఉన్న పరిచయస్తుడిని ఆ పురుష గాత్రం ఎవరిది అని అడిగారు. పి .బి.శ్రీనివాస్ అని అయన చెప్పగానే పురుష గాత్రం అంటే అలా ఉండాలి అని మెచ్చుకున్నారు. ఇదంతా ఎందుకంటే నేడు అయన జన్మ దినం కనుక.
పిబి తండ్రి ఫణింద్రస్వామి శ్రీనివాస్ జాతకం చూపడానికి వెళ్ళినపుడు జ్యోతిష్కుడు ఈ అబ్బాయి గాయకుడిగా రాణిస్తాడు కానీ రావలసినంత గుర్తింపుకు నోచుకోడు అని చెప్పినా అయన కొడుకుని గాయక రంగం వైపే వెళ్ళమని ప్రోత్సహించడం తో తన 12 వ ఏటనే అయన తన మొదటి పాట పాడారు.
రోజూ ఆయన్ని చూడాలంటె రాధాకృష్ణ శాలై లో ఉన్న వూడ్లాండ్స్ హోటల్ కి సాయంత్రం 7 గంటలకి వెళితే చాలు. అక్కడ అయన కి ఎప్పుడూ ఒక టేబుల్ రిజర్వు చేసి ఉంటుంది. 2011 లో ఒక ఇంటర్వ్యూ కోసం ఆయన్ని కలవడం జరిగింది. రెండు గంటల పిచ్చాపాటీలో అయన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
1952 లో ఈమని శంకర శాస్త్రి సంగీత దర్శకత్వం వహించిన మిస్టర్ సంపత్ అనే హిందీ చిత్రం ద్వారా అయన గాయకుడి జీవితం మొదలయింది.గీతాదత్ ,షంషాద్ బేగం వంటి ఉత్తర భారత గాయని మణులతో యువళ ,త్రిగళ గీతాలు పాడారు పిబిఎస్. తమిళ వీరపాండ్య కట్టబొమ్మన్ చిత్రం లో జెమినీ గణేషన్కు గళం అందించిన రోజు నుంచి అయన దశ తిరిగింది. అయితే ఏ.ఏం.రాజా పిబి ను అంత త్వరగా తమిళంలో ఎదగనివ్వకుండా అడ్డుపడటంతో కొన్నేళ్లు ఆగాల్సి వచ్చింది.. తెలుగు లో చిగురాకుల ఊయలలో ,వెన్నెలకేల నాపై కోపం,ఓహోహో నీ అందాల చేతులు కందేను పాపం,బుజ్జి బుజ్జి పాపాయి ,హలో మేడం సత్యభామా,అందాల ఓ చిలకా ,అది ఒక ఇదిలే ,నీవే నీవే నిన్నే నిన్నే,నీలి మేఘ మాలఓ,ఓహో గులాబి బాలా వంటి పలు హిట్స్ ఇచ్చారు.
అష్టభాషా కవిగా పేరు పడిన ఆయనలో చాలానే ప్రత్యేకతలున్నా రావలసినంత గుర్తింపు మన తెలుగు సీమలో రాకపోవడం దురదృష్టకరం. 1967 లో “మీ కొంటె చూపులోన “ అనే 6.39 నిమిషాలు డివి కలిగిన తొలి గౙల్ ను కొలంబియ రికార్డ్స్ సంస్థ ఒక రికార్డ్ గా 1967లో విడుదలచేసింది.ఈ గౙల్ రచయిత దాశరథి. సంగీతం ఈమని శంకర శాస్త్రి కాగా గానం చేసి తొలి గజల్ గాయకుడిగా పి.బి.శ్రీనివాస్ వినుతికెక్కారు. తదుపరి 1978 లో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి “కల్పనలు సన్నాయి ఊదే వేళ” అని మొదలయ్యే గౙల్ ను పి.బి.శ్రీనివాస్ వ్రాసి, స్వరపఱిచి, పాడి ప్రసారం చేశారు.అలా చూసినట్లయితే తెలుగులో తొలి గౙల్ గాయకుడు,తె లుగులో తొలి గౙల్ వాగ్గేయ కారుడు : పి.బి.శ్రీనివాస్ అయ్యారు.
బహ్ దూర్ షాహ్ ౙఫర్ వ్రాసిన “కుల్ తా నహీ” అనే ఘజల్ ను 78-79 వత్సరాల మధ్య కాలంలో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం నుంచి పిబిఎస్ స్వరపరచి గానం చేశారు.సాధారణంగా ఎవరికి ఎక్కువగా పాదాభివందనాలు చెయ్యని ఏసుదాస్ పి.బి.ఎస్. ను కలిసినప్పుడల్లా పాదాభివందనం చేసేవారు అంటే అయన గాత్ర పటిమ,పాండిత్యం ఎటువంటివో అర్ధం చేసుకోవచ్చు. కన్నడ రాజకుమార్ కి ఎక్కువ పాటలు పాడిన ఆయనను తనకి వచ్చిన కంఠీరవ గౌరవం పిబిఎస్ వల్లనే వచ్చిందని చెప్పేవారు. పతంజలి యోగశాస్త్ర నియమాలలో చెప్పాలంటే పిబిఎస్ సుష్ణుమా నాడి అయితే దానిని మార్గంగా చేసుకొని ఎదిగిన వారు ఏసుదాస్-బాలసుబ్రమాణ్యంలు ఇళా -పింగళ నాడులు అని చెప్పవచ్చు.
మే-30,2012 లో ఆనంద వికటన్ అనే ప్రముఖ తమిళ వారపత్రికలో ‘విరుంబి కేట్టవళ్’ అన్న పేరుతో ఒక కథ ప్రచురితం అయ్యింది . ప్రముఖ తమిళ కథారచయిత ఎస్. రామకృష్ణన్ ఆ కథను రాశారు. .పి. బి. శ్రీనివాస్ అభిమానిగా ఆయన పాడిన పాటలతో పెనువేసుకుని పోయిన ఒక పాత్రతో ఈ కథ సాగుతుంది. తమిళనాట ఇది చాల గొప్ప కథగా ప్రశంసలందుకుంది.మన తెలుగువారైన పి. బి. శ్రీనివాస్ ప్రధాన పాత్రగా ఒక పరాయి భాషలో వచ్చిందంటే ఆంటే అది ఒక రికార్డ్.ఈ కధ వచ్చిన సరిగ్గా 11 నెలల-16 రోజుల తరువాత అయన స్వర్గస్థులయ్యారు.బెంగుళూరు కి చెందిన సురభి ప్రకాశన అనే ప్రచురణ సంస్థ ఆర్.శ్రీనాధ్ అనే రచయిత రాసిన మాధుర్య సార్వభౌమ అనే పిబిశ్రీనివాస్ జీవిత చరిత్ర పుస్తకాన్ని బాలు-ఏసుదాస్,వాణి జయరాం లు మే-7,2013 న ఆవిష్కరించారు.బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పిబియేస్ ను తమిళ ప్రభుత్వం కళైమామణి అవార్డు తో గౌరవించింది.

LEAVE A RESPONSE