-వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు రూపొందించామని వెల్లడి
-రూ.6,500 కోట్ల పెట్టుబడులతో కొత్త సబ్ స్టేషన్లు.. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులు రూపొందించాం
-మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడులకు హెచ్‌పీసీఎల్‌తో ఎంవోయూలు కుదుర్చుకుంటున్నాం.. కొత్త ప్రాజెక్టులతో మరో 1700 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి
రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టామన్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్‌స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.
నాణ్యమైన విద్యుత్ అందిచే దిశగా అడుగులు వేస్తున్నాం; సీఎం
“14 జిల్లాల్లో ట్రాన్స్‌మిషన్ కెపాసిటి పెంచుతూ సబ్ స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తున్నాం. రూ.3100 కోట్లతో మంచి కార్యక్రమం జరుగుతోంది. వరదల సమయంలో విలీన మండలాల్లో సబ్ స్టేషన్ కేపాసిటీ లేకపోవడంతో కరెంటు కష్టాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ఈ రోజు ఆ ప్రాంత ప్రజలకు అంకితం చేస్తూ సబ్ స్టేషన్లు ప్రారంభిస్తున్నాం. 12 సబ్ స్టేషన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. 16 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం.
ఒకవైపు ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ విస్తరిస్తూ, మరోవైపు క్వాలిటీ పవర్ ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తూ..రైతులకు పగటి పూటే 9 గంటలు విద్యుత్ ఇవ్వాలని మనం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే అధికారులతో చర్చించాను. రూ.1700 కోట్లతో ట్రాన్స్‌మిషన్ ఏర్పాటు చేయాలని అధికారులు చెబితే..ఆ పరిస్థితిని అధిగమించి కేపాసిటీని పెంచాం. ఈ రోజు పగటి పూటే 9 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. రూ.2.49 యూనిట్ సోలార్ పవర్ ఇచ్చే గొప్ప అడుగు కూడా పడింది” అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు
వ్యవసాయానికి కావాల్సిన కరెంటును ఉత్పత్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఖర్చు తగ్గుతోందని, సెప్టెంబర్ 2024కు 3 వేల మెగా వాట్ల పవర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయని, మరోవైపు రూ.3400 కోట్లతో దాదాపుగా 8 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ రోజు శంకుస్థాపనలు చేస్తున్నామని, రూ.6500 కోట్ల పెట్టుబడితో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని రెన్యూబుల్ ఎనర్జీతో 25 వేల స్కూటర్లు తయారు చేసి విజయవాడలో నడుపుతున్నారని అన్నారు.
దీన్ని లక్ష స్కూటర్ల ఉత్పత్తికి ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. స్కూటర్ల కెపాసిటీలో దాదాపుగా 100 ఉద్యోగాలు ఇస్తున్నారని, మరో 200 మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. సోలార్ పార్కులో రెండు పరిశ్రమలు వస్తున్నాయని, ఇందులో 1700 ఉద్యోగాలు వస్తాయిని, హెచ్‌పీ సీఎల్‌తో మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో ఈ రోజు ఎంవోయూలు చేసుకుంటున్నామని, దీని వల్ల 500 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌తో దాదాపుగా రూ.10 వేల కోట్లతో ఎంవోయూలతో పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు.
ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వేగంగా అడుగులు పడి మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభ్యం కావడం, మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు మెరుగైన అడుగులు పడుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా మరింతగా పెంచే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం పేర్కొన్నారు.