– యుద్దానికి సిద్దమే .. మీరే నా బలం
– ఎవరికీ ఎగ్గొట్టే ఉద్దేశం లేదు
– ప్రతిపక్షాలకు నిజం చెప్పే దైర్యం ఉందా
– 8వ తరగతి విద్యార్ధులకు టాబ్ లు
– మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డ
ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాలపైన విరుచుకు పడ్డారు. తీవ్ర వ్యాఖ్యలతో టార్గెట్ చేసారు. దుష్టచతుష్టయం చేస్తున్న దుష్ఫ్రచారం నమ్మవద్దంటూ పిలుపునిచ్చారు. తాను కేవలం చంద్రబాబుతో మాత్రమే పోరాటం చేయటం లేదని.. మారీచులతో.. కుట్రలు -కుయుక్తులు పన్నే వారితో యుద్దం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు – దత్తపుత్రుడు మద్దతు మీడియా పైన ఫైర్ అయ్యారు. వీరంతా కలిసినా తన వెంట్రుక కూడా పీకలేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వారితో యుద్దానికి తాను సిద్దమేనని..ప్రజల మద్దతే తనకు బలమని స్పష్టం చేసారు. జగన్ ఒక్కడే ఇంత మందితో యుద్దం చేస్తున్నాడని.. మీ అందరి మద్దతు ఉందనే నమ్మకంతోనే ముందుడుగు వేస్తున్నానని సీఎం చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళంలో అమ్మఒడి మూడో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేసారు. అక్షరాల 43 లక్షల 96 వేల మందికి పైగా తల్లులకు, తద్వారా దాదాపుగా 80 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. అక్షరాల 6, 595 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలో నేరుగా జమ చేస్తున్నట్లు వివరించారు. నాణ్యమైన చదువులుమన రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో గత మూడేళ్లుగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న సీఎం జగన్ మనిషి తలరాతను మార్చేసే శక్తి చదువుకు ఉందని తెలిపారు. పిల్లలు బడికి వెళ్తేనే చదువు వస్తుందని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలనే 75 శాతం హాజరు నిబంధన తీసుకొచ్చామని వివరించారు.
51 వేల మంది తల్లులకు ఈ విడత నిధులు ఇవ్వలేకపోతున్నామని.. 75 హాజరు లేకపోవటమే దీనికి కారణమని..తనకు కూడా వారికి ఇవ్వకపోవటం పైన బాధగా ఉందన్నారు.ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని..అమ్మఒడి పేరుతో ఎవరికీ ఎగ్గొట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసారు. తాము 51 వేలమందికి ఇవ్వలేకపోతున్నామని కారణం చెబుతూనే.. ఎందుకు పాఠశాలలు – మరుగుదొడ్ల నిర్వహణ కోసం రెండు వేలు మినహాయిస్తున్న విషయాన్ని చెప్పి మరీ నిధులు అందిస్తున్నామని వివరించారు. నిజం చెప్పే ధైర్యం ప్రతిపక్షాలకు ఉందా అంటూ నిలదీసారు. మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం వాగ్దానాలు మూడేళ్లలో అమలు చేసామన్నారు. డబ్బులు ఉన్న వారి పిల్లలకే అందుబాటులో ఉన్న బైజూస్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు.
24 వేలు ఖర్చు చేస్తే కానీ, అందని ఈ యాప్ ఇప్పుడు విద్యార్ధులకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ లో 8వ తరగతి నుంచి పిల్లలకు టాబ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మూడేళ్ల కాలంలో విద్యార్ధుల కోసమే వారి తల్లుల ఖాతాల్లో రూ 52,600 కోట్లు జమ చేశామని వివరించారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల 10 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య పెరిగిందని సీఎం వెల్లడించారు. పేదలకు మంచి చేసే జగన్ మీద విమర్శలు చేసే వాళ్లు ఉన్నారని.. మీరంతా ఆలోచన చేయాలని సూచించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగిందా లేదా అనేది ఆలోచించాలని ముఖ్యమంత్రి కోరారు.