సీఎం చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ

వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. వరుసగా మూడో ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్ల విద్యార్థులకు కిట్లు అందజేశారు. జగనన్న విద్యాకానుక ద్వారా 1 నుంచి 10వ తరగతి వరకు 47,40,421 మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.

కిట్ల పంపిణీ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలని అభిలషించారు. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుందని, ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని పిలుపునిచ్చారు.

నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని తెలిపారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి అమలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

బైజూస్ యాప్ ను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. విద్యార్థుల కోసం ద్విభాషా పాఠ్యపుస్తకాలను రూపొందించామని, ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ కూడా అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో సీఎం జగన్ 2022-23 ఏడాదికి గాను విద్యాసంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.