అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ సంకల్పమమని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని మంత్రులకు, అధికారులకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, లబ్ధిదారులతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
ఈబీసీ నేస్తం, జగనన్న చేదోడు, వైయస్సార్ మత్స్యకార భరోసా, రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన, వైయస్సార్ సున్నావడ్డీ, వైయస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, వైయస్సార్ కాపునేస్తం, వైయస్సార్ వాహనమిత్ర, వైయస్సార్ నేతన్న నేస్తం పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే…:
అర్హులు మిస్ కాకూడదన్నతే మన తపన, తాపత్రయం…
ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. అలాంటి పరిస్థితి ఉండకూడదు, రాకూడదని మన ప్రభుత్వం పడుతున్న తపన, తాపత్రయానికి ఈరోజు ఒక నిదర్శనం.
అధికారం అంటే కేవలం ప్రజలమీద మమకారం, అధికారం అంటే అజమాయిషీ చేయడం కాదు అని మరొక్కసారి రుజువుచేస్తూ.. వివిధ పథకాలను, గతంలో వివిధ కారణాల వల్ల అందుకోలేకపోయిన దాదాపు 3.40 లక్షల మంది అర్హులందరికీ కూడా ఇవాళ రూ.137 కోట్లను నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. అంతేకాదు కొత్తగా పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం. ఈ మూడింటికి సంబంధించి ఇవాళ మరో 3.10 లక్షల కుటుంబాలకు ఈ కార్డులు ఇస్తున్నాం. ఈ అదనపు కార్డులు ఇవ్వడం వలన దాదాపుగా.. మరో రూ. 935 కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు వ్యయం ఉన్నా కూడా.. ఏ ఒక్కరూ మిస్‌కాకూడదన్న లక్ష్యంతో అందిస్తున్నాం.
పేదల కష్టాలు మన కంటే ఎక్కువని భావిస్తూ…
పేదల కష్టాలు మన కష్టాలకన్నా ఎక్కువ అని భావిస్తాం. వారికి తోడుగా ఉండాలనే తపన, తాపత్రయంతోనే అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ పథకాలు ఏ కారణాల వల్లనైనా అందుకోలేకపోయిన వారిని రీ వెరిఫై చేయించి.. ఈ పథకాలు అందిస్తున్నాం.
12 పథకాల్లో అర్హులకు….
అందులో భాగంగా ఈబీసీ నేస్తం 6965 మందికి, జగనన్న చేదోడు 15,215 మందికి, వైయస్సార్ మత్స్యకారభరోసా 16,277 మందికి, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ 49,481 మందికి, జగనన్న విద్యాదీవెన 17,150 మందికి, జగనన్న వసతి దీవెన 25,644 మందికి, వైయస్సార్ సున్నావడ్డీ(మహిళలు అర్భన్) 2,04,891 మందికి, వైయస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు ఖరీఫ్, 2020లో 1,233 మందికి, వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు రబీ 2019–20లో 713, వైయస్సార్ కాపునేస్తం 1,249, వైయస్సార్ వాహనమిత్ర 236, వైయస్సార్ నేతన్న నేస్తం 42 మంది.. మొత్తంగా 3.40 లక్షల మందికి వివిధ కారణాల వల్ల ఈ పథకాలకి సంబంధించి అర్హత ఉండి కూడా ఏ కారణం వల్లనైనా ఆ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు మళ్లీ అవకాశమిచ్చాం. అందుకోసం మరోసారి రీవెరిఫై చేయించి, అర్హతను నిర్ధారించి.. వారందరినీ వదిలేయకుండా.. వారికి మంచి చేస్తూ.. ఈ పథకాలను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తున్నాం.
పైన చెప్పిన 12 పథకాలతో పాటు మరో 2,99,085 మందికి పెన్షన్ కార్డులు, మరో 7,051 మందికి బియ్యం కార్డులు, మరో 3,035 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అర్హుల చేతికి నేరుగా అందించబోతున్నాం.
నవరత్నాల పాలన ఇస్తామన్న మాటకు కట్టుబడి…
ఇవన్నీ బాధ్యతతో, పేదలమీద ఉన్న మమకారంతో చేస్తున్నాం. ఇక్కడ కులం చూడ్డంలేదు, మతం చూడ్డంలేదు, వర్గం చూడ్డం లేదు, రాజకీయాలు చూడ్డంలేదు. చివరకు వాళ్లు మన పార్టీకి ఓటు వేయకపోయినా పట్టించుకోవడం లేదు. కేవలం అర్హత ఒక్కటే ప్రాతిపదికనగా తీసుకుని నవరత్నల పాలన అందిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఏ ఒక్క అర్హుడు కూడా మిగిలిపోకుండా వారికి మళ్లీ అవకాశమిచ్చి.. అర్హులను మరోసారి గుర్తించే కార్యక్రమం చేయించి, అర్హత ఉండి ఏ కారణాలవల్లనైనా కూడా ఆ పథకాలు అందని వారికి ప్రతిఏటా కూడా రెండు దఫాలుగా జూలైలో ఒకసారి, డిసెంబరులో మరోసారి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఆ నెలల్లో వారందరినీ ఫిట్ చేసి వారికి మంచి చేసే కార్యక్రమం చేస్తున్నాం.
గత డిసెంబరులోనూ…
ఇదే విధంగా గత డిసెంబరు 28 తేదీన 9,30,809 మందికి మేలు చేస్తూ.. రూ.703 కోట్లు వాళ్ల ఖాతాల్లోకి జమ చేశాం. ఇవాళ కూడా 3.40 లక్షల మందికి మంచి చేస్తూ. రూ.137 కోట్లు జమ చేస్తున్నాం.
గతంలో పథకాలు ఎలా ఎగ్గొట్టాలని చూస్తే…
మన ప్రభుత్వం అర్హులు ఎంతమంది ఉన్నా.. శాచ్యురేషన్ పద్ధతిలో వారందిరికీ పథకాలు ఇస్తున్నాం. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా గమనించాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో పథకాలను పార్టీల వారీగా, కులాల వారీగా ఎలా కత్తిరించాలా ? ఎలా ఎగ్గొట్టాలా? ఫలానా వారు తమకు వ్యతిరేకరమని, ఫలానా వారు జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వలేదని ? గ్రామాలలో ఇంతమందికే కోటా అని ? ఇలా సాధ్యమైనంత ఎక్కువ మందికి రక,రకాల కారణాలతో ఎగ్గొట్టే పరిస్థితి గతంలో కనిపించేది. అప్పట్లో ఇన్ని పథకాలూ లేవు. ఇచ్చే అరాకొర పథకాల్లో కూడా కత్తిరింపులు. వాళ్లు ఇచ్చే రూ.1000లో కూడా ఆత్మాభిమానం చంపుకుని వృద్ధులు, వికలాంగులు, అక్కచెల్లెమ్మలకు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగితే తప్ప పని అయ్యేది కాదు. తిరిగినా లంచాలు ఇస్తే తప్ప పని అయ్యేది కాదు. లంచాలు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏ పార్టీకి చెందిన వారన్న ప్రశ్న మొదట వేసిన తర్వాతనే ఇచ్చే పరిస్థితి ఉండేది.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా చూశాం.
మనది మనసున్న పాలన..
గత పాలనకు, మన పాలనకు తేడా ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటే… మన పాలనలో మనస్సుంది. గత పాలనలో అది లేదు.
మన హయాంలో శాచ్యురేషన్ పద్ధతిలో…
ఇదే మన ప్రభుత్వంలో కులం చూడ్డంలేదు, వర్గం చూడ్డంలేదు, పార్టీలు చూడ్డంలేదు, అవినీతికి తావులేకుండా, వివక్షకు అవకాశం లేకుండా, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్తి స్ధాయిలో సంక్షేమపథకాలు అందించడం కోసం ఆరాటపడుతున్నాం.
పథకాలను పూర్తి పారదర్శకంగా అమలు చేయడానికి సామాజిక తనిఖీకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాలు ప్రదర్శిస్తున్నాం. ఎటువంటి పక్షపాతం లేకుండా, ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేని విధంగా అర్హుల ఎంపిక చేశాం. కాబట్టి రేషన్ కార్డులు, పెన్షన్‌లు, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదార్ల సంఖ్య గమనిస్తే.. మన ప్రభుత్వం హయాంలో గతం కంటే లక్షల సంఖ్యలో ఎక్కువగా ఉంది.
ఎక్కడా దళారులు, మధ్యవర్తులు కూడా లేరు. లంచాలు, వివక్ష కనిపించకుండా ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టే విప్లవాత్మక మార్పు ఇవాళ జరుగుతోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా –సంక్షేమ క్యేలెండర్..
బ్యాంకుల్లో వేసే డబ్బులను కూడా తిరిగి ఆ బ్యాంకులు జమచేసుకోలేని రీతిలో అన్ ఇంకబర్డ్ ఖాతాల్లో వేస్తున్నాం. ఏ నెలలో ఏ పథకం వస్తుందని ముందుగానే… సంక్షేమ క్యాలెండర్లో చెప్పిన దాని ప్రకారం ఎక్కడా కూడా మిస్ కాకుండా అమలు చేస్తున్నాం. ఇలా రాష్ట్రంలో కాదు కదా, దేశంలో కూడా ఎక్కడా కూడా చేయడంలేదు.
పేదల తలుపు తడుతున్న సంక్షేమపథకాలు…
ఒక మాటలో చెప్పాలంటే… పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలే ఈరోజు వారి తలుపును తడుతున్నాయి. ప్రభుత్వ సేవలు ఇంటి గడప వద్దే అందుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదొక గొప్ప మార్పుకు శ్రీకారం కాదా?
ఇన్ని మార్పులు చేసి మీ గడపకు వస్తున్నాం…
ఇలా మంచి చేయగలిగాం కాబట్టే.. మళ్లీ మీ గడప తొక్కగలుగుతున్నాం. ప్రతి ఇంటికీ కూడా గడపగడపకూ మన పాలన అని అడుగులు వేయగలుగుతున్నాం. తలుపు తట్టి ప్రతి అక్కను పేరుతో సహా పిలిచి… ఈ 3 సంవత్సరాల కాలంలో ఇంతమంచి జరిగిందని వివరించగలుగుతున్నాం.
అలా చెప్పినప్పుడు.. అవును జరిగింది.. అని వాళ్లు చెప్పే మాటలే మన ప్రభుత్వానికి ఆక్సిజన్. బాగా చేశారు అని వాళ్లు చిరునవ్వుతో సంతోషంగా చెపుతున్న మాటలే.. మనకు వెన్ను తట్టి మన ప్రభుత్వానికి నమ్మకం ఇచ్చి అడుగులు ముందుకు వేయించగలుగుతున్నాయి.
ప్రభుత్వంలో ఉన్నవాళ్లలో నిబద్ధత, క్రెడిబులిటీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పాలనలో మార్పు కనిపిస్తోంది. దేవుడి దయ వలన ఇవాళ అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా
దేవుడి దయతో ప్రజలకు మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, బీసీసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, హేండ్‌లూమ్స్ అండ్ టెక్ట్స్‌టైల్స్ ముఖ్యకార్యదర్శి కె సునీత, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.