రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం కేసీఆర్

భారత 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఆయన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో కలిసి వెళ్లారు. తొలుత శ్రీనివాసరెడ్డి ఓటు హక్కు వినియోగించుకోగా, అనంతరం కేసీఆర్ తన ఓటు వేశారు. అనంతరం పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఈ ఉదయం తెలంగాణ భవన్ లో మాక్ పోలింగ్ పై అవగాహన కల్పించారు. కాగా, ఓటింగ్ అనంతరం సీఎం కేసీఆర్ ఎస్సారెస్సీ పరిశీలనకు వెళ్లనున్నారు. ఆయన నిన్నటివరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులను పరిశీలించడం తెలిసిందే.