-తెలంగాణ వచ్చినంక, భూముల రేట్లు విపరీతంగా పెరిగినయి
-ప్రపంచంలోనే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు లేవు
-పాలమూరు – రంగారెడ్డి నుంచి నీళ్లు వికారాబాద్ కు తెచ్చి ఇస్తాం
-ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండు
-మనకు సింగరేణి బొగ్గున్నంక కూడా మోడీ చెప్పిన సావుకార్ల కాడ కొనాలట
– వికారాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవాలంటే అది టీఆరెస్‌కు మాత్రమే సాధ్యమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కొత్త జిల్లాలు వచ్చేవా? భూముల రేట్లు పెరిగేవా? అని ప్రశ్నించారు. బీజేపీ పాలనపోతే తప్ప దేశానికి మంచిజరగదని కేసీఆర్ స్పష్టం చేశారు. వికారాబాద్ బహిరంగసభలో కేసీఆర్ ఏమన్నారంటే..
వికారాబాద్ కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా.. ఇక్కడి అనంతగిరి కొండల్లో ఉన్న ఔషదాల గాలి ఆరోగ్యానికెంతో మంచిది. ఉద్యమ సమయంలోనే వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేస్తా.. అని చెప్పిన. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం.అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట చేర్చి నూతన సమీకృత కలెక్టరేట్ ను కట్టుకున్నం.
భూముల రేట్లు పడిపోతయనే అపోహతో.. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాటి సమైక్యవాద తొత్తులు తెలంగాణకు అడ్డు పడ్డరు. కానీ నేడు తెలంగాణ వచ్చినంక, భూముల రేట్లు విపరీతంగా పెరిగినయి. తెలంగాణ రాకపోతే.. వికారాబాద్ జిల్లాగా అయ్యేదా? ఆలోచించాలె. కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తమని, నిన్ననే ప్రకటించినం.
వ్యవసాయం, కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర అనేక మన పథకాలు అమలు చేయాలని, పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కోరుతున్నరు. పల్లె సీమలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో అలరారుతున్నయి. నీటి బకాయిలు మాఫీ చేసినం. ఇంకా కూడా భవిష్యత్ లో రైతులకెంతో చేస్తం. గూడు చెదిరి, చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన రైతులను కాపాడుకోవాలె. అనే సంకల్పం తీసుకొని అనేక రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నం.
రైతు బంధు పథకంతో ఎకరాకు ఏటా 10 వేల పంట సాయం అందిస్తున్నం. గతంలో ఆపద్భంధు పేరుతో 50 వేల రూపాయలు ఆఫీసుల చుట్టు తిప్పించుకొని ఇచ్చెటోళ్లు.ఒక గుంట భూమి ఉన్న రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నం. నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నయి. ప్రపంచంలోనే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు లేవు. ఇలాంటి పథకాలు ఇంకెక్కడైనా ఉన్నయా.. ప్రజలు ఆలోచించాలె.. చర్చ పెట్టాలె.
మోసపోతే.. గోస పడుతం.. మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం.వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలె. కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కత అయితది జాగ్రత్త. తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలె. 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, చావు అంచుదాకా పోయి తెలంగాణ తెచ్చుకున్నం.
ఇపుడు తెలంగాణలో మంచినీళ్లు, కరెంటు బాధ లేదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీళ్లిస్తున్నం. అన్ని రంగాలకూ 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నం. 26 లక్షలకు పైగా కరంటు మోటర్లకు ఉచిత కరెంటు ఇస్తున్న.దేశంలోనే అత్యధికంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నం.ఐటీ, పారిశ్రామిక రంగాలను గొప్పగా అభివృద్ధి చేసుకున్నం. తెలంగాణ ఆదాయం అద్భుతంగా పురోగమిస్తున్నది.
కానీ, కేంద్రంలో ఉన్నవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతున్నరు. బీజేపీ ఎనిమిదేళ్లలో ఒక్క మంచిపని అయినా చేసిందా? రాజకీయంగా నిద్రాణమైన సమాజం వెనుకబడుతది. ఎన్నికలు వస్తే.. రకరకాల మనుషులు వస్తరు.. జాగ్రత్తగా ఉండాలె. సమైక్య పాలనలోని బాధలు మళ్లా రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలె. విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టి, రైతులకు కేంద్రం శఠగోపం పెడుతున్నరు.
మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండి.ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఆలోచించండి. రైతులకు ఉచిత కరంటు ఇయ్యద్దట. కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టాల్నట. మనకు సింగరేణి బొగ్గున్నంక కూడా మోడీ చెప్పిన సావుకార్ల కాడ కొనాలట. ఇవన్నీ ప్రశ్నించినందుకేనా?ఇందుకేనా కేసీఆర్ బస్సుకు బీజేపీ వోళ్లు జెండాలు అడ్డం పెట్టేది ? కేసీఆర్ మంచినీళ్లియ్యలేదా.. కరెంటియ్యలేదా..భూముల ధరలు పెరగలేదా?
పక్క రాష్ట్రం కర్ణాటక పోయి చూడండి. ఎట్లున్నదో తెలుస్తది. అక్కడి పరిస్థితి ఏంది.. ఇక్కడి పరిస్థితి ఏందో తెలుస్తది.ఇంతమంచి కలెక్టరేట్ భవనం వస్తదని అనుకున్నమా? 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నం. తెలంగాణ రాకుంటే వికారాబాద్ కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ వచ్చేదా? పాలమూరు – రంగారెడ్డి నుంచి నీళ్లు వికారాబాద్ కు తెచ్చి ఇస్తాం. కానీ, దాన్ని కేసులేసి ఆపింది ఎవరో ప్రజలకు తెలుసు. వాళ్లను నిలదీయాలె.
కేంద్ర ప్రభుత్వ తెలివితక్కువతనం వల్ల పాలమూరు – రంగారెడ్డి ఆలస్యమైతాంది.మోడీని చూడగానే ఇక్కడి బీజేపీ నేతల లాగులు తడిసిపోతయి.కేంద్రానికి ఎనిమిదేండ్ల నుంచి వందల దరఖాస్తులు ఇచ్చినా పట్టిచ్చుకోలే.నేడు ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండు. ఎన్ని అడ్డంకులెదురైనా పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు నీళ్లందిస్తాం.నిన్నటి ప్రధాని ప్రసంగంలో పస ఏమీ లేదు. నెత్తికి రుమాలు కట్టి గాలి మాటలు చెప్పిండు.
దేశ ప్రగతి రోజురోజుకూ దిగజారుతుంది. ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగినయి. కేంద్రంలో కూడా రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమ ప్రభుత్వం రావాలె.అందుకే ఈ కేంద్రాన్ని ఇంటికి సాగనంపుదాం.ఈ దుర్మార్గులను తరిమికొడుదాం. ఈ దుష్టశక్తులకు సరైన బుద్ధి చెబుతాం. వికారాబాద్ ప్రజలు చైతన్యవంతులు. భవిష్యత్ లో ఉజ్వల భారతదేశం నిర్మాణం దిశగా మనం కంకణ బద్దులం కావాలె.