తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ.. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్‌ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి నేతల సమక్షంలో పార్టీ పేరును వెల్లడించారు. అంతకు ముందు దేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నామో వివరించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీ, గడిచిన 8 సంవత్సరాల్లో వృద్ధి రేటు ఎలా దెబ్బతిన్నదో వివరించారు.
దేశంలో ఎన్నో వనరులు ఉన్నా.. ఇంకా అభివృద్ధి జరుగని నేపథ్యాన్ని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సర్వసభ్య సమావేశం ఆమోదముద్ర వేసింది. తర్వాత తీర్మానంపై కేసీఆర్ సంతకాలు చేశారు. అయితే, పార్టీ పేరు మార్పుపై ఎన్నికల కమిషన్‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ సమావేశంలో భారత్ రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు వివరించారు. మరో వైపు పార్టీ సీనియర్ నేత వినోద్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు లీగల్ బృందం రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలువనున్నట్లు తెలుస్తున్నది.
తీర్మానం కాపీని ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ పార్టీ పేరు మార్పునకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించనున్నది. ఎన్నికల కమిషన్ బీఆర్‌ఎస్ పార్టీ పేరుకు సంబంధించి నిర్ధిష్ట గడువుతో అభ్యంతరాలు కోరే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సంఘం అధికారికంగా భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరుపై అధికారికంగా ప్రకటించనున్నది.