– మళ్లీ నాగబాబు తెచ్చిన‘ సీఎం తంటా’
– వైసీపీకి అస్త్రం అందించిన నాగబాబు
– పవన్ సీఎం కావాలంటున్న నాగబాబు
– పవన్ లక్ష్యాన్ని నాగబాబు దెబ్బతీస్తున్నారా?
– టీడీపీ-జనసేన పొత్తుపై మళ్లీ గందరగోళం
– జగన్‌ను దింపేందుకు సర్దుబాట్లు ఉంటాయన్న నాదెండ్ల మనోహర్
– గతంలో పొత్తులపై పవన్ పరోక్ష సేం తాలు
– ఇప్పుడు మళ్లీ పవన్ సీఎం కావాలన్న నాగబాబు
– నాగబాబు మాటలతో ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళం
– పవన్‌కు సీఎం సీటు చేయాలా అన్న గందరగోళంలో టీడీపీ
– సింగిల్‌గా పోటీ చేస్తే పవన్ ఎలా సీఎం అవుతారని జనసైనికుల అయోమయం
– నాదెండ్ల ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో కలసి పనిచేస్తున్న టీడీపీ-జనసేన శ్రేణులు
– మరి నాగబాబుది వ్యక్తిగత అభిప్రాయమా? పార్టీ నిర్ణయమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఆలూ లేదూ.. చూలూ లేదు. కొడుకుపేరు సోమలింగం అన్నట్లుంది జనసేన కొత్త ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు వ్యవహారం. అసలు జనసేన ఎన్ని స్థానాలకు పోటీ చేస్తుందో తెలియదు. పొత్తు ఉంటుందో- ఉండదో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ఒకవైపు పొత్తుపై పవన్ నుంచి మనోహర్ వరకూ సానుకూల సంకేతాలిస్తారు. మరోవైపు నాగబాబు పవన్ సీఎం అవుతారని ప్రకటిస్తారు. అంటే టీడీపీతో పొత్తు కుదిరితే .. చంద్రబాబు నాయుడు కాకుండా, పవన్ సీఎం అవుతారా? తక్కువ సీట్లకు పోటీ చేసే పార్టీకి సీఎం పదవి ఇస్తారా? అన్నది నాగబాబు తెచ్చిన కొత్త పంచాయితీ. నాగబాబు పెట్టిన సీఎం పంచాయితీతో జనసేనకు లాభమెంత? నష్టమెంత? అసలు ఉమ్మడిగా టీడీపీ-జనసేనకు లాభమా? నష్టమా? ఈ వ్యవహారంలో వైసీపీకి నాగబాబు కొత్త అస్త్రం అందించారా?.. ఇదీ ఇప్పుడు హాట్‌టాపిక్.
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు.. మూడడుగులు ముందుకు- ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. గతంలో జనసేనాధిపతి పవన్, ఆ తర్వాత ఇటీవల నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు-ప్రకటనల నేపథ్యంలో పొత్తు ఖరారయిందని, రెండు పార్టీల శ్రేణులు భావించాయి. జగన్‌ను గద్దెదింపడమే లక్ష్యంగా పొత్తులుంటాయని పవన్ స్పష్టం చేశాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినివ్వనని, మరోసారి కుండబద్దలు కొట్టారు. తాజాగా జనసేనలో నెంబర్‌టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, వైసీపీని గద్దె దించేందుకు పొత్తులుంటాయని స్పష్టం చేశారు.
దానితో జనసైనికులకు పొత్తులపై ఒక స్పష్టత వచ్చినట్టయింది. టీడీపీతో ఎన్ని సీట్లకు పొత్తు ఉంటుందని పక్కనపెడితే.. పొత్తు ఖాయమని వారికి అర్ధమయింది. ఈ క్రమంలో టీడీపీ యువనేత లోకేష్ కర్నూలు జిల్లా పాదయాత్రలో, జనసైనికులు పాల్గొన్నారు. ఆ యాత్రలో టీడీపీ జెండాలతోపాటు, జనసేన జెండాలు కూడా జమిలిగా రెపరెపలాడాయి. అంతకుముందు.. చంద్రబాబునాయుడు మాచర్ల పర్యటనలో కూడా, జనసేన-టీడీపీ జెండాలు జమిలిగా కనిపించాయి.
అయితే తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన.. పవన్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్య, మళ్లీ పొత్తులపై అనుమానపు మేఘాలు కమ్మేలా చేశాయి. ‘‘పవన్ కల్యాణ్ సీఎం అయితేనే రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుంది. రానున్న కాలంలో జనసేన ప్రభుత్వమే ఏర్పడుతుంది. జనసేన ప్రభుత్వంలో కచ్చితంగా అన్ని వర్గాలకు ప్రయోజనాలు ఉంటాయి’’అని నాగబాబు చేసిన వ్యాఖ్య, పొత్తులపై క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణుల్లో గందరగోళానికి దారితీళాయి.
అయితే.. పవన్ సీఎం అయితేనే రాష్ట్రంలో, స్వర్ణయుగం వస్తుందని చెప్పిన అదే నాగబాబు.. మళ్లీ పొత్తులు-ఎత్తులన్నీ పవన్‌కు వదిలేయాలని చెప్పడంతో, జనసైనికులు మరింత అయోమయానికి గురయ్యారు.
నాగబాబు ప్రకటన.. జనసేన-టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసేందుకు, వైసీపీ సోషల్‌మీడియాకు అస్త్రం అందించినట్టయిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవన్ సీఎం అవుతారని నాగబాబు ప్రకటించినందున, వైసీపీ సోషల్‌మీడియా వ్యూహం కూడా ఇకపై అలాగే ఉంటుందని జోస్యం చెబుతున్నారు. ఆ మేరకు టీడీపీ తమ్ముళ్ల అసంతృప్తిపై కూడా వైసీపీ సోషల్‌మీడియా ఇప్పటినుంచే మంట రాజేయడం ఖాయమంటున్నారు. రాజకీయ వ్యూహాలు- ఎత్తుగడ- భవిష్యత్తు అవసరాలేమీ తెలియకుండా, నాగబాబు చేసిన ప్రకటన వైసీపీకి అస్త్రంగా మారిందంటున్నారు.
గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పటి తప్పులు ఈసారి జరగవన్నది జనసైనికుల నమ్మకం. గతంలో పీఆర్పీ మాదిరిగా కాకుండా, ఎన్నికలకు ముందు తమ రాజకీయ భవిష్యత్తుపై, స్పష్టత ఇస్తారన్న నమ్మకం జనసైనికుల్లో ఉండేది. అయితే మళ్లీ గందర గోళ ప్రకటనలు వెలువడటాన్ని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్నికలకు సిద్ధం కావడం, ఎన్నికల్లో పోటీ చేయడమంటే ఆపామాషీ వ్యవహారం కాదు. గతంలో పీఆర్పీ పెట్టినప్పుడు టికెట్ల కోసం ఆర్ధికంగా నష్టపోయారు. అంత ఖర్చు చేస్తే అందరికీ టికెట్లు రాలేదు. ఇప్పడు జనసేన వైఖరి.. పాత పీఆర్పీ వైఖరే కనిపించటంతో, జనసేన టికెట్లు ఆశించేవారు ఆలోచించి అడుగులేయాల్సి వస్తోంది.
పొత్తు ఉందంటే ఉందని, లేదంటే ఉండదని స్పష్టం చేస్తేనే.. మైదానంలో నేతలు మిగులుతారని, జనసేన సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. అందరినీ ఆశల్లో పెట్టి, చివరాఖరులో ఇవ్వలేమని చెబితే, పార్టీకి నేతలు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. లక్షలు-కోట్లు ఖర్చు పెట్టుకుని, తీరా చివరలో పొత్తు ఉందంటే, తమ భవిష్యత్తు ఏం కావాలన్న ప్రశ్నలు, జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పొత్తును పవన్ నిర్ణయిస్తారని చెప్పిన్పటికీ.. ఎన్నికల వరకూ నియోజకవర్గాల్లో పార్టీ కోసం చేసే కార్యక్రమాలకు, డబ్బులెవరు ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అసలు రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామో తెలియకుండా.. ఎంతమంది బలమైన నేతలున్నారో గుర్తించకుండా.. ఎంతమంది ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసే స్థాయి నేతలు ఉన్నారని తేల్చకుండా.. జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్పడం హాస్యాస్పదమే కాకుండా, నాగబాబు రాజకీయ అవగాహనా రాహిత్యానికి నిదర్శమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒంటరిగా పోటీ చేసి వంద సీట్లు గెలిచేంత స్థాయిలో జనసేన ఉందా అన్న వాస్తవం గ్రహించకుండా, తమ్ముడిపై ప్రేమతో నాగబాబు చేసిన ప్రకటన, పవన్ లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయంటున్నారు.
సినిమా హీరోలు, నటులకు జనంలో క్రేజ్ ఉన్నా.. వారు రాజకీయాల్లోకి వస్తే, ఆ లెక్కలు వేరుంటాయన్న వాస్తవాన్ని.. చిరంజీవి ప్రజారాజ్యం అనుభవంతో తేలిన విషయాన్ని, గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. హీరోలు, సినిమా నటుల సభలకు లక్షలాదిమంది జనం వస్తే, వారంతా ఆయా నటులు పోటీ చేసే పార్టీకి ఓట్లు వేయరు. నిజంగా అదే జరిగితే.. గతంలో చిరంజీవి తన సొంత నియోజకవర్గమైన పాలకొల్లు, గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఎందుకు ఓడిపోతారన్న ప్రశ్నలు జనసైనికుల్లో వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లోకి వచ్చిన సినిమా నటులు, సినీప్రపంచపు ఇమేజ్ భ్రమలను వీడి,.. వాస్తవంలోకి రాకపోవడం, రాజకీయాలపై సరైన అవగాహన- పరిస్థితులపై అంచనా లేకపోవడమే, సినీ ప్రముఖుల రాజకీయ వైఫల్యానికి ప్రధాన కారణమంటున్నారు.
గత చేదు అనుభవాలతో ఈసారి పవన్‌కు.. అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదన్నది, ఆయన అభిమానుల ఆకాంక్ష. పవన్ సోదరుడు నాగబాబును, ఇలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రిస్తేనే, జనసేనకు మనుగడ అన్నది జనసైనికుల వాదన.