– అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ అసెంబ్లీలో మరో తీర్మానాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. జీఎస్టీ రెండో తరం సంస్కరణలకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రిని అభినందిస్తూ పయ్యావుల ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది.
ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ఆదాయం కొంత మేర తగ్గుతున్నా… మొదటగా వాటిని స్వాగతించి మద్దతు తెలిపినందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు. రాష్ట్రానికి ఆదాయం తగ్గినా, ప్రజలకు లబ్ది చేకూరుతుందనేది ముఖ్యమంత్రి ఆలోచన. రూ. 8 వేల కోట్లు నష్టం వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్తే… ప్రజలకు రూ. 8 వేలు కోట్ల లబ్ది చేకూరుతుంది కదా అని సీఎం అన్నారు.
ప్రజల సంక్షేమాన్ని, ఆర్థిక సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని సంస్కరణలను సీఎం మద్దతు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలకు చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారని జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో చెప్పి వెళ్లాను. చంద్రబాబు మద్దతిచ్చారని తెలియగానే… జీఎస్టీ సంస్కరణలపై అందరిలోనూ ఓ పాజిటివ్ దృక్కోణం ఏర్పడింది.
అనుభవమున్న నాయకుడైన చంద్రబాబు జీఎస్టీ సంస్కరణలకు మద్దతివ్వడంతో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం మొత్తం పాజిటివ్ మూడ్ లో జరిగింది. ఈ సంస్కరణలు ఆమోదం పొందడానికి రెండు రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు పెట్టినా… ఒక్క రోజులోనే సంస్కరణలకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు.