Suryaa.co.in

Andhra Pradesh

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ

వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు– వరుసగా మూడో ఏడాది

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీరాయితీ సొమ్ముతో పాటు గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే…:

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది
దేవుడి దయ వలన మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. దాదాపు 62 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ రంగంమీదనే ఆధారపడి ఉన్న పరిస్ధితుల్లో రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. ఇది గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా రైతులకు అన్నివిధాలుగా అండగా నిలబడుతూ, తోడుగా ఉంటూ గత 3 సంవత్సరాల 5 నెలల కాలం మన పరిపాలన అంతా సాగింది. క్రమం తప్పకుండా సున్నావడ్డీ పంటరుణాలు కచ్చితంగా ఇవ్వడంతో పాటు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగియకమునుపే.. మళ్లీ రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి ఆ పరిహారం చెల్లిస్తున్నాం. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ అయితే మరలా మరుసటి ఏడాది ఆ సీజన్‌ రాకమునుపే క్రమం తప్పకుండా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి.. వ్యవసాయ రంగంలో చాలా రకాలైన మార్పులకు ఈ 3 ఏళ్ల 5 నెలల కాలంలో అడుగులు వేశాం.

రూ.200 కోట్లు నేడు రైతుల ఖాతాల్లో జమ….
రైతన్నలకు నేడు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైయస్సార్‌ సున్నావడ్డీ పథకం గాని గమనిస్తే.. ఇవాళ మొత్తం రూ.200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.
ఇందులో మొదటిగా రైతులకు అందిస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ విషయానికొస్తే.. 2022 జూలై నుంచి అక్టోబరు మధ్యలో కురిసిన అధిక వర్షాలు, వరదల వలన దాదాదపు 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు నష్టం జరిగితే.. దానివల్ల రైతున్నలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు దాదపుగా రూ.40 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని…ఈ ఖరీప్‌ 2022 ముగియకమునుపే నేడు వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితో ఆ సీజన్‌ ముగియకమునుపే రైతన్నలకు మంచి చేస్తూ.. ఇన్‌పుట్‌ సబ్సిడీలో కొత్త ఒరవడికను తీసుకొచ్చి అడుగుల ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ…ఈ రకంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపు 21,31,000 మంది రైతులుకు ఇవాళ ఇస్తున్న సొమ్ముతో కలుపుకుని ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.1834 కోట్ల రూపాయలు ఇచ్చినట్లవుతుంది.

వైయస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాలను ఒక్కసారి గమనిస్తే….
పంటలు వేసే ప్రతిసారీ రైతన్నలు.. పెట్టుబడి కోసం తాము డబ్బులు బ్యాంకులు నుంచి తెచ్చుకుని వాటిని సకాలంలో తిరిగి బ్యాంకులకు కట్టగలిగితే.. ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుందన్న భరోసా ఈ వైయస్సార్‌ సున్నావడ్డీ ద్వారా ప్రతి రైతుకు కలుగుతుంది. ఆ భరోసా ఇచ్చేదిగా ఉండాలి, రైతన్నలకు అన్ని రకాలుగా మంచి చేసే పరిస్థితి రావాలన్న ఉద్దేశ్యంతో సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ కూడా పంట రుణాల మీద వడ్డీ భారం తగ్గిస్తున్నాం.

8.22 లక్షల మంది రైతులకు రూ.160 కోట్ల వడ్డీ రాయితీ…
ఇలా వరుసగా మూడో ఏడాది ఈ పంట రుణాల మీద వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగానే రబీకు సంబంధించి, ఖరీఫ్‌ 2021 సంబంధించి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతులకు ఈరోజు రూ.160. 55కోట్ల వడ్డీ రాయితీ సొమ్మను నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.

అన్నదాతలకు అండగా..
అన్నదాతలకు అండగా నిలుస్తూ ఇ– క్రాప్‌ డేటా ఆధారంగా పారదర్శకంగా, సోషల్‌ ఆడిట్‌ కోసం ఆర్బీకేలలో ఆ జాబితాను సైతం ప్రదర్శించి… లక్ష రూపాయలు లోపు రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా పూర్తి వడ్డీ రాయితీని మనందరి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తుంది. ఇది మూడో సంవత్సరం. నేడు అందిస్తున్న రూ.160.55 కోట్లతో కలిపితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు హాయంలో ఆయన ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుంటే సున్నావడ్డీ పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేసాం.

సాయంలో గతానికీ ఇప్పటికీ తేడా గమనిస్తే…
రైతన్నలకు అందించే సహాయం విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో.. కొన్ని కొన్ని విషయాలను కొన్ని ఉదాహరణలతో మీ ముందుకు తీసుకు వస్తున్నాను.
ఎందుకంటే మనసుపెట్టి రైతులకు మంచి చేయాలన్న సదుద్దేశంతో అడుగులు ముందుకు వేస్తే.. ఏ రకమైన తేడా కనిపిస్తోందో చెప్తాను.

గతంలో వైయస్సార్‌ రైతు భరోసావంటి పథకం లేదు. ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఈ మాదిరిగా రైతులకు తోడుగా నిలబడిన పరిస్థితులు కూడా గతంలో ఎప్పుడూ లేవు. గతంలో మనం గమనిస్తే… రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు అన్నీ రైతులందరికీ మాఫీ చేస్తామని.. బ్యాంకుల్లో ఉన్న బంగారం అంతా ఇంటికి తిరిగి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. రకరకాలుగా ప్రచారం చేసి ఎన్నికల వేళ మోసం చేసిన పరిస్థితులు మనమంతా గమనించాం.

మాఫీ చేస్తానని మోసం చేసిన బాబు….
ఆరోజు మాఫీ చేస్తానని చెప్పి.. చివరకు మోసం చేశాడు. ఆయన కట్టలేదు. తొలి సంతకంతో మాఫీచేస్తానని చెప్పడంతో అప్పులమీద వడ్డీలు, వడ్డీల మీద చక్రవడ్డీలు తడిసి మోపుడై రైతు రుణభారం రెట్టింపు అయిన పరిస్థితులు మనందరికీ కనిపించాయి.
బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితులు. మన కళ్లెదుటనే రోజూ పేపర్లలో నోటీసులు ఇచ్చి వేలం వేయడాన్ని చూశాం. చివరికి ఇంతా చేసి ఆ ఐదు సంవత్సరాల్లో కలిపి ఈ పెద్ద మనిషి కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే ఇచ్చాడు. ఇవ్వాల్సింది రూ.87,612 కోట్లు… ఇచ్చింది కేవలం రూ.15వేల కోట్లు. అందులోనూ అంతవరకు అందుబాటులో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తివేశాడు. చివరకి రైతులకు వడ్డీల మీద వడ్డీలు కట్టుకునే పరిస్థితులు వచ్చాయి. ఇక్కడ ఈ ఒక్క రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా ఈ మూడు సంవత్సరాలలో మన ప్రభుత్వం ఇచ్చిన మొత్తం రూ. 25,971 కోట్లు. తేడా ఎంత ఉందో గమనించండి.

గతంలో బాబు పాలనలో ఐదేళ్లూ కరువే….
అదే విధంగా గతంలో పంటల బీమా పథకానికి రైతులు తమ వాటా తామే కట్టుకున్నారు. ఆ ఐదేళ్లలో వరుసగా కరువు వచ్చింది. ప్రతి సీజన్‌లోనూ కరువు మండలాలు డిక్లేర్‌ అవుతుండేవి. అలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్‌ సొమ్ము పెరగాలి. అలా జరగకుండా రైతులకు… ఆ ఐదేళ్లలో బీమా కింద చెల్లించింది కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే అయితే అందులో తమ వాటా కింద రైతులు తామే కట్టుకునే పరిస్థితి.

నేడు ఉచిత పంటల బీమా…
మన ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా రైతులు చెల్లించాల్సిన అవసరం లేకుండా… ఉచిత పంటల బీమా అమలు చేసింది. అంతే కాకుండా ఇ– క్రాప్‌ ద్వారా పంటవేసుకునే ప్రతిరైతుకూ వర్తించేలా ఆర్బీకేకు అనుసంధానం చేసింది. ఇ– క్రాప్‌ ద్వారా రైతుల ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఇ–క్రాప్‌ ఆధారంగా రైతులను ఇన్సూరెన్స్‌ పరిధిలోకి తీసుకునివచ్చి.. పంటనష్టం జరిగిన ఈ మూడేళ్ల కాలంలోనే రూ.6,685 కోట్లు రైతులకు చెల్లించాం. లబ్ధిదారుల సంఖ్య చూస్తే.. ఇవాళ ప్రతి రైతుకూ ఇవాళ బీమా వర్తిస్తోంది. అప్పట్లో కొంతమందికి మాత్రమే ఇన్సూరెన్స్‌ వచ్చే పరిస్థితి. తేడా గమనించాలని కోరుతున్నా.

ఆర్బీకేలు –విత్తనం నుంచి అమ్మకం వరకూ..
విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతన్నకు అండగా ఉండే ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. ఇవాళ దాదాపు 10,778 రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ రైతన్నకు నాణ్యమైన, సర్టిఫైడ్‌ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తున్నాయి. రైతులు నష్టపోకుండా ఈ చర్యలు చేపట్టాం.
ఆర్బీకేల ద్వారా పంపిణీచేస్తున్నాం. ఆర్బీకేలు రైతులకు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఇ–క్రాప్‌ నమోదు చేస్తున్నాయి. ప్రతి పథకం పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతుకు అందించడంతో పాటు పంట కొనుగోలు సమయంలోనూ రైతుకు ఇబ్బంది కలగకుండా సహాయకారిగా వ్యవరిస్తున్నాయి. ఇలాంటి గొప్ప వ్యవస్థ మన కళ్లముందే ఆర్బీకేల రూపంలో ఉంది.

విలేజ్‌ అగ్రి అసిస్టెంట్లు ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. ఇలాంటి విధానం గతంలో లేదు. కనీసం ఆలోచన కూడా చేయలేదు. పంటనష్టానికి సంబంధించి లెక్కించడం, ఇవ్వడం వంటి ప్రతి అంశంలోనూ గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందనేది గమనించి చూస్తే.. గతంలో అశాస్త్రీయ విధానాలు ఉండేవి. మధ్య దళారులు, ఉద్యోగులు చుట్టూ రైతులు ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో ? లేదో ? తెలియని దుస్థితి. కొన్ని సందర్భాలను మనం గమనిస్తే… గత పాలనలో చూస్తే.. పూర్తిగా ఇన్‌పుట్‌ సబ్సిడీ పూర్తిగా ఎగ్గొట్టారు. 2–3 సీజన్ల తర్వాత అరకొర సహాయం అందించిన పరిస్థితులు కూడా చూశాం. గతంలో రైతులకు పరిహారం అందుతుందా? లేదా? అనే పరిస్థితి ఉండేది.

ఇప్పుడు ఇ–క్రాప్‌ ఆధారంగా నమోదైన వాస్తవ సాగుదారులందరికీ కూడా నేరుగా వారి ఖాతాల్లోనే ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే.. ఆసీజన్‌లో ముగిసేలోగానే జమ చేస్తున్నాం. పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేస్తున్నాం. లబ్దిదారుల పరిశీలన కోసం రైతుభరోసా కేంద్రాలలో వారి జాబితాను నోటీసు బోర్డుపై డిస్‌ప్లే చేస్తున్నాం. ఎవరి గ్రామాల్లో వారు వారి వివరాలను చూసుకుని.. అర్హత ఉండి కూడా ఒకవేళ పొరపాటున ఎవరైనా జాబితాలో తమ పేరు కనిపించకపోతే మరలా ఫిర్యాదు చేసే అవకాశం ఇస్తున్నాం. వాటిని మళ్లీ వెరిఫై చేసి ప్రతి సంవత్సరం జూలై, డిసెంబరు నెలలో కచ్చితంగా మిస్‌ అయిన వారికి మేలు జరిగించే కార్యక్రమం చేస్తున్నాం.

కరువు నష్టం సాయంలో తేడా చూస్తే…
కరువు వల్ల పంట నష్టానికి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, మన ప్రభుత్వం ఏం చేసిందో గమనించినట్లైతే… ఈ మూడున్నర సంవత్సరాలలో తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
మంచి చేస్తున్న ప్రభుత్వానికి కచ్చితంగా దేవుడి దయ ఉంటుంది. మూడున్నర సంవత్సరాల మన పాలనలో ఒక్క సంవత్సం కూడా ఒక ఒక్క కరువు మండలాన్నీ కూడా ప్రకటించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇది దేవుడి దయ. అదే చంద్రబాబు 5 ఏళ్లపాలంలో సగటున ఏటా సగం మండలాలు కరువు మండలాలుగానే ఉండేవి. అంతటి కరువు వచ్చినప్పటికీ సహాయం కూడా అప్పుడు అంతంత మాత్రమే.

ఇక వరద నష్ట పరిహారం చూస్తే..
2015 నవంబరు, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.260 కోట్ల పంట నష్టానికి.. 2018లో కరువు వల్ల ఖరీప్‌లో రూ.1832 కోట్లు, రబీలో మరో రూ.356 కోట్ల పంట నష్టానికి అందించిన సహాయం ఎంతో చూస్తే.. పెద్ద గుండు సున్నా. నిజంగా పంట నష్టం జరిగిన కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ అన్నది పూర్తిగా ఎగరగొట్టిన పరిస్థితులు. అదే మన ప్రభుత్వంలో ఒక్కసారి గమనిస్తే… పాలసీలో మనం మార్పు తీసుకొచ్చాం. ఆ తర్వాత 2020 జూన్‌ నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన 3.80 లక్షల మంది రైతులకు రూ.285 కోట్ల పంట నష్టపరిహారం అదే అక్టోబరు 2020లోనే అందజేసాం. ఆంటే ఆ సీజన్‌ ముగిసేలోగా వారికి అందించాం. 2020 నవంబరు చివర్లో వచ్చిన నివార్‌ తుఫాను వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని డిసెంబరులోనే సీజన్‌ ముగిసేలోపే ఇచ్చాం. 2021 సెప్టెంబరు చివర్లో వచ్చిన గులాబ్‌ తుఫాను, నవంబరులో అధిక వర్షాల వల్ల నష్టపోయిన 6.31లక్షల మంది రైతులకు రూ.564 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా నవంబరులోనే అందజేసాం. అదే సీజన్‌ ముగియక మునుపే అందించాం. ఇలా ఎప్పటికప్పుడు సీజన్‌ ముగిసేలోగా అవసరమున్నప్పుడు రైతులకు సాయం అందితేనే రైతు తన కాళ్లమీద తను నిలబడగలుగుతాని చెప్పి.. రూ.1835 కోట్లు రైతులకు సమయానికి అందించగలిగాం.

సున్నా వడ్డీకి సంబంధించిన తేడా….
ఇక సున్నా వడ్డీకి సంబంధించి బాబు ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనిస్తే.. మొత్తంగా రూ.1180 కోట్ల పంటరుణాల మీద వడ్డీ రాయితీ సొమ్మను గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. రైతులతో పాటు బ్యాంకులూ గగ్గోలు పెట్టిన పరిస్థితి. అటువంటి పరిస్థితిని పూర్తిగా మారుస్తూ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా పూర్తిగా మనమే చెల్లిస్తూ.. 73.88 లక్షల మంది రైతులకు వైయస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాల కింద మనం రూ.1834.55 కోట్లు ఇచ్చాం. ఇది రైతన్నల మీద వ్యవసాయం మీద గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి చిత్తశుద్ధిలో ఉన్న తేడా.

గత ప్రభుత్వం విపత్తుల సహాయ నిధిని, ధరల స్థిరీకరణ నిధిని కేవలం ఎన్నికల వాగ్దానంగా మాత్రమే చేసి రైతులను మోసం చేసింది. మన ప్రభుత్వం ఆ రెండింటిని కూడా అమల్లోకి తీసుకొచ్చి రైతన్నలకు అన్నిరకాలుగా తోడుగా నిలబడింది. గత ప్రభుత్వం ఏనాడు కూడా రైతులకు పగటిపూట 9 గంటలు క్వాలిటీ విద్యుత్‌ ఇచ్చే ఏ చర్య కూడా తీసుకోలేదు. 9 గంటలపాటు క్వాలిటీ విద్యుత్‌ను మన ప్రభుత్వం పగటిపూట అందిస్తోంది.
ఫీడర్ల కెపాసిటీ కూడా లేకుండానే గతంలో ఐదు సంవత్సరాల పరిపాలన చేశారు. మనం వచ్చిన తర్వాత దీన్ని మెరుగుపరుస్తూ రూ.1700 కోట్లు ఖర్చుచేశాం. గతంలో రూ.9వేల కోట్లు రైతులకివ్వాల్సిన బకాయిలు కూడా ఎగ్గొట్టిన మహానుభావుడు ఎవరూ అంటే అది గత ప్రభుత్వ పాలకుడే.

పాడి రైతులకు సంబంధించి….
గత ప్రభుత్వం పాడిరైతులకు సంబంధించి.. వాళ్లకు సంబంధించిన కంపెనీలు బాగుపడాలి, రైతులకు ఏ రకంగా నష్టం జరిగినా పట్టించుకోని పరిస్థితుల నుంచి ఇవాళ .. మన ప్రభుత్వం అమూల్‌ ద్వారా రైతులను ఆదుకుంది. భారతదేశంలోనే కాకుండా… ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఆమూల్‌ సంస్ధను తీసుకుని వచ్చి మన రాష్ట్రంలో వారితో పాలవ్యాపారం మొదలుపెట్టించాం. ఈ రోజు రాష్ట్రంలో అమూల్‌ వచ్చిన తర్వాత ప్రతి కంపెనీ కూడా పోటీలో నిలబడేందుకు అమూల్‌ రేట్లతో పోటీపడ్డం వల్ల పాలధరలు ఏ రకంగా పెరిగాయో రాష్ట్ర మంతా కనిపిస్తుంది.

ధాన్యం సేకరణలోనూ…
గత ప్రభుత్వం సంవత్సరానికి ధాన్యం సేకరణకు రూ.7–8 వేల కోట్లు ఖర్చు చేస్తే, మన ప్రభుత్వం రూ.13వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇ– క్రాపింగ్‌ ద్వారా ప్రతి రైతన్నను ఆర్బీకే కేంద్రం ద్వారా ఐడెంటిఫై చేసి.. గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టింది.
గత ఐదు సంవత్సరాలలో ధాన్యం సేకరణ కోసం చేసిన ఖర్చును.. మనం మూడేళ్లలోనే దాటిపోయి ధాన్యం సేకరణ చేస్తున్నాం. ఈ రోజు ఇవన్నీ చేయగలిగాం కాబట్టే.. 2014 నుంచి 2019 మధ్యలో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది.
అప్పటికి (2014 నాటికి) మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 154 లక్షల టన్నులైతే… మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లలోనే సగటున 167 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే సగటున ఏడాదికి 13 లక్షల టన్నులు దిగుబడిలో పెరుగుదల కనిపిస్తోంది.

ప్రతి అడుగులోనూ రైతులకు ప్రభుత్వం తోడుగా అండగా ఉండడంతో పాటు దేవుడి దయ వలన ఇది సాధ్యమయింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా జరగాలని, రైతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని రైతులకు ఎంత చేసిన అది తక్కువే అవుతుందని మరొక్కసారి మనవి చేస్తున్నాను. దేవుడి దయ ప్రజల చల్లని దీవెనలు మనందరిమీదా ఎల్లకాలం ఉండాలని, మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాని అని సీఎం ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర అధికారులు, రైతులు ఆయా జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

LEAVE A RESPONSE