– టీడీపీ మహిళా నేత ఆచంట సునీత
ముఖ్యమంత్రి పేరు జగన్మోహన్ రెడ్డి కాదు.. మద్యమోహన్ రెడ్డి. అధికారంలోకి రావడానికి సొంత చిన్నమ్మ తాళిబొట్టు తెంపిన వ్యక్తి రాష్ట్ర మహిళల తాళిబొట్లు తెంపడనే గ్యారంటీ ఏంటి? అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి.. టార్గెట్ పెట్టి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నాడు. అశ్వమేధయాగం చేయొచ్చునేమోగానీ.. రాష్ట్రంలో మద్యం మాత్రం కొనలేమని మందుబాబులు అంటున్నారు.
మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో పాలన సాగించే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారు. మహిళా పక్షపాతిని, మహిళా సంక్షేమమే మా ధ్యేయం అని చెబుతూనే మహిళల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టోలో పెట్టిన మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. ఎన్నికలకు ముందు జగన్ అధికారంలోకి వస్తే ఆదుకుంటారన్న భారతమ్మ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండన్న విజయమ్మలు తెగుతున్న తాళిబొట్లపై సమాధానం చెప్పాలి.
ఎన్నికలకు ముందు మద్యపాన నిషేదం చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని సొంత కల్తీ బ్రాండ్లు అమ్మూతూ ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటున్నారు తప్ప మద్య నిషేదం అనే ఊసే ఎత్తలేదు. టీచర్ల చేత మద్యం అమ్మించిన ఘనత జగన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు, మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. రూ.16కు తయారైన మద్యం బాటిల్ ను జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.200లకు విక్రయిస్తోంది. దీనివల్ల రోజుకు రూ.184 భారం పెరిగింది.
రోజుకు రూ.184 చొప్పున నెలకు రూ.5,520 చొప్పున సంవత్సరానికి మందుబాబుల కుటుంబాలపై రూ.66,240 అదనపు భారం పడుతోంది. దీనివల్ల మందుబాబుల దినసరి కూలీ మొత్తం త్రాగుడుకే ఖర్చవటం వల్ల వారి కుటుంబాలు చితికిపోతున్నాయి. కరోనా సమయంలో పెరిగిన రేట్లతో మద్యం అలవాటు మానుకోలేక, అధిక ధరలకు మద్యం కొనలేక కరోనా సమయంలో సుమారు 50 మందికిపైగా శానిటైజర్ త్రాగి చనిపోయారు, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. ప.గో జిల్లా జంగా రెడ్డి గూడెంలో కల్తీ సారా త్రాగి సుమారు 30 మంది చనిపోయారు.
అమ్మఒడికి రూ. 14 వేలిచ్చి నాన్న బుడ్డితో రూ. 40 వేలు లాక్కుంటున్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు నిర్వహించకుండా జీఎస్టీ, ట్యాక్సులు కట్టకుండా వేల కోట్లు మింగుతున్నారు. మద్యం షాపులకు మద్యం సరఫరా చేసే బాధ్యతను వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి అప్పగించి, మద్యం షాపుల్లో విధులు నిర్వర్తించే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలిచ్చే బాధ్యతను రెడ్డి ఎంటర్ ప్రైజెస్ కి అప్పజెప్పి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. మద్యంపై వచ్చే వ్యాట్ ని రెండు ముక్కలు చేసి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం బేవరెజేస్ కార్పోరేషన్ కి దారి మళ్లించేలా చేసి ఆ ఆదాయం ద్వారా చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి సంక్షేమ పధకాల అమలు బాధ్యతను బెవరేజెస్ కార్పేరేషన్ కి అప్పగించారు.
తండ్రి తాగితే కొడుకుకు అమ్మ ఒడి, కొడుకు తాగితే తల్లికి వృద్ధాప్య పింఛన్, భర్త తాగితే భార్యకు ఆసరా ఇస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం అభివృద్ది పనులతో ఆదాయాన్ని సమకూర్చుకుని సంక్షేమ పధకాలు అమలు చేయాలి తప్ప మద్యం అమ్మకాలపై టార్గెట్లు పెట్టి మందుబాబుల రక్తం పీల్చి ఆ ఆదాయంతో సంక్షేమ పధకాలు అమలు చేయలనుకోవటం సిగ్గుమాలిన చర్య అని టీడీపీ మహిళా నేత ఆచంట సునీత తెలిపారు.