-ఊడిముడిలంక గ్రామ ప్రజలకు సీఎం వైయస్ జగన్ హామీ
-ఈ సీజన్ ముగియకముందే వరద నష్ట పరిహారం అందజేస్తాం
-అధికారులు మిమ్మల్ని బాగా చూసుకున్నారా..?
-మీ కలెక్టర్‌కు ఎన్ని మార్కులు వేయొచ్చో మీరే చెప్పండి
-సహాయక కార్యక్రమాలను బాధితులను స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం
-ఈ ప్రభుత్వం మీది.. మీ మంచి కోసం పనిచేసే ప్రభుత్వం
-సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, వలంటీర్ల, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు అభినందనలు
గోదావరి వరదలతో ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేసి కావాల్సిన వనరులను వారి చేతుల్లో పెట్టి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా క్షేత్రస్థాయిలోకి పంపించాం. గత పాలకుల మాదిరిగా ప్రచార ఆర్భాటాలు కాకుండా ప్రజలకు మంచి జరగాలని తపన, తాపత్రయంతో అడుగులు వేశాం’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లను సీఎం వైయస్ జగన్ అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడుముడి లంక గ్రామంలో సీఎం వైయస్ జగన్ పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
ఊడుముడిలంక గ్రామంలో దాదాపు వెయ్యి మంది నివాసం ఉంటున్నారు. మీ అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. మీరు చెప్పే సమాధానాన్ని బట్టే కలెక్టర్‌కు మార్కులు ఇస్తా..
ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, కేజీ పప్పు, లీటర్ పామాయిల్, లీటర్ పాలు, కేజీ టమాటా, కేజీ బంగాళాదుంప, కేజీ ఉల్లిపాయలు అందరికీ అందాయి కదా.. ఇంటింటికీ రూ.2 వేలు అందించారు కదా.. మనుషులతో పాటు పశువులను బాగా చూసుకున్నారు కదా.. కలెక్టర్‌కు మంచి మార్కులు ఇవ్వొచ్చా..? అని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు గ్రామస్తులంతా ముక్తకంఠంతో మమ్మల్ని బాగా చూసుకున్నారు. వరద తక్షణ సాయం కూడా అందించారు.. వందకు వంద మార్కులు ఇవ్వొచ్చు అని ప్రజలు అన్నారు.
ఏ ఒక్కరూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలనే తపన, తాపత్రయంతో కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు సహాయక చర్యలు చేపట్టారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా సహాయక కార్యక్రమాలు జరగలేదు. ఈ స్థాయిలో పనులు జరిగితే దాన్ని డ్రామాలు అనరు. కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ.. వారి చేతుల్లో వనరులు పెట్టి.. కచ్చితంగా ఏ ఇంటికీ మిస్ కాకుండా ప్రతి ఒక్కరికీ మంచి జరిగించాలని ముఖ్యమంత్రిగా నేను దిశానిర్దేశం చేసి.. అధికారులకు వారం రోజులు సమయం ఇచ్చాను. వారంలో చేయాల్సినవన్నీ చేయాలి. ఆ తరువాత నేరుగా నేను వస్తానని, వచ్చి ప్రజలందరినీ అడిగినప్పుడు ఏ ఒక్కరి నోట నుంచి మంచి జరగలేదనే మాట రావొద్దని గట్టిగా ఆదేశాలిచ్చా. ఈ మాదిరిగా చేస్తే డ్రామాలు అనేవి ఉండవు.. అందరికీ మంచి జరుగుతుంది.
ఏదైనా విపత్తు వచ్చినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి అక్కడకు వచ్చేసి.. కలెక్టర్లు, అధికారులు ప్రజలకు మంచి చేయకుండా తన వెంట తిప్పుకుంటూ ఫొటోలు, టీవీలకు ఫోజులు ఇచ్చుకుంటూ.. ప్రజలకు ఏం జరిగితే ఏముందిలే.. మన టీవీలు, మన పేపర్లు ఉన్నాయి కదా.. మనకు ఏరకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు.. మన ఈనాడు, మన ఆంధ్రజ్యోతి, మన టీవీ5 మహా బంగారంగా బాబు పనిచేశాడని రాస్తారు.. ఎవరికీ మంచి జరగకపోయినా పర్వాలేదనే పాలకులను గతంలో చూశాం.
విపత్తు వచ్చిన వెంటనే చంద్రబాబు వచ్చేవాడు. పర్యటన పేరుతో అతను బాగా పనిచేయడం లేదు.. ఇతను బాగా పనిచేయడం లేదు.. వాడు డిస్మిస్, వీడు డిస్మిస్ అని చెప్పేవాడు.. బాబు చేష్టలను పేపర్లు, టీవీలు ఊదరగొట్టేవి. మన ప్రభుత్వంలో అలా కాదు.. ప్రతి అధికారితో పనిచేయించాం.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో భాగస్వామిని చేసేలా వారికి దిశానిర్దేశం చేశాం.. కావాల్సిన వనరులు వారికి ఇచ్చాం.
చంద్రబాబు గత రెండు మూడు రోజులు ఇదే ప్రాంతంలో తిరగాడు. రేషన్ అందలేదని, రూ.2 వేలు ముట్టలేదని ఒక్కరినీ కూడా చూపించలేకపోయాడు. మన ప్రభుత్వంలో అంత ట్రాన్స్‌పరెన్స్‌గా పనులు జరుగుతున్నాయి. ఇంత బాగా పనిచేస్తుందుకు కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు అందరికీ అభినందనలు.
గ్రామ ప్రజలు బ్రిడ్జి కావాలని అడిగారు.. ఆ బ్రిడ్జి బాధ్యత నాది. మరో నెలన్నరలోపు పనులు కూడా స్టార్ట్ చేయిస్తా. చిన్న చిన్న సమస్యలు అడిగారు. లంక గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు జరుగుతాయని మాటిస్తున్నా. దేవుడి దయతో ఈరోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది. వరద నష్టాన్ని అధికారులు అంచనా వేస్తారు. ఇల్లు, పంట నష్టం.. ఏది నష్టం జరిగినా ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. మరో 10 – 15 రోజుల్లోనే వరద నష్టం అంచనా పూర్తిచేస్తారు. ఈ సీజన్ ముగియకముందే.. అంటే రెండు మూడు నెలల్లోపే ఆ డబ్బు చేతుల్లో పెడతాం.