Suryaa.co.in

Andhra Pradesh

నా వెంట్రుక కూడా పీకలేరు

రాష్ట్రంలో దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు
అలాగే దౌర్భాగ్య ఎల్లో మీడియా. ఇది మనందరి ఖర్మ
ఇన్ని సమస్యలు, కష్టాలు.. ఇవేవీ నన్ను కదిలించలేవు
నన్ను బెదిరించలేవు. అందరికీ ఒక్కటే చెబుతున్నాను
దేవుడి దయతో, ప్రజల దీవెనలతో ఈ స్థాయికి వచ్చాను
అవి ఉన్నంత కాలం వారు నా వెంట్రుక కూడా పీకలేరు
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు
నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు
సంపూర్ణ పోషణతో పిల్లలకు పౌష్టికాహారం
రోజుకొక మెనూతో గోరుముద్ద పథకం అమలు
తద్వారా పిల్లలకు విద్యతో పాటు, మంచి ఆహారం
పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువులు మాత్రమే
పేద పిల్లలు చదువుకుంటే బతుకులు మారుతాయి
అందుకోసమే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
భోజనం, వసతి ఖర్చుల కోసం వసతి దీవెన పథకం
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు
ప్రభుత్వ బడులలో చేరుతున్న విద్యార్థులు పెరిగారు
జీఈఆర్‌లోనూ గణనీయంగా పెరుగుదల నమోదు
జాతీయస్థాయి సగటు కంటే కూడా ఎంతో ఎక్కువ
ఇన్ని మార్పులు చంద్రబాబుకు కనిపించవు
ఆయన పార్టీకి, దత్తపుత్రుడికీ ఏవీ కనిపించవు
ఎల్లో మీడియాకు అంత కంటే అస్సలు కనిపించవు
రోజూ కట్టుకధలు, వక్రీకరణలు, ప్రభుత్వంపై బురద
ఆ అసూయ, కడుపు మంటకు మందు లేదు
చివరకు ఢిల్లీలోనూ రాష్ట్ర పరువు తీస్తున్నారు
నంద్యాల సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటన
– 2021–22 విద్యా సంవత్సరంలో ‘జగనన్న వసతి దీవెన’ రెండో విడత చెల్లింపులు:
నంద్యాలలోని ఎస్‌పీజీ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 10,68,150 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

సంస్కరణలు–కొత్త జిల్లాలు:
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువగా చేస్తానని మొట్టమొదట నంద్యాలలోనే మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఇవాళ మీ బిడ్డగా ఇక్కడకు వచ్చానని గర్వంగా తెలియజేసుకుంటున్నాను.
ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి స్నేహితుడికి మీ బిడ్డ శిరస్సు వంచి పేరు పేరునా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లి, సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల చదువులకు సంబంధించి అనేక సంస్కరణలను, మనం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేశాం.

చదువుకు దూరం కాకూడదు:
ఇవాళ విద్యా రంగంలో జరుగుతున్న సంస్కరణలు, చోటు చేసుకుంటున్న పరిణామాలను ఒకసారి గమనించమని కోరుతున్నాను. పేదరికం వల్ల ఏ ఒక్క పాప కానీ, ఏ ఒక్క బాబు కానీ ప్రాథమిక విద్యను కానీ, ఉన్నత విద్యకు కానీ దూరమయ్యే పరిస్థితి రాకూడదు.
పెద్ద చదువుకు అయ్యే ఖర్చు కోసం ఏ ఒక్క తల్లి తండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఇది గొప్ప ఆలోచన. నా కళ్లెదుటనే, నా పాదయాత్రలో ఎన్నెన్నో గాధలు విన్నాను. చదివించలేని స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. చదువుకోవాలని ఆరాటం ఉన్నా, పేదరికం వల్ల చదువులు మానేస్తున్న పిల్లలు ఉన్నారు. ఈ చదువులు కనుక మనం పిల్లలకు ఇవ్వలేకపోతే, చదువు అనే ఆస్తి నేను పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రావు.
ఇటువంటి ఆలోచనతో విద్యా రంగంలో సమూల మార్పులు చేసే దిశగా అడుగులు వేశాం. కాబట్టే ఒకవైపున పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తీసుకొచ్చి, ఆ పిల్లలు, తల్లిదండ్రులకు తోడుగా, అండగా నిలబడ్డాం. గతంలో మాదిరిగా అరకొర కాకుండా, ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితిని పూర్తిగా మార్చి, వారికి పూర్తి ఫీజు చెల్లిస్తున్నాం.
మరోవైపు భోజనం, వసతి ఖర్చుల కోసం తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బంది పడకూడదని భావించాం. ఎందుకంటే ఆ ఖర్చులు కూడా వేలల్లోనే ఉంటాయి. వాటి కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదనుకున్నాం.

నాన్నగారి కంటే కూడా..:
గతంలో నాన్నగారు దివంగత మహానేత వైయస్సార్‌ హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చూశాం. ఆ తర్వాత అందరూ ఆ పథకాన్ని నీరు గార్చారు. పేద పిల్లల చదువుల కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే, అదే నాన్నకు కొడుకుగా జగన్‌ అనే నేను రెండు అడుగులు వేస్తానని చెప్పాను. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా, కొన్ని మార్పులు చేశాం. అందులో భాగంగానే జగనన్న వసతి దీవెన వంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం.

వసతి దీవెనలో ఇవాళ..:
ఇవాళ నంద్యాల గడ్డ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10,68,150 మంది పిల్లలకు మంచి చేసేలా 9,61,140 తల్లుల ఖాతాల్లో నేరుగా బటన్‌ నొక్కి 2021–22 సంవత్సరానికి సంబంధించి జగనన్న వసతి దీవెన రెండో విడతగా రూ.1,024 కోట్లు వారి ఖాతాల్లోకి పంపించడం జరుగుతుంది. జగనన్న వసతి దీవెన పథకంలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదివే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ఏటా, రెండు దఫాల్లో ఇస్తామని చెప్పాం. అందులో భాగంగానే ఇవాళ రూ.1,024 కోట్లు జమ చేస్తున్నాం.

తోడుగా ఉంటాను. నా హామీ:
ఒక కుటుంబంలో ఒకరికే పథకం పరిమితం చేయడం లేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరినీ చదివించండి. మీ అన్న జగన్‌ మీకు తోడుగా ఉంటాడని హామీ ఇస్తున్నాను. మన పిల్లలు చదవాలి. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అది చదువులు మాత్రమే. ఆ చదువులతోనే మన బ్రతుకుల తలరాతలు మారుతాయని ప్రతి చెల్లెమ్మ గుర్తించాలి.

జవాబుదారీతనం:
వసతి దీవెన, వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లో నేరుగా రెండు దఫాల్లో జమ చేస్తున్నాం. దీని వల్ల కాలేజీల్లో జవాబుదారీతనం కూడా పెరుగుతుంది. విద్యాదీవెనలో కూడా ఇలాగే తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. అప్పుడు వారే స్వయంగా కాలేజీలకు వెళ్లి ఫీజు కడతారు. ఒకవేళ అక్కడ వసతులు లేకపోయినా, చదువులు బాగాలేకపోయినా వారు ప్రశ్నించగలుగుతారు. అదే విధంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు. తద్వారా కాలేజీల్లో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది.

చదువల్లో మార్పులు:
చదువుల పరంగా మనం ఎన్నో మార్పులు చేశాం. వాటిని ఒకసారి గమనించండి. రాష్ట్రంలో ఎంత పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రతి పాప, ప్రతి బాబు మంచి, మెరుగైన చదువులు చదవాలని తపన, తాపత్రయంతో విద్యా రంగంలో వ్యవస్థను పూర్తిగా మార్చడానికి శ్రీకారం చుట్టాం.
పిల్లలకు మంచి చదువులు మాత్రమే కాదు, వారికి మంచి ఆహారం కూడా ఉండాలని, వారు ఏం తింటే
nandyala2 ఆరోగ్యంగా ఉంటారు. బాగా చదువుకుంటారు అని గతంలో ఎవ్వరూ ఆలోచించని విధంగా, అన్ని కోణాల్లో ఆలోచించి, వారి భోజనానికి గోరుముద్ద అని పేరు పెట్టి, రోజుకొక మెనూతో మంచి పౌష్టికాహారం అందిస్తున్నాం.
బడుల్లో నాడు–నేడుతో వాటి రూపురేఖలు మారుస్తున్నాం. గతంలో బడులలో బాత్‌రూమ్‌లలో నీళ్లుండవు. ఫ్యాన్లు లేవు. బ్లాక్‌బోర్డులు కూడా సక్రమంగా లేవు. ప్రహారీలు లేవు. కొన్ని స్కూళ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి. టీచర్లూ లేరు.

ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదువులు:
ఇప్పుడు ఆ నాడు–నేడుతో ఆ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మార్చడమే కాకుండా, తొలిసారిగా బైలింగ్వువల్‌ (ద్విభాష) పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చాం. ఆ పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లిష్‌లో, పక్కనే మరో పేజీలో తెలుగులో ఉంటుంది. ఇది పిల్లలకు, టీచర్లకూ ఎంతో ఉపయోగపడతాయి. ఆ విధంగా పిల్లల్లో క్రమంగా ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచడమే కాకుండా, పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియమ్‌వైపు అడుగులు వేశామని కూడా సగర్వంగా చెబుతున్నాం.

గవర్నమెంటు బడికి మళ్లీ మంచి రోజులు తీసుకురావడం జరిగింది. మొత్తంగా విద్యా విధానాన్ని రాబోయే తరం అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఇవాళ్టి నుంచి 15, 20 సంవత్సరాల తర్వాత ఆ ప్రపంచంలో మన పిల్లలు తలెత్తుకుని నిలబడేలా, భావి ప్రపంచంతో పోటీ పడి మన పిల్లలు నెగ్గేలా ప్రాథమిక విద్య నుంచి కాలేజీల వరకు మార్పులు చేస్తూ అడుగులు వేస్తున్నాం.

ఉన్నత విద్యా రంగంలో..:
మనకు స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. అందులో ఒకటి నంద్యాలలో కూడా ఏర్పాటవుతోంది. కొత్తగా విశ్వవిద్యాలయాలు వస్తున్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పైనా మనందరి ప్రభుత్వం దృష్టి పెట్టింది. తొలిసారిగా మైక్రోసాఫ్ట్‌
nadyala-dis సర్టిఫికెట్‌ కూడా కాలేజీలకు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అనుసంధానం చేయడం జరిగింది. కాలేజీల్లో మొత్తం కోర్సులను జాబ్‌ ఓరియెంట్‌గా మారుస్తూ అడుగులు ముందుకు వేశాం. కాలేజీ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేయడం జరిగింది. అలాగే కోర్సుల్లో మరిన్ని స్పెషలైజ్డ్‌ వర్టికిల్స్‌ కూడా తీసుకొచ్చాం. దాదాపుగా 67 వొకేషనల్‌ కోర్సులు, 25 మార్కెట్‌ ఓరియెంట్‌ కోర్సులు ప్రవేశపెట్టాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సు కూడా ప్రవేశపెట్టాం.

అమ్మ ఒడి:
రాష్ట్రంలో ఏ తల్లి అయినా కూడా తమ పిల్లలకు మంచి చదువుల కోసం ఆరాటపడుతుంది. వారిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా, పిల్లలను బడికి పంపిస్తే చాలు, 12వ తరగతి వరకు. ఆ తల్లులకు మంచి చేస్తూ జగనన్న అమ్మ ఒడి అన్న పథకం తీసుకొచ్చాం. హాజరుకు జత చేస్తూ, ఏటా రూ.15 వేలు ఆ చెల్లెమ్మలకు ఇస్తున్నాం. ఇవాళ అక్షరాలా 44 లక్షల తల్లులకు, 84 లక్షల పిల్లలకు అమ్మ ఒడి ద్వారా మేలు జరుగుతోంది. దేవుడు నాకు ఇంత అవకాశం ఇవ్వడం ఎంతో సంతోషం.

అక్కచెల్లెమ్మలకు అండగా..:
ఒక్క అమ్మ ఒడి మాత్రమే కాదు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు ఎన్నో అడుగులు వేశాం. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాలు. 31 లక్షల ఇళ్ల స్థలాలు. బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు, బ్యాంకులతోనూ టైఅప్‌ చేసి, అక్క చెల్లెమ్మలకు ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాం. ఎందుకుంటే అక్కచెల్లెమ్మలు బాగుంటే, కుటుంబాలు బాగుంటాయని చెప్పి మూడేళ్లుగా అడుగులు వేస్తున్నాం.

అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా:
పిల్లల చదువులు మాత్రమే కాకుండా, వారికి మంచి ఆహారం ఇవ్వడంపైనా దృష్టి పెట్టాం. అందుకోసం వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం తీసుకొచ్చాం. గర్భవతులతో పాటు, చిన్న పిల్లలు బాగా ఎదిగేలా వారికి మంచి ఆహారం ఇస్తున్నాం. గతంలో ఈ పథకానికి రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అదే ఇవాళ వైయస్సార్‌ సంపూర్ణ పోషణ పథకం కోసం ఏటా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైయస్సార్‌ సంపూర్ణ పోషణతో ఆరేళ్ల వరకు మంచి ఆహారం అందుతుంది. వారు ఆ తర్వాత స్కూళ్లో చేరితే, వైయస్సార్‌ గోరుముద్ద పథకం ద్వారా మంచి ఆహారం ఇస్తున్నాం. దీనికి గతంలో ఏటా రూ.500 కోట్లు కూడా ఖర్చు చేస్తే, ఇవాళ అదే పథకానికి ఏటా రూ.1900 కోట్లు ఖర్చు చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను.

చిక్కీల మీదా దుష్ప్రచారం:
పిల్లలకు మంచి జరగాలని చెప్పి, ఈ పథకం తేవడంతో పాటు, వారికి ఇంకా మంచి చేయడం కోసం చిక్కీ ఇస్తున్నాం. అయితే ఆశ్చర్యం ఏమిటంటే.. పిల్లలు చిక్కీ తినేటప్పుడు ఆ పాకం పిల్లల చేతికి అంటుతుంది. కాబట్టి అలా అంటకుండా ఉండేందుకు, ఆ చిక్కీకి ఒక మంచి కవర్‌ తొడిగి, దాన్ని చక్కగా ప్యాక్‌ చేస్తే.. చంద్రబాబుగారు, ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా ఏం రాస్తారో తెలుసా..
గతంలో దాని కోసం కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ప్రభుత్వం రూ.1900 కోట్లు ఖర్చు చేస్తోందని, మంచి ఆహారం ఇస్తోందని రాయరు. కానీ ఆ చిక్కీ మీద జగనన్న ఫోటో ఉందని రాస్తారు.

వాటికి మందు లేదు:
ఈ అసూయ, కడుపు మంటకు మందు లేదు. ఆ అసూయ, కడుపు మంట ఇంకా ఎక్కువైతే వారికి కచ్చితంగా బీపీ వస్తుంది. ఏదో ఒకరోజు పైకి టికెట్‌ కొంటారు. కాబట్టి అసూయను తగ్గించుకోవాలని, లేకపోతే వారి ఆరోగ్యానికి చేటు అని సలహా ఇస్తున్నాను. ఇవాళ ఏ ఒక్కరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కానీ, ఈ బజాయించే ఎల్లో మీడియా కానీ వాస్తవాలు చెప్పరు.

ఒక్క రెండు పథకాల్లోనే..:
గతంలో ఫీజు చెల్లింపులు అరకొరగా ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో రూ.70 వేల ఫీజు ఉన్నా అరకొరగా ఇచ్చారు. మరోవైపు అదీ ఇవ్వలేదు. ఆ ఇచ్చే ఫీజులు కూడా 2017–18, 2018–19 కి సంబంధించిన ఫీజులు ఎగ్గొట్టి, రూ.1,778 కోట్లు బకాయి పెట్టి పోతే, ఆ ఫీజులు కూడా మన ప్రభుత్వం పిల్లల కోసం కట్టడమే కాకుండా, పూర్తి ఫీజు ఇస్తోంది. అది కూడా ప్రతి క్వార్టర్‌కు ఆ ఫీజులు చెల్లిస్తోంది.

ఆ విధంగా చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లు కూడా కలుపుకుంటే, ఇప్పటి వరకు మనందరి ప్రభుత్వం పిల్లల ఫీజుల కింద రూ.6,969 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ఇచ్చామని తెలియజేస్తున్నాం. అదే విధంగా వసతి దీవెన పథకంలో ఇప్పటి వరకు రూ.3,329 కోట్లు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాం.

కేవలం ఈ రెండు పథకాలు.. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కోసం ఈ 34 నెలల కాలలో మీ జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.10,298 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. పిల్లల కోసం వాళ్ల మేనమామ చేసిన ఖర్చు ఇంత అని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు చెబుతున్నాను.

ఎన్నో సత్ఫలితాలు:
మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో గమనించండి. విద్యా రంగంలో డ్రాపవుట్లు గణనీయంగా తగ్గాయి.
18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఇంటర్మీడియట్‌ తర్వాత కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్యకు సంబంధించి జీఈఆర్‌ (గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో) చూస్తే.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి, అంటే 2018–19 నాటికి 32.4 ఉంటే, ఆ తర్వాత ఏడాదిలో అంటే 2019–20 నాటికి 35.2 కు చేరింది. జగనన్న వచ్చాడు. మా పిల్లల చదువులకు ఢోకా లేదని తల్లిదండ్రులు భావించారు. అందుకే కేవలం ఒక్క ఏడాదిలోనే జీఈఆర్‌ 8.64 శాతం పెరిగింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో ఆ పెరుగుదల సగటున 3.04 శాతం మాత్రమే ఉంది.
అదే విధంగా ఆడపిల్లలకు సంబంధించి జీఈఆర్‌ చూస్తే.. 11.03 శాతం పెరిగింది. అదే జాతీయస్థాయిలో కేవలం 2.28 శాతం పెరుగదల మాత్రమే నమోదైంది. అంటే జగనన్న ప్రభుత్వం రావడంలో, ఆడపిల్లలు బాగా చదువుతున్నారు.

విద్యారంగంలో మనం చేస్తున్న మార్పులతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనందరి ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ బడులలో 37 లక్షల పిల్లలు మాత్రమే చదివితే, ఇప్పుడు ఆ సంఖ్య 44.3 లక్షలకు పెరిగింది. అంటే అక్షరాలా 7.18 లక్షల పిల్లలు ప్రైవేటు స్కూళ్లు వదిలిపెట్టి, గవర్నమెంటు బడులలో చేరారు. ఇంతగొప్ప మార్పును గమనించమని మీ అందరినీ కోరుతున్నాను. అన్న ఉన్నాడు. గవర్నమెంటు బడులను బాగా మారుస్తున్నాడు అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అందుకే ఆ బడులలో సీట్ల కోసం ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తున్నారు.

బురద చల్లడమే వారి పని:
ఇన్ని మార్పులు ఇంత చక్కగా జరుగుతున్నా.. మన చంద్రబాబుకు కానీ, ఆయన పార్టీకి కానీ, ఆయన దత్తపుత్రుడికి కానీ, ఆయనను సమర్థించే ఎల్లో మీడియాకు సంబంధించిన మిత్రులకు కానీ ఇవేవీ కనిపించవు. అందుకే రోజుకొక కట్టుకధ. రోజుకొక వక్రీకరణ. ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం.
ఇక్కడ అల్లరి, గోల, వక్రీకరణ, అబద్దాలు సరిపోవని చెప్పి, చివరకు పార్లమెంటులో కూడా ప్రభుత్వంపై బురద చల్లారు. ఆ విధంగా రాష్ట్రం పరువు కూడా తీస్తున్న చరిత్ర వీరిది.

అది మన ఖర్మ:
ఎక్కడైనా ప్రతిపక్షాలు ఉంటాయి. రాష్ట్ర పరవు, ప్రతిష్టను పెంచడం కోసం పార్లమెంటు వంటి వేదికల్లో అందరూ కలిసి పని చేస్తారు. ఆ విధంగా ప్రభుత్వంతో కలిసి వస్తారు. రాష్ట్రం గురించి గొప్పగా చెబుతారు.
కానీ ఇక్కడ మన ఖర్మ ఏమిటంటే.. ఇక్కడ ఒక దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు. దౌర్భాగ్య ఎల్లో మీడియా. ఇవీ మనం రాష్ట్రం చేసుకున్న ఖర్మలు కాబట్టి, మన రాష్ట్ర పరువును తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది.

వెంట్రుక కూడా పీకలేరు:
మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. ఇన్ని సమస్యలు, కష్టాలు.. ఇవేవీ నన్ను కదిలించలేవు. నన్ను బెదిరించలేవు. మళ్లీ మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో జగన్‌ అను నేను, ఈ స్థానంలోకి వచ్చాను. అందుకే దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత కాలం వారు నా వెంట్రుక కూడా పీకలేరు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలూ ఎప్పుడూ ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.

నంద్యాలకు వరాలు:
ఇక్కడి ఎమ్మెల్యే రవి, నా స్నేహితుడు నియోజకవర్గానికి కొన్ని కావాలని అడిగాడు. 12 కి.మీ రోడ్డు వేస్తే, రింగ్‌రోడ్‌ ఏర్పాటవుతుందని, నంద్యాలకు మంచి జరుగుతుందని అడిగాడు. దాన్ని ఆమోదిస్తున్నాను. అదే విధంగా ఆటోనగర్‌ అభివృద్ధి, విస్తరణకు సహకారం కావాలని అడిగాడు. అందుకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని చెబుతున్నాను.

ఇంకా మిర్చి పంట అమ్మకాల కోసం మార్కెటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాను. వైయస్సార్‌ నగర్‌లో ఇంటర్నల్‌ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కూడా ఎమ్మెల్యే, నా సోదరుడు ప్రస్తావించాడు. వాటన్నింటినీ పరిష్కరించి, వైయస్సార్‌ నగర్‌ను పూర్తిగా తీర్చి దిద్దుతామని తెలియజేస్తున్నాను.

చివరగా..
రాబోయే రోజుల్లో మీ అందరికీ ఇంకా మంచి జరగాలని, మీకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మనసారా కోరుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు, మీ అందరి చిక్కటి
nandyala1 ప్రేమకు మరోసారి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతూ, సెలవు తీసుకుంటున్నానంటూ సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన సీఎం వైయస్‌ జగన్‌ వసతి దీవెన పథకం చెల్లింపులకు సంబంధించి రూ.1,024 కోట్లు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

LEAVE A RESPONSE