* 18 నెలల కాలంలో హామీలన్నీ నెరవేర్చాం
* అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపు
* చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి వెల్లువ
* ఓర్వలేకపోతున్న జగన్, వైసీపీ నాయకులు
* రప్పా…రప్పా…అంటూ బెదిరింపులు
* దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టం ఉక్కుపాదం : మంత్రి సవిత
* మోదా పంచాయతీలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పరిగి/శ్రీసత్యసాయి : మా ప్రభుత్వం నిబద్ధతతో పాలిస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలంతా సంతృప్తి వ్యక్తంచేస్తున్నారని, కాని జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం విషం కక్కుతున్నారని మండిపడ్డారు. రప్పా…రప్పా… అంటూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడే వారెవరూ లేరని అన్నారు. దౌర్జనాలు, బెదిరింపులకు పాల్పడేవారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందని స్పష్టంచేశారు.
పరిగి మండలం మోదా పంచాయతీలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆమె స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛన్ గా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఒకటో తేదీన పండుగగాని, ఆదివారంగాని వస్తే ముందురోజే పెన్షన్లు అందజేస్తున్నామన్నారు.
గురువారం నూతన సంవత్సరం సంబరాలను దృష్టిలో పెట్టుకుని ముందురోజే నేడు(బుధవారం) పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ నిబద్ధతకు పెన్షన్ల పంపిణీ ఓ నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల మందికి రూ.2,743 కోట్లను సామాజిక పెన్షన్ల రూపంలో అందజేస్తున్నామన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో 2.63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.115.51 కోట్లు, పరిగి మండలం మోదా పంచాయతీలో 1289 మందికి రూ.56 లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి హామీని, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు.
బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టం ఉక్కుపాదం
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 18 నెలలో కాలంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఎక్కడికెళ్లినా కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అయితే, జగన్, ఆయన పార్టీ నాయకులు మాత్రం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విషం కక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యాలు దెబ్బతినేలా రప్పా…రప్పా…అంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉక్కుపాదం మోపుతోందన్నారు.
ఇంటింటికీ వెళ్లి… ఆప్యాయంగా పలుకరించి…
అంతకుముందు మోదా పంచాయతీలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి మంత్రి సవిత లబ్ధిదారుల ఇళ్లకు పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలుకరిస్తూ, కుటుంబం కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాటకు కట్టుబడుతూ సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు అండగా నిలవాలని లబ్ధిదారులను మంత్రి సవిత కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.