అది మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి కెఇ కృష్ణమూర్తితో పాటు ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న పురాతన కాలేజీ. అత్యున్నత ప్రమాణాలతో నడుపుతున్న ఆ 150 ఏళ్ల చరిత్ర గల ఆ కాలేజీకి ఇప్పుడు కబ్జాల భయం పట్టుకుంది. కర్నూలులోని కోల్స్ కాలేజీ విద్యార్ధులు, అధ్యాపకుల భయమిది.
ఆంధ్రప్రదేశ్ లో అతి పురాతనమైన కళాశాల అది. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న విద్యాసంస్థలు చాలా ఉన్నాయి. కొన్ని కాలేజీలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఏపీలోని ఆ కాలేజీకి అత్యంత అరుదైన చరిత్ర ఉంది. రాయలసీమకే తలమానికమైన కర్నూలు (Kurnool District) లోని అతి పురాతనమైన వాటిల్లో ఇది ఒకటి. కోల్స్ కాలేజీ. దాదాపుగా 125 సంవత్సరాల చరిత్ర గల ఈ కళాశాల ఎంతో మంది గొప్పవాళ్ల భవిష్యత్‌ను తీర్చిదిద్దింది. బ్రిటీష్ కాలంలో స్థాపించిన ఈ భవనం… ఇప్పటికీ కొనసాగుతోంది. మొదట్లో పాఠశాలగా ప్రారంభమై.., అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఓ కాలేజీగా కొనసాగుతుంది. 1893లో ఈ భవన నిర్మాణం చేపట్టగా.. అప్పుడు కేవలం అందులో పాఠశాల మాత్రమే ప్రారంభించారు. అప్పటి “కోల్స్ దొర ” దాతృత్వం వల్ల మొదట హైస్కూల్ శంకుస్థాపన చేశారు.
కానీ ఆ భవనం పూర్తి అయి ప్రారంభమయ్యే సరికి చాలా సంవత్సరాలే పట్టింది. 1905లో అప్పటి మద్రాస్ గవర్నర్ జనరల్ “సర్ ఆర్థర్ లయోలో ” దానిని ప్రారంభించారు. దీనికి శంకుస్థాపన చేసిన కోల్స్ దొర పేరు మీదనే దీనికి ఆ పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కాల క్రమేణా హై స్కూల్‌ని అప్ గ్రేడ్ చేస్తూ 1969లో ఇదే భవనంలో కళాశాల ఏర్పాటు చేసారు.
ఎంతో చరిత్ర ఉన్న ఈ కాలేజీలో చదివిన ఎందరో ఇప్పుడు సివిల్స్, ఇంజనీరింగ్, వైద్య తదితర రంగాల్లో ఉన్నత స్థానంలో రాణిస్తున్నారు. ఈ కాలేజీలో చదివిన ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం K.E. కృష్ణమూర్తి, రఘురామయ్య, ప్రభాకర్..ఇలా ఎందరో ఉన్నారు. అలాగే NCC లెఫ్ట్ నెట్ జనరల్ U. సుగుణ కూడా ఇక్కడ సెరికల్చర్ జూనియర్ లెక్చరర్‌గా సేవలు అందించారు. ఎన్నో వేల మంది పేద విద్యార్థులకు సరస్వతీ నిలయంగా మారింది. ఆ నాటి బ్రిటిష్ కాలం నుండి విద్యార్థులకు విద్యాదానం చేస్తున్న గొప్ప సంస్థ కోల్స్ కాలేజీ.
కాలేజీకి మంచి చరిత్ర ఉండటంతో స్థానిక విద్యార్థులు ఈ కాలేజీలో చేరేందుకు మక్కువ చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని కళాశాలను అభివృద్ధి చేస్తే.. విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతుందని కాలేజీ ప్రిన్సిపాల్ ఎన్.ఝాన్సీరాణి కోరుతున్నారు. పాఠశాల హెచ్.మ్ డి. శ్యామున్ రాజు మాట్లాడుతూ, 125 సంవత్సరాలు చరిత్ర గల ఈ కాలేజీని ఆక్రమించాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నారని.. ఆ దురాక్రమణకు గురికాకుండా చొరవ తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెల్లదొరలు దాతృత్వంతో కట్టించిన కాలేజీని అభివృద్ధి చేయకపోయినా ఫర్వాలేదు గానీ, కబ్జా కాకుండా కాపాడాలని విద్యార్ధులు, కాలేజీ పూర్వ విద్యార్ధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.