– కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో రావడంతో భక్తుల సంభ్రమాశ్చర్యం
– ఉన్నతాధికారుల నిరాడంబరత పై ప్రశంసలు
విజయవాడ: అమ్మవారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కారణం.. పాలన వ్యవహారాల్లో నిత్యం తల మునకలై ఉండే కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాధారణ భక్తుల్లా ఉచిత క్యూలైన్లో నిలబడడం. భక్తులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకునేందుకు, వారి ఇబ్బందులు గ్రహించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రి ఓం సర్కిల్ నుంచి ఉచిత క్యూలైన్లో నిలబడ్డారు.
భక్తులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలను, మహిళలను పలకరిస్తూ మంచినీరు, పాలు, బిస్కెట్లు అందుతున్నది లేనిది వాకబు చేశారు. ఆసాంతం క్యూ లైన్ లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలు క్యూ లైన్ లో నిలబడటం ద్వారా గ్రహించామని చెప్పారు. కొన్నిచోట్ల చెత్త బుట్టలు, ఫ్యాన్లు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించామన్నారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు.
గంటా 15 నిమిషాలలో ఉచిత క్యూలైన్లో చక్కటి దర్శనం లభించిందని, అమ్మవారిని ఎక్కువ సేపు చూసే అవకాశం లభించిందని తెలిపారు. ధ్వజస్తంభాన్ని స్పృశించే అవకాశం ఉచిత క్యూలైన్లోనే ఉంటుందన్నారు. ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని, అర్ధరాత్రికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. మూలా నక్షత్రానికి మూడు నాలుగు రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
క్యూలైన్లో దర్శన ఏర్పాట్లు బాగున్నాయని ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ తెలుపగా, ఉన్నతాధికారుల వినయం, నిరాడంబరత నచ్చాయని కాకినాడ జిల్లా కడకుదురు గ్రామానికి చెందిన నక్క రాంబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.