– మసిపూసి మారేడుకాయ చేసిన చంద్రబాబు
– మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆగ్రహం
తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంతా ఆత్మస్తుతి పరనింద తప్ప ఇంకేం కనిపించలేదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆక్షేపించారు. సమావేశంలో అంకెల గారడీతో అభివృద్ధి చూపించడం మినహా… ప్రజలకు ఒరిగిందేంలేదని తేల్చి చెప్పారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… కలెక్టర్ల సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మా అధ్యక్షుడు మాజీ సీఎం వైయస్.జగన్ ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజలకిచ్చిన ఏ హామీని అమలు చేయకపోయినా… 15 నెలల పాలనలో చేసిన రూ.2 లక్షల కోట్లు అప్పు ఎవరి జేబుల్లోకి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
పీపీపీ విధానం, పీ 4 పై ఉపన్యాసాలివ్వడం మినహా… రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా రాష్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. నాలుగోసారి అధికారం చేపట్టిన చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నిర్దిష్టమైన ప్రణాళిక, నిర్ణయాలపై చర్చించిన దాఖలాలు లేవు. 15 నెలల పాలనలో వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, రహదారులు, సంక్షేమంపై నిర్దిష్టంగా ఈ విధానంలో రాష్ట్ర ప్రజలకు సాయం చేశామని చెప్పుకోలేని దుర్భరమైన పరిపాలన చేసారు.
మీ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. చంద్రబాబు నాయుడు.. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలు అమలు చేస్తున్నారు కానీ… రాష్ట్రంలో రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లేక విలవిల్లాడుతున్నారు. మద్దతు ధరకు కొనేవారు లేరు.రైతులు తాము పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్ధితి మీ పాలనలో లేకుండా పోయింది. వ్యవసాయాన్ని పూర్తిగా గాలికివదిలేశారు. వ్యవసాయానికి సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం.