– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి సవాల్
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో 10 సంవత్సరాల పాటు నానబెట్టింది. కానీ ఉద్యోగాలు కల్పించలేదు. గత పదేళ్లుగా ప్రతి సంవత్సరం 8,000 మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు సుమారుగా 80,000 ఉద్యోగాలు రావాలి.
ఆ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధించాలనే తపనతో, తమ తల్లిదండ్రులను కష్టపెట్టకూడదనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 కోచింగ్లు తీసుకున్నారు. చాలామంది నిరుద్యోగులు రూ.5,000తో భోజనంతో సర్దిపెట్టుకుని, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఉద్యోగం సాధించాలని తపనపడుతూ కష్టపడ్డారు.
TSPSC లో ఇప్పటివరకు 30 లక్షల మంది ఎన్రోల్ అయ్యారు. ఇంకా ఎన్రోల్ కానివారు కూడా 15–20 లక్షల మంది ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో ఏదైతే చేయలేకపోయిందో, కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్పింది. ఎన్నికల ముందు యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు. కానీ ఆ డిక్లరేషన్ అమలు కాలేదు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూడా అసెంబ్లీలో చెప్పారు. దీంతో చాలా మంది నిరుద్యోగులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 48,000 ఉద్యోగాలు ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 13,000 ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపేసుకుంది. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి, “మా అకౌంట్లలో వేసుకోండి” అని ప్రపోజల్ పెట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు.. ఒక్కో మంత్రి ఒక్కోలా చెబుతున్నారు. ఒకరు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని.. ఇంకొకరు 65,000 ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు. మరొకరు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన దానిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరావృతం చేస్తున్నారు. తర్వాత బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. మరి నిజంగా ఎక్కడ ఇచ్చారు?
నేను సవాలు విసురుతున్నాను – నిజంగా ఉద్యోగాలు ఇచ్చారనుకుంటే, ఎక్కడ ఇచ్చారో చూపించండి. అమరవీర స్థూపం దగ్గరకు నేను వస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయో చూపించండి. కాంగ్రెస్ మంత్రులు ఈ సవాలు స్వీకరించి చర్చకు రావాలి. చర్చకు మేం రెడీ.
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల ముందు రాహుల్ గాంధీ అశోక్నగర్కి వచ్చినప్పుడు కూడా “2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తాం” అని చెప్పారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటంటే – నిరుద్యోగుల వయసు మించి పోతోంది. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేవలం 6.5% మాత్రమే ఇచ్చి చేతులు తుడిచేసుకుంది. నిరుద్యోగుల గొంతుకై శాసన మండలిలో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించాం. కానీ బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం విషయంలో సీబీఐకి వెళ్తే సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సమావేశాన్ని వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, భారతీయ జనతా పార్టీ తరపున మేం డిమాండ్ చేస్తున్నాం.