ఎవరి పేరు చెబితే
నవ్వులు విరబూస్తాయో..
ఎవరు కనిపిస్తే
ప్రేక్షకుడి పొట్ట చెక్కలయిద్దో..
ఎవరి మొహంలో
హాస్యం లాస్యం చేస్తుందో..
అతగాడే రాజబాబు..!
పుణ్యమూర్తుల అప్పలరాజు..
ఇలా అంటే తెలుసుద్దా..?
రాజబాబు..
అలా చెబితే ఓ చరిత్ర..
నవ్వితే నవరత్నాలంటారు..
నవ్వించి రాజబాబు
ఎన్ని లక్షల రత్నాలు
కురిపించాడో మరి..
నవ్వే ఆయన సిరి..
నవ్వించడమే మగసిరి..!
సినిమా హీరో అంటే సెలబ్రిటీ
మరి రాజబాబంటే
అంతకు సమానమైన హోదా..
అది క్లారిటీ..
సినిమాలో ఆయన కామెడీకి
ఓ సెపరేటు ట్రాకు..
అదుంటే మొదటి రోజునే
సినిమాకి హిట్టు టాకు..!
నీ జడ పిన్ను
నా తలరాతకి పిన్ను..
బాలు మిమిక్రీతో
జయసుధతో ఓ డ్యూయెట్టు..
ఛీ..కులతా..నువ్వు నాకొద్దు..
ఫో..వాడి దగ్గరికే ఫో..
అయ్యో..అప్పుడు
నీకు అయిదేళ్ళా..
ఇల్లు..ఇల్లాలులో
ఈసారి జానకమ్మ స్వరంతో సూరమ్మ కూతురితో స్వీయగాత్రం..
మార్చేసింది ఆ సినిమా గోత్రం!
చిత్రంగా మారే గొంతు..
ఉన్నపళంగా వెనక్కి విల్లులా వంగిపోయే నడుం..
మనుషుల కోసం గ్లాసులు..కప్పులు..బల్లలు
ఎత్తి వెతికే మేనరిజం..
రాజబాబు ఇజం..!
నవ్వులరేడే కాదు..
విషాదం వైపూ ఓ చూపు…
ఎస్వీఆర్ మనవడిగా
ఆయనతోనే పోటీ నటన..
దర్శకరత్న ఘటన…
హీరోలతో సమానమైన క్రేజు
ఈ నవ్వులరాజు..!
పుణ్యమూర్తుల ఇంటిపేరని
చేసిందంతా పుణ్యమే..
సినిమా పరిశ్రమ కర్ణుడు..
ఈ నవ్వుల రేడు..
పరిశ్రమకు
రాకమునుపు మాస్టార్..
ఉన్నంతకాలం సూపర్ స్టార్..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286