- ఎక్కడా సమన్వయం లోపం లేకుండా ప్రణాళిక
- బైబై వైసీపీ అనే ప్రజల ఆలోచనను ముందుకు తీసుకెళ్తాం
- 28వ తేదీన రెండు పార్టీలఉమ్మడిభారీ బహిరంగ సభతాడేపల్లిగూడెంలో
- త్వరలోనే ఉమ్మడి మేనిఫోస్టో విడుదల
- జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే ఒకే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు పూర్తి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయి. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.
సమావేశం అనంతరం మీడియాతో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రయోజనమే మిన్నగా, ప్రజలకు భవిష్యత్తు అందించే దిశగా రెండు పార్టీలూ ముందుకు వెళ్తున్నాయి. ఉమ్మడిగా బలంగా కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. పొత్తు ధర్మంలో భాగంగా కొందరు నాయకులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. కచ్చితంగా ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుంది. రెండు పార్టీలు ఇప్పటికే పలుమార్లు సమన్వయ సమావేశాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాయి. అలాగే రెండు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇదే స్ఫూర్తితో ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక ఉంటుంది.
న భూతో అనేలా ఉమ్మడి సభ
28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద జరగబోయే ఇరు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ న భూతో అనేలా ఉండబోతోంది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ చేయబోతున్నాం… ఈ రాక్షస పాలనకు చరమ గీతం పాడేలా సభను నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీల నాయకులను సభకు ఆహ్వానిస్తాం. 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రజలంతా ‘బైబై వైసీపీ’ అనే పరిస్థితి ఉంది. ఇదే ఉత్సాహాన్ని ప్రజల్లో నింపేలా, రెండు పార్టీల కార్యకర్తలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేలా సభ ఉండబోతోంది. ఈ ప్రభుత్వం చేస్తున్న హడావుడి, సామాన్యుడిపై తీసుకొస్తున్న మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి 50 రోజుల సమయం ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు భద్రత, రైతులకు భరోసా అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు.
ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి : కె.అచ్చెన్నాయుడు , తెదేపా రాష్ట్ర అధ్యక్షులు
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ‘‘ఈ నెల 28వ తేదీన నిర్వహించబోయే సభ నిర్వహణకు ఒక్కో పార్టీ నుంచి ఆరుగురిని పర్యవేక్షణ కమిటీగా నియమిస్తాం. సూపర్ సిక్స్, షణ్మఖ వ్యూహం ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. టిక్కెట్ల విషయాన్ని చంద్రబాబు , పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉమ్మడిగా ప్రయాణం చేయాలి. ఇద్దరు సఖ్యతగా ఉంటే చూడలేని దుర్మార్గుడు జగన్. తెలుగుదేశం – జనసేన పార్టీ ల మధ్య ఏదో ఒక తగవు సృష్టించి లాభపడాలి అనుకునే వ్యక్తి కావడంతో.. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి.
ఈ దుర్మార్గ పాలనలో ప్రజలంతా బాధితులే. ఓడిపోతున్నామనే అక్కసుతో ఇప్పుడు మీడియాపైనా దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అన్ని సర్వేల్లోనూ, నివేదికల్లోనూ వైసీపీ ఓడిపోతుందని అర్ధం అయ్యే రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడు. దీన్ని ప్రజలంతా గమనించాలి. ఓడిపోతున్నామనే అక్కసుతో భౌతిక దాడులకు దిగుతున్నారు. నేను నా రాజకీయ జీవితంలో ఎందరో నాయకులను చూశాను కానీ, ప్రజలంతా అసహ్యించుకునే రాజకీయ నాయకుడు మాత్రం జగన్ ఒక్కడే. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఈ దుర్మార్గ పాలకుడిని ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అనేలా ప్రజలు వేచి చూస్తున్నారు.
కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించడానికి ప్రజలంతా ఇప్పటికే మానసికంగా సిద్ధంగా ఉన్నారు’’ అన్నారు. సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన పార్టీ నుంచి బి.మహేందర్ రెడ్డి, కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్, కొటికలపూడి గోవిందరావు, మతి పాలవలస యశస్వి, తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, మతి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు.