Suryaa.co.in

Features

కామన్ మ్యాన్

ఎవరయ్యా నువ్వు?
“ వంద కోట్లు పైబడిన మన దేశ జనాభాలో ఓటు హక్కు
నాకూ ఉందన్న గర్వంతో బ్రతుకుతున్న కామన్ మ్యాన్ ని”

మరి ఆ మాసిన గడ్డం ఏమిటి?
“ ప్రజా సంక్షేమం..పాలనా వ్యవహారాలను గాలికొదిలి
ప్రజా ప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తూ
ప్రజాస్వామ్యపు విలువలను అపహాస్యం పాలుచేస్తున్న
అవకాశవాద రాజకీయ పార్టీల తీరును చూసి”.

ఆ కళ్ళేమిటి లోతుకు పోయాయి?
“ పెరుగుతున్న పెట్రోలు, గ్యాస్ ధరలు
నింగినంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు
దరిమిలా భారమవుతున్న సామాన్యుల బ్రతుకులు..
అయినా సరే చలనంలేని నేటి పాలనా యంత్రాగాన్ని చూసి”.

దేనికో భయపడుతున్నట్లున్నావు?
“ ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రయివేటు పెట్టుబడిదారుల పాలు చేసి, కూలీ నాలి వంటి పనులు కూడా ఉద్యోగ కల్పనకే వస్తాయంటూ… చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సామాజిక బాధ్యతను విస్మరిస్తున్న నేటి పాలకుల తీరును చూసి”.

మరి చిరునవ్వులేని ఆ మొహమేమిటి?
లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్న బాలబాలికలు భ్రూణ హత్యలతో రాలుతున్న పసిమొగ్గలు, పరువు హత్యల కిరాతకాలు డ్రగ్స్ కు బానిసలవుతున్న యువత…. ఇన్ని అనర్ధాలు జరుగుతున్నా సమాజ దృక్పథంలో మార్పురాని వైనాన్ని చూసి..చూసి.!.

మరి ఆ కడుపేమిటలా తరుక్కుపోయింది?
“ తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలులేక, అప్పులపాలవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతాంగ దుస్ధితి ఒక వైపు…. పరిమిత కాలపు నియమాకాలతో గాలిలో దీపం కాబోతున్న వీర సైనికుల ఉద్యోగాలు మరోవైపు.. కార్పేరేట్ సంస్ధల పాలవుతున్న టెక్నాలజీ వృద్ధి ఫలాలు ఈ విధంగా “ జై జవాన్… జై కిసాన్.. జై విజ్ఞాన్” అనే మహాత్ముల నినాదం ప్రకటనలకే పరిమితం అయిపోతున్నందుకు”.

ఇన్ని అనార్ధాలు జరుగుతున్నా పాలనచేసే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు..?
“ ఈ రోజు తిండిలేకపోయినా, రేపు తినబోయే పంచభక్ష్య పరమాన్నాల గురించి ప్రజల్ని ఊరించేవాడే నేటి రాజకీయ నాయకుడు… వారందరు ఆ పనిలో ఉన్నారు”.

అలాంటప్పుడు ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు చేసే వాగ్ధానాలను ప్రజలు ఎలా నమ్ముతున్నారు?
“ అడ్వర్టయిజ్మెంట్ సూత్రం ప్రొడక్టును అమ్మగలదు… నాణ్యత అనవసరం.. ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్…!!… ఈ టెక్నిక్ నే రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయి… తాము చేస్తున్న వాగ్ధానాల రూపంలో…!

మరి అటువంటి వాగ్ధానాల అమలు విషయంలో జరుగుతున్నదేమిటి?
“ పర్వతాన్ని నా భూజాన మోసి చూపిస్తాను అని ప్రజల ముందు జబ్బలను చరచుకోవడం వంటిదే… ఎటొచ్చీ ఆ పర్వతాన్ని భుజాన ఎవరు పెడతారు అనేదే ఇక్కడున్న అసలు సమస్య.. ఆచరణ సాధ్యంకాని వాగ్ధానాల విషయంలో కూడ అంతే!

ప్రజాసామ్యంలో బానిసత్వం అంటే ఏమిటో ఒక్క మాటలో చెబుతావా కామన్ మ్యాన్??
“ పొలిటిషీయన్స్ ను సెలెబ్రిటీలు గా చూడటం…….. తరతరాలు ఒకటి రెండు మూడు కుటుంబాలకు చెందినవారి పెత్తనానికి అలవాటు పడటం… సమాజంలో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిని మాత్రమే సమాజాన్ని పాలించే హక్కును కలిగి ఉన్నవారిగాను….మిగిలిన వారందరు పాలితులుగాను చూసుకోవడాన్ని రివాజుగా చేసేసుకుని సంతృప్తి పడటం… !

తరుచు పెళ్లిళ్ళను పెటాకులు చేసుకుంటున్న నేటి సినీ సెలబ్రిటీల గురించి కూడా ఓ మాట చెబుతావా?
“ఇటువంటి వారందరూ పాశ్చాత్త్య దోరణుల, విశృంఖలత్వాలకు బ్రాండ్ అంబాసిడర్ లు” …ఎందుకంటే వీరందరి దృష్టిలో వివాహ వ్యవస్ధ అంటే పరిమిత కాలానికి సంబంధించిన ఓ కాంట్రాక్ట్ వ్యవహారం వంటిది..

కాస్త అర్ధం అయ్యే విధంగా చెబుతావా కామన్ మ్యాన్.??.
“బంధం ముగిసినా.. మా మధ్య స్నేహం కొనసాగుతుంది. అంతేకాదు నా పిల్లలు.. తన పిల్లలు కలిసి మా ఇద్దరి పిల్లలతో ఇకపై కూడా సామరస్యంతోనే మసులుకుంటారు” అంటూ తమ “బహు పర్యాయల వివాహాలను” తరచు పెటాకులు చేసుకుంటున్న కొందరు సిని సెలెబ్రెటీలు బరితెగిస్తూ పలికేస్తుంటారు.. ఇటువంటి సంఘటనలు మన యువతపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి…!

కుల,మత వివక్షతలపై పోరాటం చేసే సంఘాల పనితీరు గురించి నీ కామెంట్ ఏమిటి?
“ కుల, మత బేధాలకు వ్యతిరేకంగా పోరాడటానికి అంటూ అన్ని కులాల వారితో హాడవిడిగా స్టీరింగ్ కమీటిల ఏర్పాటు చేస్తున్నాయి…. కాని క్షేత్ర స్ధాయికి వచ్చేటప్పటికి రాజకీయ పార్టీల ప్రభావంతో, సదరు స్టీరింగ్ కమిటీలలో “మా కులం వారికి” తగిన ప్రాధాన్యత లేదంటూ సదరు స్టీరింగ్ కమిటిల నుండి కొందరు వైదొలగుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి” ఇది నేటి ఆయా సంఘాల పనితీరు…!

ఇంతకీ సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి కామన్ మ్యాన్?
“అవకాశవాద రాజకీయ నాయకులను తరిమి కొట్టండి… మనదేశ సంస్కృతి, సంప్రదాయలకు తూట్లు పొడుస్తున్న సిని సెలెబ్రెటీలను పిచ్చిగా ఆరాధించడం మానండి… మన దేశ వివాహ వ్యవస్ధలో ఉన్న గొప్పతనాన్ని, పవిత్రతను కాపాడండి…..సామాజిక స్పృహతో వ్యవహరిస్తూ..సమాజం పట్ల బాధ్యతతో మసులుకోండి.

-శ్రీపాద శ్రీనివాసు

LEAVE A RESPONSE