– ఇక్కడ 50వేల మంది పనిచేసేందుకు అవకాశం
– ఆసక్తి చూపిస్తున్న ఐటీ, ఇతర కంపెనీలు
– రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు
– నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం
– నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సమీక్షలో మంత్రి నారా లోకేష్
ఉండవల్లి: ఐటీ, ఇతర కంపెనీలు మంగళగిరికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్ లో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో మంగళవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టిసారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండో విడతలో రెండు వేల ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం
ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉంది.. ఇందుకు అవసరమైన స్థల సేకరణపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడ్రన్ లైబ్రరీ, పార్క్ లు, స్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులపైనా మంత్రి సమీక్షించారు.
ఈ సమావేశంలో గుంటూరు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, జిల్లా పరిషత్ సీఈవో జ్యోతిబసు, తదితరులు పాల్గొన్నారు.