– అమరావతి భూములపై బీజేపీ నేత లంకా దినకర్ కొత్త మెలిక
అమరావతి భూములను తాకట్టు పెట్టి రుణం తీసుకుందామన్న జగన్ సర్కారు ప్రయత్నాలను బీజేపీ నేత లంకా దినకర్ తన లెక్కలతో కొత్త చిక్కుల్లో పడేశారు. అప్పు కోసం స్వయంగా ప్రభుత్వమే అమరావతిలో ఎకరం 7 కోట్లుగా ప్రకటించింది కాబట్టి, మరి ఆ లెక్కన రైతులకు ఎకరానికి అదే 7 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలన్న లంకా దినకర్ కొత్త మెలిక, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఆ మేరకు ఆయన గణాంకాలతో ఇచ్చిన వివరాలు చర్చనీయాంశమవుతున్నాయి.
లంకాదినకర్ ఏమన్నారంటే..
స్మశానం,ఎడారి అన్న అమరావతిలో ఎకరా 7 కోట్లుగా చూపి, 3 వేలకోట్లు అప్పు తెద్దామని ప్రతిపాదన ఎలా పెట్టారో జగనన్న చెప్పాలి. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కనీసం ఒక ఎకరా కి 7 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. భూసేకరణ చట్టం,2013 ప్రకారం అయితే, అమరావతి లో మీరు తెలిపిన ఒక ఎకరాకి 7 కోట్లు విలువకి 3 రెట్లు కలిపి ఇవ్వాల్సి ఉంది. 3 వేల కోట్ల అప్పు 7 నుంచి 8 శాతం వడ్డీ తో 481 ఎకరాలు అమ్మి 15 సంవత్సరాలలో తీరుస్తాం అంటే అర్థం ఏంటీ? అమరావతి స్వయం ప్రకాశ ఆర్థిక చోదక శక్తి అని ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. సీఆర్డీఏ చట్టం లో నిబంధనల మేరకు ఏ విధమైన సవరణలు లేకుండా మాత్రమే అమరావతిని అభివృద్ధి చెయ్యాలి.