– ఎంపీ విజయసాయి రెడ్డి
ఏప్రిల్ 25: రబీ ధాన్యం కొనుగోలు సందర్భంగా ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా సంపూర్ణ మద్దత్తు లభిస్తోందని అన్నారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలను వెల్లడించారు. ధాన్యం సేకరించిన అనంతరం రైతుకు విధిగా రసీదు అందించాలని, ప్రతి పంటకూ మద్దత్తు ధర దక్కేలా పర్యవేక్షించాలని, సీఎం యాప్ ద్వారా మాక్ డ్రిల్ నిర్వహించాలని, నాణ్యతా ప్రమాణాలతో పాటు 1967 టోల్ ఫ్రీ నంబర్ పై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. దళారులు, మిల్లర్ల ప్రమేయానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారని అన్నారు.
ఫ్యామిలీ డాక్టర్ సేవల్లో వైద్య కళాశాలల భాగస్వామ్యం
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మరింత సమర్థంగా నిర్వహించటానికి వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. వైద్య కళాశాలల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ద్వారా కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారని, నోడల్ ఆఫీసర్లుగా ఆ విభాగాధిపతులు వ్యవహరించనున్నారని తెలిపారు. అలాగే మూడు నెలలకోసారి విద్యార్థులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి దానికి అనుగుణంగా కార్యక్రమంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు.
లక్ష్యానికి మించి ఎంఎస్ఎంఈలకు రుణాలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వాటికి లక్ష్యానికి మించి రుణాలను పంపిణీ చేసిందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఏడాదిలో లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా కేవలం 9 నెలల్లోనే రూ.53,419 కోట్లు రుణాలకు పంపిణీ చేసి ఎంఎస్ఎంఈలకు ఆదుకుందని అన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహించి ఉద్యోగులకు కాపాడిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు.
జల సంరక్షణలో ఏపీ బేష్
దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో, జల సంరక్షణలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం సంతోషకరమైన విషయమని విజయసాయి రెడ్డి అన్నారు. జలమే జీవమనే సూక్తిని ఆచరిస్తూ అందరూ నీటి సంరక్షణకు పాటుపడాలని కోరారు. దేశంలో నీటి కొరత లేదని కేవలం నీటి నిర్వహణలోనే సమస్యలున్నాయని అన్నారు. సమస్యలను చక్కదిద్దుకొని విశ్వనగరాలు నిర్మించాలని అన్నారు.
ఈ కామర్స్ పోర్టల్ తో చేనేత కార్మికులకు, హస్తకళాకారులకు లబ్ధి
చేనేత వస్త్రాలకు, హస్తకళలకు ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించిన ఈ కామర్స్ పోర్టల్ ద్వారా 35 లక్షల మంది చేనేత కార్మికులు, 27 లక్షల మంది హస్తకళాకారులు లబ్ధి పొందుతారని విజయసాయి రెడ్డి తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేనేత కార్మికులు, హస్తకళాకారులు వారు తయారు చేసిన ఉత్పత్తులు ఈ కామర్స్ పోర్టల్ సహాయంతో నేరుగా వినియోగదారులకు అందించవచ్చని ఆయన తెలిపారు.