కెసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రధాన బ్యారేజ్/మేడిగడ్డ బ్రిడ్జ్ 19వ పిల్లర్ కుంగిందని, నేర్రులు చీలాయని, దాని ప్రభావం 18, 20, 21 పిల్లర్స్ పైన పడే ప్రమాదం ఉందని మేడిగడ్డను పరిశీలించిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం అభిప్రాయపడ్డట్లు వార్తలొచ్చాయి.
జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ ధ్వంసమై, ప్రాజెక్టు నిర్మాణమే సంక్షోభంలోకి నెట్టబడింది. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతూ, ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలపై చూసీ చూడనట్లు వ్యవస్థలు వ్యవహరించడం పర్యవసానంగానే ఈ దుస్థితి నెలకొన్నది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది, ప్రాజెక్టుల దిగువన జీవిస్తున్న ప్రజల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయి.

సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక