Suryaa.co.in

Telangana

టి.ఆర్.ఎస్ విధానాలను ఖండించండి

– బి.సి. స్టడీ ఫోరం చైర్మన్ సాయిని నరేందర్

టి.ఆర్.ఎస్ పార్టీ అధికార దర్పం కోసం, ఆ పార్టీ బలంగానే ఉందని ప్రజలను నమ్మించడం కోసం వరంగల్ మహానగరంలో విచ్చలవిడిగా వేల ఫ్లెక్సీలు కట్టి పర్యావరణానికి విఘాతం కలిగించడాన్ని ప్రతిఒక్కరూ ఖండించాలని బి.సి స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ సాయిని నరేందర్ అన్నారు. పురపాలక శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కెటిఆర్ బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా గల్లీ నుండి రాష్ట్ర నాయకుల వరకు, మామూలు కార్యకర్త నుండి మంత్రి వరకు వేల స్వాగత ఫ్లెక్సీలు కట్టి రెండు జిల్లాలను ఫ్లెక్సీల మయం చేయడం సబబు కాదని ఆయన విమర్శించారు.

గతంలో ఇదే కెటిఆర్ ఫ్లెక్సీల వల్ల పర్యావరణ దెబ్బతింటుందని, నగరాల్లో ఎక్కడ ఫ్లెక్సీలు కట్టరాదని నిబంధనలు పెట్టారు. అదే కెటిఆర్ పర్యటనలో ఇంత విచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెడితే కెటిఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడో తెలుపాలని డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలతో పర్యావరణకు నష్టం చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో పలుకుబడి కోల్పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి హంగు ఆర్భాటలకు పాల్పడుతోందని దాని ద్వారా పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతుదని, ఇలాంటి విషయాలను ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి వేల మొక్కలు నాటుతున్న ప్రభుత్వం ఫ్లెక్సీలతో నష్టం చేయడం ఎంతవరకు సబబో కెటిఆర్ తెలపాలని నరేందర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE