Suryaa.co.in

Andhra Pradesh

నేడు అన్ని పాలిటెక్నిక్ లలో పాలిసెట్ గ్రాండ్ టెస్టు నిర్వహణ

-పాలిసెట్ ప్రవేశ పరీక్షపై అవగాహన కల్పించేలా గ్రాండ్ టెస్టు
-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్ – 2024“ సన్నాహక, సన్నద్దత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్ గ్రాండ్ టెస్టును ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నిర్వహించనున్నట్లు సాంకేతికి విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్య , శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు.

తొలుత ఈ పరీక్షను గురువారం నిర్వహించాలని భావించినా, ఎఫిఆర్ జెసి ప్రవేశ పరీక్ష నేపధ్యంలో విద్యార్దుల నుండి వచ్చిన వినతుల మేరకు ఒకరోజు ముందుగా నిర్వహిస్తున్నామన్నారు. పాలీసెట్ ప్రవేశ పరీక్ష కోసం సాంకేతిక విద్యా శాఖ ఏప్రిల్ 1వ తేదీ నుండి అందించిన ఉచిత శిక్షణకు ముగింపుగా, ప్రవేశ పరీక్షపై పూర్తి అవగాహాన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు పాలిటెక్నిక్స్‌లలో 7273, ప్రభుత్వ 12513 మంది విద్యార్థులు శిక్షణ పొందారన్నారు. వీరందరికీ అయా కేంద్రాలలోనే ఈ పరీక్ష నిర్వహిస్తారన్నారు.

పాలిసెట్ గ్రాండ్ టెస్టుకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, పాలిటెక్నిక్ లో చేరాలనుకునే ఏ విద్యార్ధి అయినా ఈ సదావకశాన్ని సద్వినియోగం చేసుకొని నేరుగా సమీప పరీక్షా కేంద్రాల వద్దకు నేరుగా వెళ్లి పరీక్షకు హజరు కావచ్చని నాగరాణి స్పష్టం చేసారు. ఏప్రిల్ 27న యధావిధిగా పాలిసెట్ 2024 నిర్వహిస్తామన్నారు. పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తు, పిన్న వయస్సులోనే ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సాంకేతికి విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు.

పాలిటెక్నిక్ విద్య పూర్తి అయిన వెంటనే సత్వర ఉపాధి అవకాశములను కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పoదములు చేసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లేబరేటరీలను ఆధునీకరించి, వసతి కల్పనను సైతం మెరుగుపరచామని నాగరాణి వివరించారు. ఎన్ బిఎ గుర్తింపు పొందిన 36 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ఈ విద్యా సంవత్సరము నుండి విద్యార్ధులకు మరింత మెరుగైన విద్యనందిచుటకు సాంకేతిక విద్యా శాఖ సంసిద్దంగా ఉందన్నారు.

LEAVE A RESPONSE