Suryaa.co.in

Andhra Pradesh

ఒకే ఆరోపణలపై రెండుసార్లు ఎలా సస్పెండ్ చేస్తారు?

-అవి నోట్‌ఫైల్‌లో ఏవీ?
-నాలుగుసార్లు చార్జిషీట్ వేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారు
-జగన్ సర్కారుపై క్యాట్ ప్రశ్నల వర్షం
-ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు విచారణ 29కి వాయిదా

అమరావతి: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఏబీ వెంకటేశ్వర రావు ఆశ్రయించారు..

దీనిపై మంగళవారం విచారణకు రాగా… ఒకే ఆరోపణలపై రెండవ సారి ఎలా సస్పెండ్ చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని బెంచ్ ప్రశ్నించింది. వేరే అంశాలు ఏవీ నోట్ ఫైల్‌లో లేవని బెంచ్ పేర్కొంది. ఛార్జ్ షీట్ నాలుగు సార్లు వేయడాన్ని ఏ విధంగా సమర్థించు కుంటారు అని ప్రశ్నించింది. అడ్వకేట్ జనరల్ వాదనతో సంబంధం లేకుండా రికార్డ్ ఉందంటూ బెంచ్ వ్యాఖ్యలు చేసింది.

పెగాసిస్, మీడియాతో మాట్లాడిన అంశాలపై ఏబీ వెంకటేశ్వర రావు స్పష్టంగా రిప్లై ఇచ్చినా ఎందుకు పట్టించు కోలేదని నిలదీసింది. పరిశీలించకుండా రెండవ సారి సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అవే ఆరోపణలపై రెండవ సారి విచారణ ఏమిటంటూ ప్రశ్నించిన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్.. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

కాగా.. ఏబీ వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో ఆయనపై వైసీపీ ఫిర్యాదులు చేయడంతో ఈసీ ఆయనను పదవి నుంచి తప్పించింది.

ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొనుగోలు చేసి, తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఏబీవీపై వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసి ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆపై సుప్రీం కోర్టుకు ఆదేశాలతో ఏబీవీ విధుల్లో చేరారు. అయితే రెండో సారి కూడా ఆయనను సస్పెండ్ చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌‌లో పిటిషన్‌ వేశారు.

గత వారం జరిగిన కేసు విచారణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కేసు ఫైల్‌ని బెంచ్ పరిశీలించింది. అది పరిశీలించాక.. సాక్షులను ఏబీవీ బెదిరించినట్లుగా చూపించే మెటీరియల్ ఎక్కడుందని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అలాగే ఏబీవీ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం దాఖలు చేసిన వ్రాతపూర్వక వాదనల్లో వాస్తవిక తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఏబీవీపై విధించిన సస్పెన్షన్ చెల్లదని, ఇది ఇకపై కొనసాగదని నొక్కి చెప్పారు

LEAVE A RESPONSE