Suryaa.co.in

Editorial

‘కమలం’లో లేఖల కలవరం

– టుబాకో బోర్డు చైర్మన్ పదవి అడ్డదారిలో కట్టబెట్టారని విమర్శలు
– సోము, సునీల్,మధుకర్ రెడ్డి త్రయం తీరుపై ధ్వజం
– ఓ అగ్రనేత తన ట్రస్టుకు నిధులు మళ్లిస్తున్నారంటూ ఆరోపణ
– పాత సంఘటనా మంత్రి కార్యకలాపాలపైనా ప్రస్తావన
– ‘కావలి కదలికలై’పెనా విసుర్లు
– కృష్ణానది ‘గెస్టుహౌస్ కళకళ’
– నాయకత్వం చర్యలు తీసుకోవాలంటూ లేఖ
– కమలంలో కలకలం సృష్టిస్తున్న నేతల లేఖ
– జిల్లా అధ్యక్షులకు లేఖలు రాసిన నేతలు
– ఆ నేతల పేర్లు తమకు తెలియవంటున్న పార్టీ కార్యాలయం
– అజ్ఞాత పేర్లతో లేఖల విడుదల
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీలో లేఖల కలవరం కలకలం సృష్టిస్తోంది. యశ్వంత్ అనే జూనియర్ నేతకు టుబాకో చైర్మన్ పదవి సిఫార్సు చేసిన అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి, కో ఇన్జార్జి సునీల్ దియోథర్ కలసి మూకుమ్మడిగా ఆ పదవిని అడ్డదారిలో కట్టబెట్టారంటూ జిల్లా పార్టీ అధ్యక్షులకు వచ్చిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఇది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

అయితే ఇది పార్టీలో పదవులు ఉన్న వారి లేఖలా కాకుండా, పార్టీలో అన్యాయం జరిగిన అజ్ఞాత కార్యకర్తల లేఖలా కనిపిస్తోంది. లేఖ రాసిన వారి పేర్లు తమకు తెలియవని పార్టీ నాయకులు చెప్పడం గమనార్హం. కాగా తనకు సమాచారం లేకుండా యశ్వంత్‌కు ఇచ్చిన టుబాకో బోర్డు చైర్మన్ ఉత్తర్వులు నిలిపివేయాలని.. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌జీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ‘పువ్వు’ పార్టీలో ‘పొగాకు’ సెగ

బీజేపీలో లేఖల కలకలం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కో ఇన్చార్జి సునీల్ దియోథర్, సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి వ్యవహారశైలిపై ఇటీవల కొందరు అజ్ఞాత వ్యక్తుల పేరుతో జిల్లా అధ్యక్షులకు లేఖలు రాయడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా పార్టీలో జూనియర్ అయిన యశ్వంత్ అనే నేతకు, ఏకంగా టుబాకో చైర్మన్ పదవి ఇవ్వడం కలకలానికి కారణమయింది. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. యశ్వంత్ పేరును మధుకర్‌రెడ్డి, సునీల్ దియోథర్ చేసిన సిఫార్సు మేరకు.. యశ్వంత్‌కు టుబాకో బోర్డు చైర్మన్ వచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలు, సీనియర్లలో కలకలం సృష్టించాయి.

దశాబ్దాల తరబడి పార్టీలో పనిచేస్తున్న తమను విస్మరించి, జూనియర్ అయిన యశ్వంత్‌కు ఆ పదవి ఇవ్వడం ద్వారా, తమ మనోభావాలతోపాటు సీనియారిటీని అవమానించారంటూ, పలువురు సీనియర్లు కారాలు మిరాయాలు నూరారు. సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిశోర్.. ఏకంగా ప్రధాని, అమిత్‌షా, జాతీయ సంఘటనా మహామంత్రి సంతోష్‌జీకి లేఖలు రాసిన వైనం సంచలనం సృష్టించింది.

కాగా ఈ ముగ్గురూ పార్టీని నాశనం చేస్తున్నారని, ఒక అగ్రనేత తన ట్రస్టుకు నిధులివ్వాలని పదవులు పొందిన నాయకులపై ఒత్తిడి తెస్తున్నారని, ఆ లేఖలో ఆరోపించారు. ఇద్దరు అగ్రనేతలు కృష్ణా నది తీరంలోని గెస్టుహౌస్‌లో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని, విజయవాడ-ఢిల్లీకి వారిని తీసుకువెళుతున్నారని, ఈ మొత్తం వ్యవహారంలో పాత సంఘటనా మంత్రి ప్రోత్సాహం ఉందని విమర్శించారు.

గతంలో ఆయన కూడా ఇలాంటి నిర్వాకాలే చేశారంటూ తమ లేఖలో తూర్పారపట్టారు. ‘కావలిలో అర్ధరాత్రి వేళ ’ నిత్యం కనిపించే ఈ నాయకుడు ఏం ఆరెస్సెస్ సిద్ధాంతాలు ఉన్నవాడు?’’ అని ఆ లేఖలో ప్రశ్నించారు. వీరిని తొలగించకపోతే జాతీయ నేతలకు సైతం తమ మరకలు అంటిస్తారని హెచ్చరించారు. ఈ ముగ్గురు నేతల బలహీనతలను ఆ లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమయింది.

అయితే లేఖలో పేర్కొన్న వై.వెంకట్‌రెడ్డి, యు.శ్రీనివాసులు పేర్లు తమకు తెలియవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే దీన్నిబట్టి .. పార్టీకి చెందిన నాయకులే మారు పేర్లతో, ఈ లేఖలు సృష్టించినట్లు స్పష్టమవుతోంది.

LEAVE A RESPONSE