Suryaa.co.in

Telangana

రాబోయేది కాంగ్రెస్ కూటమే

* కాంగ్రెస్ సంక్షేమానికి పట్టంకట్టే పార్టీ
* తెలంగాణకు షోలాపూర్ కు విడదీయలేని బంధం
* మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* తెలంగాణ ప్రజలున్న షోలాపూర్ లో మంత్రి ప్రచారానికి అపూర్వ స్పందన
* అడుగడుగునా జై జై లతో స్వాగతం పలుకుతున్న తెలుగు ప్రజలు
* రాబోయేది కాంగ్రెస్ కూటమే.. అండగా ఉండాలని ప్రజల్ని కోరుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి సుషీల్ కుమార్ షిండేతో సుదీర్ఘ సమావేశం
* మంత్రి ప్రచారసరళి చూసి సంతోషంవ్యక్తం చేసిన ప్రణితీ షిండే, సుషీల్ కుమార్ షిండే
* ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా ప్రజల్లోనే ఉంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
* మంత్రి వెంట ప్రచారంలో పాల్గొన్న జడ్చెర్ల శాసనసభ్యులు జనంరెడ్డి అనిరుద్ రెడ్డి

షోలాపూర్: మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూటమి బంపర్ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టబోతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, షోలాపూర్ పార్లమెంట్ సభ్యురాలు ప్రణితి షిండేతో కలిసి రెండు రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి.. కాంగ్రెస్ పార్టీ పట్ల మహా ప్రజల్లో ఆదరణ బాగుందని.. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్సే కావాలని ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.

ఉదయం మొదటి దఫా ప్రచారం పూర్తి చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సుషీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. రెండు రోజులుగా మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి.. తన ప్రచార అనుభవాలను సుషీల్ కుమార్ షిండేతో పంచుకున్నారు.

ప్రచారం సరళి, ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ గురించి వివరించారు. తెలంగాణకు చెందిన అనేక జిల్లాల నుంచి వచ్చిన చేనేత, యాదవ, కురుమ సోదరులు కాలనీలను ఏర్పాటు చేసుకున్నారని.. అక్కడికి వెళ్లగానే వారు అపూర్వ స్వాగతం పలికిన తీరు సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా మంత్రి షిండేకు వివరించారు.

తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు మంత్రి సుషీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పట్టంకట్టే పార్టీ అని.. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేేనని ప్రజలకు వివరించినట్టు ఆయన చెప్పారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కూటమి బంపర్ మెజార్టీతో గెలవబోతుందనేది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.

తెలంగాణకు షోలాపూర్ కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక జనాభా తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని సుషీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమావ్యక్తం చేశారు. ప్రచారంలో ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఈ సందర్భంగా సుషిల్ కుమార్ షిండే అభినందించారు.

LEAVE A RESPONSE