Suryaa.co.in

Telangana

కాంగ్రెస్‌ ప్రకటించింది దళిత డిక్లరేషన్‌ కాదు ఫాల్స్‌ డిక్లరేషన్‌

హంతకులే నివాళులర్పించినట్టుంది అమిత్ షా సభ
మూడు నల్ల చట్టాలు తెచ్చి 850మంది రైతుల మరణాలకు కారణమైన పార్టీని రైతులు ఎలా నమ్ముతారు
కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించడం అర్రాస్ పాట పాడినట్లు ఉంది
అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలి
ఎమ్మెల్సీ కవిత

రైతులపై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు లేని ప్రేమను ఒలకబోస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ దళిత డిక్లరేషన్ సభ, బిజెపి నిర్వహించిన రైతు భరోసా సభను చూస్తుంటే… లేనిపోని కల్లిబిల్లి మాటలు చెప్పి రైతుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు.

దేశంలో అత్యధిక సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ దళితులను ఎప్పటికీ దారిద్రయ రేఖకు దిగువనే ఉంచారు కానీ పైకి తీసుకువచ్చే పాపానపోలేదని మండిపడ్డారు. తెలంగాణలో సబ్బండవర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ దళితులు పేదలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు.

ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ ప్రజలు చెబితే ప్రజలు నమ్మరని భావించి మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి సభ నిర్వహించారని తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదే కాంగ్రెస్ వాళ్లు కొత్తగా చెబుతున్నారని, అర్రస్ పాట పాడినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బందు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే… వాళ్లు 12 లక్షలు ఇస్తామంటున్నారని, పెన్షన్ 2000 ఇస్తుంటే 4000 ఇస్తామని అంటున్నారు అని ఎద్దేవా చేశారు.

కేవలం ఇది కాంగ్రెస్ భావదారిద్రమెనని స్పష్టం చేశారు. దళితుల పట్ల రైతుల పట్ల ప్రజల పట్ల ప్రేమ లేదని అన్నారు. నిజంగానే తెలంగాణ ప్రజలను ఉద్ధరించాలన్న ఆలోచన కాంగ్రెస్ కు ఏమీ లేదని, కేవలం రాజకీయ అవసరాల కోసం తప్పితే మరి ఏమీ కాంగ్రెస్కు పట్టవని ఫైర్ అయ్యారు.

దేశంలో దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని, తెలంగాణలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందని తెలిపారు. మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. తప్పుడు డిక్లరేషన్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇచ్చిన హామీని అమలు చేసే చరిత్ర కాంగ్రెస్కు లేదని అన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పెద్దపెద్ద హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి వాగ్దానాలను అమలు చేయలేకపోతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు చేసే శక్తి లేనప్పుడు హామీలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన దళిత డిక్లరేషన్ అబద్ధం గా భావిస్తున్నామని ప్రకటించారు. ప్రజలు ఇటువంటి మాటలు మాట్లాడకుండా విజ్ఞత ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు.

అమిత్ షా తెలంగాణకు వచ్చి రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఇది హంతకులే నివాళులర్పించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. చావగొట్టి చెవులు మూసి ఫోటోకి దండేసినట్లు ఉందని అన్నారు. మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి 850 మంది రైతుల మరణాలకు భారతీయ జనతా పార్టీ కారణమైందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లు ఉంటే వాటికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, కానీ బిజెపి పార్టీ ఏమో ఆ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటున్నదని విమర్శించారు. 25 వేల కోట్ల నష్టాన్ని భరించి కూడా తెలంగాణ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టమని ప్రకటించిందని తెలిపారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని బిజెపి రైతుసభలు పెడుతున్నదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి కేంద్ర ప్రభుత్వం ఏదో పేరుతో అదే తరహా పథకాన్ని అమలు చేస్తుందని, 13 కోట్ల మంది రైతులకు లబ్ధితో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆ పథకం లబ్ధిదారులను కేంద్రం గణనీయంగా తగ్గించిందని ఎత్తి చూపించారు.

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చిన నేపథ్యంలో తమ పార్టీ 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిందని, కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ బిజెపి పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని, మరి బిజెపి కాంగ్రెస్ పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో ప్రకటించాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE