– కేసీఆర్‌ను నమ్మని కాంగ్రెస్
– కర్నాటక సీఎం ప్రమాణానికి అందని ఆహ్వానం
– జగన్‌కూ అందని పిలుపు
– వారిద్దరూ బీజేపీ మద్దతుదారులన్న అనుమానమా?
– స్టాలిన్, నితీష్, మమత, అఖిలేష్, సోరెన్‌కు అందిన ఆహ్వానం
– గతంలో వారితో కేసీఆర్ చర్చలు
– ఇప్పుడు తనకు మినహా వారందరికీ కాంగ్రెస్ ఆహ్వానం
– బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ కేసీఆర్‌ను కాంగ్రెస్ నమ్మడ లేదా?
– కాంగ్రెస్ తన శత్రువులెవరో ఖరారు చేసుకుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
దక్షిణాదిలో బీజేపీకి ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్నాటకలో కమలాన్ని కమిలేలా ఓడించిన కాంగ్రెస్ పార్టీ.. తన శత్రువులెవరో, మిత్రులెవరో ఖరారు చేసుకుందా? భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అందుకు అనుగుణంగానే అడుగులేస్తోందా? మోదీపై యుద్ధం చేస్తున్నప్పటికీ కేసీఆర్‌ను, కాంగ్రెస్ నమ్మడం లేదా? కర్నాటక సీఎం సిద్దరామయ్య ప్రమాణస్వీకారానికి పంపిన ఆహ్వానాలు.. ప్రముఖులకు అందని పిలుపును బట్టి అది నిజమేననపిస్తోంది.
ప్రధానంగా బీజేపీపై మాటల యుద్ధం చేస్తున్న, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపకపోవడం.. ఆయన భేటీలు వేసిన వారిని మాత్రం, ప్రమాణ స్వీకారోత్సవ పేరంటానికి పిలవకపోవడం బట్టి.. కేసీఆర్‌ను కాంగ్రెస్ నమ్మడం లేదని స్పష్టమవుతోంది.
కర్నాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారం ఖరారయింది. శనివారం కంఠీరవ మైదానం కేంద్రంగా జరగనున్న సిద్దరామయ్య ప్రమాణ స్వీకారాన్ని, విపక్షాల ఐక్యతకు వేదికగా చాటాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ మేరకు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కాంగ్రెస్-మిత్రపక్షాలకు చెందిన సీఎం, రాజకీయ పార్టీల ప్రముఖులను ఆహ్వానించింది. అయితే అందులో బీజేపీని వ్యతిరేకించే తెలంగాణ సీఎం కేసీఆర్ గానీ, బీజేపీతో సత్సంబంధాలున్న ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యుపీ మాజీ సీఎం మాయావతికు ఆహ్వానాలు పంపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వీరిలో జగన్ మినహా.. మిగిలిన వారంతా బీజేపీపై యుద్ధం చేస్తున్న వారే. కానీ విచిత్రంగా వారె వరికీ కాంగ్రెస్ ఆహ్వానాలు పంపలేదు. అంటే ఆ మేరకు తనకు మిత్రులు-శత్రులు ఎవరో కాంగ్రెస్ నాయ త్వం నిర్ధారించుకున్నట్లు స్పష్టమవుతోంది.
వీరిలో గత కొద్దికాలం నుంచి బీజేపీ.. ప్రధానంగా ప్రధాని మోదీపై ప్రత్యక్ష దాడికి దిగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు, ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమయింది. ఎన్డీఏ సర్కారు విధానాలతోపాటు, అదానీపై జెపిసి వేయాలంటూ పార్లమెంటులో కాంగ్రెస్‌తోపాటు వివిధ పార్టీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. వాటికి కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా హాజరయింది. గతంలో కూడా మోదీ విధానాలకు నిరసనగా.. పార్లమెంటు బయట నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు, బీఆర్‌ఎస్ హాజరయింది.
కొద్దినెలల క్రితం కేసీఆర్ కుమార్తె కవిత, చెన్నై వెళ్లి కాంగ్రెస్ ప్రముఖులతో మంతనాలు సాగించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సహా, కాంగ్రెస్ ప్రముఖులతో భేటీ కావడం చర్చనీయాంశమయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాలే తప్ప, పెద్దన్నపాత్ర పోషిస్తే కుదరదని కవిత ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు.
దానితో కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ సఖ్యతకు ప్రయత్నిస్తోందన్న చర్చకు తెరలేచింది. ఒక దశలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుంటాయంటూ, మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దానిని కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ ఖండించి, తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించి, ఆ పుకార్లకు తెరదించారు.
అయినప్పటికీ, కాంగ్రెస్‌పార్టీ కేసీఆర్‌ను నమ్మకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి విభజనకు ముందు కూడా కేసీఆర్ తనకు ఇచ్చిన మాట తప్పి మోసం చేశారన్న ఆగ్రహం కాంగ్రెస్ ఇంకా చల్లారలేదంటున్నారు. అయితే అంతకుముందు మూడేళ్లూ.. మోదీ సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిన కేసీఆర్ పార్టీ వైఖరిని, కాంగ్రెస్ ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది.
దానితోపాటు.. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో, జనతాదళ్‌ను ప్రోత్సహించడం ద్వారా, ఓట్లు చీల్చి మళ్లీ బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న, కేసీఆర్ ఎత్తుగడను కూడా కాంగ్రెస్ గ్రహించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అది ‘ప్రమాణ స్వీకార పిలుపు’ ద్వారా స్పష్టమవుతోంది. అయితే ఓవైపు తన ను ఆహ్వానించకుండా.. తనతో సఖ్యతగా ఉంటున్న స్టాలిన్ సహా పలువురు ప్రముళులకు మాత్రం ఆహ్వానం పంపటం, బీఆర్‌ఎస్‌కు జీర్ణించుకోని అంశమే.
జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడదామంటూ, కేసీఆర్ ఎవరితోనయితే భేటీ అయ్యారో… ఇప్పుడు ఆ నేతలే కర్నాటకకు బయలుదేరటం కూడా కేసీఆర్‌కు షాకేనంటున్నారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బిహార్ సీఎం నితీష్‌కుమార్‌తోపాటు… శరద్‌పవార్, సోరెన్, అఖిలేష్‌యాదవ్, ఉద్ధవ్‌థాక్రేలతో.. గతంలో కేసీఆర్, ఆయా రాష్ర్టాలకు వెళ్లి మరీ భేటీ అయ్యారు. ఇప్పుడే అదే ప్రముఖులకు.. కర్నాటకలో జరిగే కాంగ్రెస్ సీఎం ప్రమాణోత్సవ పేరంటానికి, కాంగ్రెస్ ఆహ్వానాలు పంపడం బట్టి.. ‘జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ఒంటరి’ అన్న సంకేతాలు వెళ్లాయన్నది, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
సరే.. ఎలాగూ ఏపీ సీఎం జగన్, గత ఎన్నికల ముందు నుంచి బీజేపీతో తెరచాటు స్నేహం చేస్తున్నందున, ఆయనను సీఎం ప్రమాణ పేరంటానికి పిలవరన్నది ముందుగా ఊహించిందే. పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన..ఏ బిల్లునూ వ్యతిరేకించని వైసీపీని నమ్మకూడదని, కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభం నెలకొన్న ప్రతీసారీ కేంద్రమే ఆదుకుంటోంది. అదానీ-అంబానీలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటున్న జగన్.. కచ్చితంగా బీజేపీకి నమ్మినబంటుగానే కాంగ్రెస్ నిర్ధారించుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే కర్నాటక సీఎం ప్రమాణస్వీకారోత్సావానికి, ఆహ్వానం పంపించలేదన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.
ఇక నవీన్ ఎలాగూ ఎన్డీఏ మిత్రపక్షమే కాబట్టి, ఆయనకు ఆహ్వానం పంపించకపోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. మాయావతి బీఎస్పీకి బీజేపీ బీ టీమ్ ముద్ర ఉన్నందున ఆమెనూ ఆహ్వానించనట్లు కనిపిస్తోంది. ఆమెను ఈడీ,ఐటీలతో నియంత్రించారన్న ప్రచారం కూడా లేకపోలేదు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు ఆమ్‌ఆద్మీని.. బీజేపీ తెరాటు అస్త్రంగా ప్రయోగిస్తోందన్న అనుమానం, కాంగ్రెస్‌లో లేకపోలేదు. అందుకే డిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను, ఆహ్వానించలేదన్నది కాంగ్రెస్ నేతల విశ్లేషణ.
బీఆర్‌ఎస్, బీఎస్పీ, ఆప్, మజ్లిస్‌లను ప్రయోగించడం ద్వారా.. ఆయా పార్టీలు చీల్చే ఓట్లతో తిరిగి అధికారంలోకి రావాలన్నదే, బీజేపీ వ్యూహమన్నది కాంగ్రెస్ బలమైన అనుమానం. ఈ కారణాలతోనే కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ.. సీఎం ప్రమాణ పేరంటానికి పిలవలేదన్నది కాంగ్రెస్ వర్గాల విశ్లేషణ.