– తెలంగాణలో బడుగులకు గొడుగు పట్టిన ఘనత టీడీపీదే
– పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దుతో బీసీ,ఎస్పీలకు స్వేచ్ఛ
– బీసీలకు రాజకీయ జన్మనిచ్చిన ఘనత టీడీపీదే
– తెలంగాణ టీడీపీ ఆఫీసులో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం
ఆదివారం ఎన్‌టిఆర్ భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామభూపాల్ రెడ్డి మొదట జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్‌టిఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సామభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణను సాధించుకోవడానికి అనేక పోరాటాలు జరిగాయని అన్నారు. 1962లో పోరాటాలు ప్రారంభమైనాయి. ఆ పోరాటాల వల్ల 2014లో ఫలాలు వచ్చాయని అన్నారు. మా నీళ్లు, మా పాలన, మా ఉద్యోగాలు అని ప్రజలు ముఖ్యంగా యువత పోరాటాలు చేయడం జరిగిందని అన్నారు. నిజాం పాలన నుంచి పటేల్, పట్వారీ వ్యవస్థ, దళారీల వ్యవస్థ, పెట్టుబడి దారుల వ్యవస్థల మధ్య ప్రజలు నలిగిపోయారని అన్నారు.
ఎన్‌టిఆర్ ఒక్క కలం పోటుతో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు నిజమైన స్వాతంత్య్రాన్ని ఇచ్చారని అన్నారు. ఆనాడు పల్లెలలో పండగ చేసుకున్నారని అన్నారు. ఐటీని అభివృద్ధి చేసి హైదరాబాద్‌కు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు దే అని అన్నారు. ఎన్‌టిఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
తెలంగాణ బిడ్డలకు స్వేచ్ఛను ఇవ్వాలని చంద్రబాబు తీర్మానం చేసి తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చాలని లేఖ ఇచ్చారని అన్నారు. ఆ లేఖ ఇచ్చిన తర్వాతనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిందని అన్నారు. నిజాం సర్కారును గడగడలాడించిన తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలనను భరిస్తారా? ప్రజలు మళ్లీ తిరుగుబాటు చేసి బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కారని అన్నారు.
జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ… దశాబ్ధాల కల నెరవేరిన రోజు సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. తెలంగాణకు మంచి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తే మన ఆటలుసాగుతాయని టీడీపీపై విషం చిమ్మారని అన్నారు. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని దొరలరాజ్యంగా నిలిపారని అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం దిశగా, మహిళలకు ఆర్థిక స్వావలంబన గా చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉందని అన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడటంలో చంద్రబాబు కి ఆ క్రెడిట్ దక్కుతుందని అన్నారు. హైదరాబాద్‌లో పుట్టిన తెలుగుదేశం పార్టీని ఇక్కడి నుంచి తీసివేయడం ఎవరివల్లా కాదని అన్నారు.
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, అజ్మీరా రాజునాయక్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో తెలుగుదేశం పార్టీ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించిందని అన్నారు. ఎన్‌టిఆర్, చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో కనబడుతుందని అన్నారు.
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి, షేక్ ఆరిఫ్ మాట్లాడుతూ… రేపటి గురించి ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మేము తెచ్చాం అని చెప్పుకున్న వారిని ప్రజలు గమనించారని వారిని గత ఎన్నికలలో ఓడిరచారని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఒక విజన్‌తోటి తెలంగాణ ప్రాంతాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారని అన్నారు. రాబోయే రోజులలో ప్రజలకు సేవ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని అన్నారు.
తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు, డాక్టర్ పొగాకు జయరామ్ చందర్ మాట్లాడుతూ… ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తెలంగాణలో పోరాటం నిన్నమొన్న వచ్చింది కాదని అన్నారు. 1962లో సాయుధ పోరాటం నుంచి 2014 వరకు ఎన్నో పోరాటాలు జరిగాయని అన్నారు. పోరాటాల గడ్డ తెలంగాణ అని అన్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకాంతాచారిని గుర్తు చేసుకుందామని అన్నారు. పోరాటాల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం గానీ… తీసుకోవడం గానీ జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చింది ఎన్‌టిఆర్, టీడీపీయే అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే విజనరీ లీడర్ చంద్రబాబు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. 10 సంవత్సరాలు అధికారాన్ని అప్పజెప్పితే ఫోన్‌ట్యాపింగ్‌లో అడ్డంగా దొంగలు దొరికిపోయారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు టులెట్ బోర్డు పెట్టుకోవాలని హరీష్‌రావు గతంలో అన్నారని… ఇప్పుడు నువ్వు నీ పార్టీ ఆఫీసుకు టులెట్ బోర్డు పెట్టుకుంటావా? అని అన్నారు. దోచుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. 12 వందల మంది బలిదానాల తరువాత తెలంగాణ వచ్చిందని.. దొంగ దీక్షల వల్ల రాష్ట్రం రాలేదని అన్నారు. ఉద్యమంలో పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. అమరవీరుల కుటుంబాలందరినీ ఆదుకోవాలని అన్నారు. స్వేచ్ఛ తెలంగాణ, ప్రజల తెలంగాణ ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్, తెలుగునాడు కల్లు గీత కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు కొయ్యాడ స్వామిగౌడ్.. రాష్ట్ర అధ్యక్షులు గజేంద్రగౌడ్, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వేజెండ్ల కిశోర్‌బాబు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శులు బాల కృష్ణ, బాలాజీ గోస్వామి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గూడెపు రాఘవులు, కత్తి తమోదన్, జూబ్లీహిల్స్ డివిజన్ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.