Suryaa.co.in

Telangana

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్ద పీట

– కులగణన కాంగ్రెస్ తోటే సాధ్యం
– అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం
– కులగణనకు భావి ప్రధాని రాహుల్ గాంధీ దిశానిర్దేశం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందుకు సానుకూలం
– కాంగ్రెస్ హయాంలోనే ఓ.బి.సి లకు సముచిత స్థానం
-నిరంజన్ తో బి.సి కమిషన్ కు హుందాతనం
– బి.సి కమీషన్ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– హాజరైన వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
,సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తదితరులు

హైదరాబాద్: సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కులగణన కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు.

అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కులగణనకు భారత బావి ప్రధాని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.సోమవారం సాయంత్రం ఖైరతాబాద్ లో రాష్ట్ర బి.సి కమిషన్ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో పని చేస్తున్న నిరంజన్ తో బి.సి కమిషన్ చైర్మన్ హోదాకు హుందాతనం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్యాగం,నిజాయతీ నిబద్ధతలే నిరంజన్ కు ఇంతటి ఉన్నతి స్థానం దక్కిందన్నారు.

అటువంటి కమిషన్ కు చైర్మన్ గా నియమితులైన నిరంజన్ ఆధ్వర్యంలో జరగబోయే కులగణనకు నాతో సహా రాష్ట్ర మంత్రివర్గం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు తప్పకుండా సహాకరిస్తారన్నారు. జాతీయ స్థాయిలో కులగణనకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ,ఏ.ఐ. సి.సి అధ్యక్షుడు ఖర్గే లు ఆమోదించిన విషయాన్ని ఆయన ఉటంకించారు.

ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చట్టసభలతో పాటు ప్రతి వేదిక మీద కులగణన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ హయంలోనే ఓ.బి.సి లకు సముచిత స్థానం ఉంటుందన్నారు. పదవులతో పాటు పధకాలలోనూ ఓ.బి.సి లకు పెద్ద పీట వేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పి.సి.సి అధ్యక్ష పదవిని బి.సి లకు కేటాయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.భవిష్యత్ లోనూ బి.సి లకు కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు.అందుకు బి.సి లు సంఘటితమై కాంగ్రెస్ పార్టీకీ ,భవిష్యత్ ప్రధాని రాహుల్ గాంధీకి అండగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ యం.కోదండ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ పి.సి.సి అధ్యక్షుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE