– ప్రతి నెలా రూ.7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం
– గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కోట్లు మాత్రమే
– ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ దృష్టి
– బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బయటపెడుతూ పలు విషయాలను ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ప్రతి నెలా రూ.7,000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారనేది అబద్ధం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక దుష్ప్రచారానికి పాల్పడుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు రాష్ట్రం ప్రతి నెలా రూ.7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ.2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు.
వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే.. సీఎం రేవంత్ విలాసాలపై దృష్టి
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు.
రూ. 3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ. 1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ. 225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా వ్యవహరిస్తుందని, ఇది ప్రజా పాలన కాదని ఆయన ట్వీట్ చేశారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేటీఆర్ ట్వీట్
కేటీఆర్ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యాన్ చంద్ జయంతిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ఆటలు మనకు సహకారం, పోరాట స్ఫూర్తిని నేర్పిస్తాయని అన్నారు. “మనం కిందపడితే అది ముఖ్యం కాదు, మళ్లీ ఎలా పైకి లేచామన్నదే ముఖ్యం” అని పేర్కొన్నారు. కష్టాలను అధిగమించి మనకు స్ఫూర్తినిచ్చిన అద్భుతమైన క్రీడాకారులను మనం గౌరవించుకోవాలని పిలుపునిచ్చారు.