– భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్న కేటీఆర్
– రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతాం
– ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు
– తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతాం
– వచ్చే బడ్జెట్లో 20వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తాం
– తెలంగాణ భవన్లో బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం పైన ఆ పార్టీని ఎండగడతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి, అడుగడుగునా బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామన్నారు. తెలంగాణలో ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు.
రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభలో అపోజిషన్ లీడర్‌గా ఉన్న ఆయన వెంటనే ఈ అంశం పైన పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలన్నారు. ఒకవేళ కేంద్రంలోని బీజేపీ సహకరించకుంటే రాహుల్ గాంధీ ఎందుకు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తరు అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి నిజంగానే బీసీలపైన, 42 శాతం రిజర్వేషన్ల అంశం పైన చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు సైతం ప్రవేశపెట్టవచ్చు కదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ నుంచి ఎన్నికై ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్‌సభలో గళం లేవనెత్తాలన్నారు.
బీజేపీ పదేపదే బీసీల మాట చెబుతుంది కానీ వారికి రిజర్వేషన్ల నుంచి మొదలుకొని నిధుల అమలు దాకా, ఓబీసీ సంక్షేమ శాఖ వరకు అన్ని అంశాల్లో ద్రోహం చేస్తున్నదని, బీజేపీ చేస్తున్న మోసాన్ని సైతం ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చే విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కన పెట్టిందన్నారు. దీంతోపాటు బీసీలకు బడ్జెట్లో సంవత్సరానికి ₹20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.
వచ్చే బడ్జెట్లో 20వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించేలా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామని కేటీఆర్ తెలిపారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేస్తున్న మోసాన్ని గ్రామ స్థాయి వరకు వివిధ రూపాల్లో తీసుకువెళ్లాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు చేపట్టవలసిన కార్యాచరణ పైన కేటీఆర్ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని బీసీలు కేసీఆర్ వెంటే ఉన్నారని పార్టీ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ వర్గాలకు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఏ ఇతర ప్రభుత్వ చరిత్రలో ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని అన్నారు. ముఖ్యంగా కుల వృత్తులకు సహకారం అందించడం నుంచి మొదలుకొని విద్యారంగంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థల వరకు బీసీ వర్గాలకు కేసీఆర్ చేసిన మేలును తెలంగాణలోని బీసీలు గుర్తుంచుకున్నారని, వారంతా కేసీఆర్ వెంటే ఉన్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో బీసీ ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న మోసం పైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేస్తున్న మోసాన్ని పార్టీ నేతలంతా ప్రజల్లోకి తీసుకువెళ్తారని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలోనే పార్టీకి అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు బండ ప్రకాష్, మధుసూదనా చారి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, జోగు రామన్న, కర్నే ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.



