• ఉచిత విద్యుత్ కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని.. తెలంగాణ రైతాంగానికి పిలుపు
• 24 గంటల ఉచిత కరెంట్ రద్దు చేసి…3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ
• రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిది.. రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణం
• కాంగ్రెస్ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటి మర్చిపోదు
• కాంగ్రెస్ కాలంలో కరువులు.. కన్నీళ్లు.. కటిక చీకట్లు.. అప్పులు.. ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారు
• ఉచిత విద్యుత్ ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కేంద్రం కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదన్న కెటిఅర్
• 24 గంటల ఉచిత కరెంట్ ను కాపాడుకోవడం కోసం ఏకంగా 30వేల కోట్ల రూపాయలను వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడలేదు
• ఈ 24 గంటల ఉచిత విద్యుత్ వెలుగుల్ని వదులుకుందామా..?
• కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా..?
• చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలి
– వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ పై మండిపడ్డ మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ రైతుల్ని చంపుకుతినే రాబందని మరోసారి తేలిపోయిందన్నారు భారత రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని కాంగ్రెస్ చేసిన ప్రకటన ఆ పార్టీ రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు. 24 గంటల కరెంట్ రద్దు చేసి…3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠ అన్నారు.
తెలంగాణ రైతుకు ఉచిత విద్యుత్ ఊపిరిలాంటిదని, రైతుల ఊపిరిని ఆపేస్తామని, అన్నదాత ఉసురు తీస్తామని చెప్పడం కాంగ్రెస్ రాక్షస బుద్ధికి తార్కాణమన్నారు. నిన్నటిదాకా ధరణి రద్దు.. రైతుబంధు వద్దూ అంటూ ఇప్పటికే రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్న కాంగ్రెస్, ఇప్పుడు ఏకంగా ఫ్రీ కరెంట్ ను ఎత్తేస్తామన్న తన క్రూరమైన ఆలోచనను బయటపెట్టుకుందన్నారు. ఉచిత విద్యుత్ కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని.. తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కాలంలో తెలంగాణ రైతులు పడ్డ కష్టాలు..అనుభవించిన బాధలను తెలంగాణ ఎన్నటి మర్చిపోదన్నారు. కాంగ్రెస్ కాలంలో కరువులు.. కన్నీళ్లు.. కటిక చీకట్లు.. అప్పులు.. ఆత్మహత్యలతో అన్నదాతలు అరిగోస పడ్డారన్నారు.
కరెంట్ రాకడ.. ప్రాణం పోకడ తెలియదన్నట్టుగా ఆనాడు విద్యుత్ కోతలతో… చాలీ చాలని 3 గంటల నాసిరకం కరెంట్ తో రైతులు నరకం అనుభవించారన్నారు. కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్సఫార్మర్లతో ఎండిన పంటలు.. రైతుల ధర్నాలు.. సబ్ స్టేషన్లుపై దాడులతో పరిస్థితులు దారుణంగా వుండేవని, అలాంటి దుర్భరమైన పరిస్ధితులు గత 9 ఎళ్లుగా మారిపోయాన్నారు.
అర్ధరాత్రి అపరాత్రి దొంగరాత్రి మోటర్లు పెట్టడానికి పోయి పాములు కుట్టి..కరెంట్ షాకులు కొట్టి మృత్యువాత పడ్డ రైతులు కాంగ్రెస్ పాలన పరిస్ధితులను తలుచుకునేందుకు కూడా సిద్దంగా లేరన్నారు. ఒక్క కరెంటే కాదు… నాడు కాంగ్రెస్ హయాంలో ఎరువుల్ని పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్మే దుస్థితి ఉండేదని, కిలోమీటర్లు దూరం క్యూలైన్లలో చెప్పులు.. లాఠీచార్జీల దృశ్యాలే కాంగ్రెస్ పాలనా పాడుకాలంలో ఉండేవన్నారు. కాంగ్రెస్ కల్తీ పాలనలో రైతులకు దొరికింది కల్తీ విత్తనాలు..కల్తీ పురుగు మందులే అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతాంగాన్ని రక్షించుకోవడానికి ..వ్యవసాయాన్ని సంక్షోభంనుంచి బయటపడేయడానికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇచ్చిందన్న కెటిఅర్, ఇక్కడ సాగురంగానికి కరెంట్ ప్రాణావసరం అని గుర్తించి.. విద్యుత్ రంగంపై వేల కోట్లు వెచ్చించి 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించిందని తెలిపారు. కాళేశ్వరం.. మిషన్ కాకతీయ.. ఇతర ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు పండించుకొని సంతోషంగా వున్నారని, రైతుపచ్చగా వుంటే చూసి కళ్లుమండిన కాంగ్రెస్ శక్తులు నిరంతరం ఏవో కుట్రలు చేస్తూనే ఉన్నాయన్నారు.
కేంద్రంలోని బీజేపి సర్కారు.. ఉచిత విద్యుత్ ను ఎత్తివేసి మోటర్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రం మెడపైన కత్తిపెట్టినా ప్రభుత్వం లొంగిపోలేదన్న కెటిఅర్, 24 గంటల ఉచిత కరెంట్ ను కాపాడుకోవడం కోసం ఏకంగా 30వేల కోట్ల రూపాయలను వదులుకున్నది తప్ప రైతుల ప్రయోజనాలపై రాజీపడబోమన్నారు.
దేశానికే అన్నంపెట్టే స్థితికి ఎదిగిన తెలంగాణ అన్నదాతను చూసి కాంగ్రెస్ పార్టీకి కళ్లు మండుతున్నాయని మండిపడ్డారు. రైతులు బాగుపడటం చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పచ్చివిషం గక్కుతున్నాయని, భూమి చుట్టూ వున్న చిక్కుల్ని తొలిగించి.. పక్కా రక్షణనిచ్చిన ధరణి పోర్టల్ ను రద్దుచేస్తామంటున్న కాంగ్రెస్.. మళ్లీ నాటి బ్రోకర్లు.. దళారుల భూదందాల కాలాన్ని తీసుకొస్తామని నిస్సిగ్గుగా ప్రకటించిందని దుయ్యబట్టారు. అదీ చాలక..24 గంటల ఉచిత విద్యుత్ అవసరమే లేదని.. మళ్లీ నాటి కాంగ్రెస్ చీకటి కాలాన్ని తిరిగితెస్తామని సిగ్గులేకుండా చెబుతున్నదనీ అన్నారు.
ఈ 24 గంటల వెలుగుల్ని వదులుకుందామా..? కటిక కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా..? చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ వద్దన్నవాడిని ఊరిపొలిమేర్లకు రాకుండా ఉరికించాలని, మూడు గంటల కరెంట్ చాలు అన్నవాడి మాడు పగిలేలా జవాబు చెప్పాలన్నారు. రైతులను పొడుచుకుతింటానికి కాచుకు కూర్చున్న కాంగ్రెస్ రాబందుల్ని తరిమికొట్టి.. రైతుబంధువులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు కేటిఅర్.