-ప్రజాపాలన గాలికి.. కొత్త రేషన్ కార్డుల జారీ ఇంకెప్పుడు?
-కాంగ్రెస్ సర్కారు విద్యార్థి, యువజన, నిరుద్యోగుల విరోధి
-పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు
-సర్టిఫికెట్లు ఇచ్చేందుకు యాజమాన్యాలు నో
-ఉన్నతవిద్యకు పేద విద్యార్థులు దూరం
-ఎంఎస్‌ఎంఈలకు ఆగిపోయిన సబ్సిడీలు
-రూ.3,300 కోట్లకు పైగా బకాయిలుపెండింగ్
-నత్తనడకన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం స్కాం విచారణ
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలనను గాలికి వదిలేసి, కేవలం మాటలు, మూటలు, ముఠాలతోనే కాలం వెల్లదీస్తోందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డా. ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ విమర్శించారు.
విద్యార్థులు, యువత, నిరుద్యోగులు, రైతులకు అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో మాత్రం వెనుకడుగు వేస్తోందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లను ఏర్పాటు చేసుకున్నవారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు నిలిచిపోయాయన్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న రూ. 3,300 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్యారంటీ పథకాలను రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తామని చెప్పడంతో కార్డులు లేని వాళ్లు ఆ పథకాలను అందుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో స్కాం, సెక్రటేరియట్ నిర్మాణంలో అత్యధిక వ్యయానికి సంబంధించిన అంశాలపై విచారణ జరపడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడగు వేస్తోందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజల పక్షాన బిజెపి పోరాటం చేస్తుందని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాల బకాయిలు కొండలా పేరుకుపోయాయన్నారు. ముఖ్యమంత్రి నుంచి మొదలు సంబంధిత మంత్రుల వరకు ఫీజు రీయింబర్స్ మెంట్ త్వరలోనే చెల్లిస్తామని మాటలు చెప్పారు. ఇంతవరకు బకాయిలు చెల్లించింది లేదు. విద్యాసంస్థలకు ప్రభుత్వం సుమారు రూ. 6500 కోట్ల బకాయిలు చెల్లించాలి.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు నిలిచిపోయాయి. సబ్సిడీ బకాయిలు చెల్లించాలి.రాష్ట్రంలో 15 వేల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీ కింద సుమారు రూ.3,300 కోట్ల బకాయిపడింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉండటంతో విద్యాసంస్థల మేనేజ్‌మెంట్లు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా ఇవ్వాల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ పథకం అమలుకు కమిటీని నియమించినట్లు తెలిపింది. కాని, అమలులో మాత్రం ముందడుగు వేయలేదు.
ప్రతి ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డే ప్రామాణికం.. వివిధ రకాల ఉపకార వేతనాలు అందాలన్నా రేషన్ కార్డే ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా కూడా రేషన్ కార్డుల ఊసెత్తక పోవడంతో కార్డులు లేని వాళ్లు ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం వెంటనే అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలి.
ప్రజాపాలన అంటూ మాటలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కేవలం మాటలకే పరిమితమయ్యారు. ప్రజాభవన్ లో తొలినాళ్లలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. క్రమేణా తగ్గుతూ పదుల సంఖ్యకు పడిపోయింది. ముఠాలు కట్టడంలో ఆరితేరిన కాంగ్రెస్ నాయకులు.. మూటలను ఢిల్లీకి పంపడమే కర్తవ్యంగా పెట్టుకున్నారు.ఇప్పుడు శాసనసభ సమావేశాలు నిర్వహించి ఉద్దరిస్తామంటూ వ్యవహారం నడుపుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, డ్రగ్స్ కేసు, సెక్రటేరియట్ నిర్మాణంలో భారీ వ్యయానికి సంబంధించిన విషయాల్లో విచారణ మూడు అడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రభుత్వ నియామకాలకు సంబంధించి పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఒక్కో పోటీ పరీక్ష మధ్య నిర్ణీత కాల వ్యవధి ఉండాలి. కాని, విద్యార్థులే, నిరుద్యోగుల మధ్య గొందరగోళం నెలకొంది.
వైద్యశాఖలో అత్యవసర సేవలు అందించే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ప్రైవేటు మెడికల్ షాపులకు వెళ్లి మందులు కొనుక్కొనే పరిస్థితి ఎదురైంది. ఈ అంశాలపై భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తుంది.