Suryaa.co.in

Telangana

రైతు రుణమాఫీ మార్గదర్శకాలు నిలిపివేయాలి

-ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింప చేయాలి
-తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు కోసం విడుదల చేసిన మార్గదర్శకాలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం గానూ, వీటి వలన లక్షలాదిమందికి రుణమాఫీ అందకుండా పోతుందని, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు సవరించి షరతులు ఎత్తివేసి కట్ ఆఫ్ తేదీల మధ్య ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం హేమంతరావు ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఆచరణలోకి వచ్చేసరికి అందరికీ రుణమాఫీ చెందకుండా షరతుల విధించడం సమంజసం కాదన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ కొందరికి చేసి, కొందరికి ఎగనామా పెట్టడంతో రైతుల ఆగ్రహానికి గురైందని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ అందిస్తామని చెబుతూనే, కుటుంబాన్ని నిర్ధారించడానికి ఆహార భద్రత కార్డు ప్రామాణికంగా తీసుకుంటామని, రైతు రుణ ఖాతా ఆధార్, పాస్ బుక్ ఆధార్, రేషన్ కార్డ్ ఆధార్ లింకు ఆధారంగా రుణమాఫీ అమలు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి కిసాన్ పథకం మినహాయింపులను పరిగణలోకి తీసుకోవాలని మార్గదర్శకాలలో చెప్పడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ ఎన్నికల వాగ్దానాన్ని తుంగలో తొక్కడమే అవుతుందన్నారు.

ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు మాత్రమే ఇటువంటి షరతులు పెడుతుందని విమర్శించారు. కుటుంబం నిర్ధారించుకోవడానికి రేషన్ కార్డు ప్రామాణికం అవసరం లేదని, భార్యాభర్తలు, మైనర్ పిల్లలు కుటుంబంగా పరిగణిస్తారని గత రుణమాఫీ సమయంలో ఇదే పద్ధతి అనుసరించారని, ఇప్పుడు అదే పద్ధతి అనుసరించవచ్చని, రేషన్ కార్డు ప్రామాణికం అయితే అనేకమందికి రేషన్ కార్డులు లేవని, గత పది సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఉన్న కార్డులో కూడా చాలామందికి వివాహాలు అయి వారు వేరే కుటుంబం గా మారారని, దీనివలన అనేకమంది రుణమాఫీకి దూరమవుతారని పిఎం కిసాన్ మినహాయింపులను పరిగణలోకి తీసుకోవడం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రుణమాఫీ అమలు పట్ల చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉంటే కొద్దిమంది రైతు కుటుంబాలు మాత్రమే పీఎం కిసాన్ అందుతున్నదని అన్నారు. ఒకవైపు ప్రతి రైతుకు రుణమాఫీ అందిస్తామని చెబుతూనే మరోవైపు ఇటువంటి షరతులు పెట్టి కోతలు పెడుతుందని విమర్శించారు. రీ షెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదని ప్రభుత్వం చెప్పడం భావ్యం కాదని. కరువు, వరదలు వచ్చినప్పుడు రుణాలు రీ షెడ్యూల్ చేసుకున్నారని, గత ప్రభుత్వం కూడా రీ షెడ్యూల్ చేసుకున్న రైతులకు అన్యాయం చేసిందని, ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తుందన్నారు.

రెండు లక్షలకు మించి ఉన్న మొత్తం కడితేనే మాఫీ వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అందరికీ రుణమాఫీ వస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయని, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు నిలుపుదల చేసి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, కాలయాపన చేయకుండా తక్షణం రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేసింది. లేనిచో ప్రజల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని అన్నారు

LEAVE A RESPONSE